vileenamతగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలంగాణ ప్రజాసమితి నేత డా|| మర్రి చెన్నారెడ్డి 1969లో అక్టోబర్‌ 10న సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ రెండవ వారం నుండి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థులు హాజరవుతున్నారు. ‘చదువు-పోరాడు’ అనే వైఖరిని విద్యార్థులు అవలంభిస్తున్నారు.

ఈ సత్యాగ్రహ పిలుపుకు విద్యార్థిలోకం గతంలోవలె స్పందించలేదు, జనవరి నుండి జూన్‌ వరకు సాగిన ఉద్యమంలో ఏ నేత పిలుపు నిచ్చినా వేలాది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చేవారు. ప్రధాని ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని నిర్ణయానికి వచ్చిన ఉద్యమ కారుల్లో కొంత అసంతృప్తి బయల్దేరింది. విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఒక విద్యా సంవత్సరాన్ని పదవ తరగతి, ఇంటర్‌ చదివే విద్యార్థులు ఇప్పటికే నష్టపోయినందున బలవంతంగా తమ పిల్లల్ని స్కూళ్ళకు, కాలేజీలకు పంపిస్తున్నారు.

మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం జరిగింది. ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు మల్ల్లికార్జున్‌ అక్కడికక్కడే తాను తెలంగాణ కోసం ఆమరణ దీక్షను చేయనున్నట్లు ప్రకటించారు. ఆ రోజునుండి ఆయన దీక్ష ప్రారంభమైంది. నిషేధాజ్ఞలు ఉన్నా భారీసంఖ్యలో ప్రజలు ఈ సత్యాగ్రహనికి హాజరైనారు. ట్రాఫిక్‌కు మహాత్మాగాంధీ రోడ్డులో అంతరాయం కలిగింది, మరో దారిలో ట్రాఫిక్‌ మళ్ళించారు. మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్‌ వంటి ముఖ్యనేతలు అక్కడ వున్నందున పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. కానీ ఆబిడ్స్‌, నగరంలోని ఇతర ప్రాంతాల్లో తెలంగాణ జిల్లాల్లోని పలు పట్టణాల్లో లాఠీచార్జీ జరిగింది. పలుమార్లు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆబిడ్స్‌లో ఇండియన్‌ ఏయిర్‌లైన్స్‌కు చెందిన బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆబిడ్స్‌లో జరిగిన సత్యాగ్రహంలో ప్రజాసమితి నేతలు మదన్‌మోహన్‌, అచ్యుతరెడ్డి, మేయర్‌ లక్ష్మీనారాయణ, ఎంఎం హషీం తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సత్యాగ్రహం జరిపినవారిలో ప్రజాసమితి కార్యదర్శి ఎస్‌. వెంకట్రామారెడ్డి, నర్సింగ్‌రావు, మాజీమేయర్‌ కాశీరామ్‌ చార్మినార్‌ వద్ద పాల్గొని వున్నారు. తెలంగాణలో సత్యాగ్రహం, మల్లికార్జున్‌ దీక్షల గురించి తెలుసుకున్న దేశీయాంగ మంత్రి చవాన్‌ తెలంగాణ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఢిల్లీలో నిర్వహిస్తే బహిష్కరిస్తామని తెలంగాణ నేత కే రాజమల్లు ప్రకటించారు. అక్టోబర్‌ 14న తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల నివాస గృహాలపై గుర్తు తెలియని వారు నాటుబాంబులు విసిరినారు, ఈ మంత్రులు శ్రీమతి రోడా మిస్త్రీ, జే వెంగళరావు.మల్లికార్జున్‌ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి గాంధీ విగ్రహం వద్ద ఆయనను కలిసిన విద్యార్థినుల కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ రమాదేవి తానుకూడా అక్టోబర్‌ 18 నుండి ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమైంది.

రమాదేవికి అప్పుడు 15 ఏండ్లు. ఆమె షాద్‌నగర్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి హైదరాబాద్‌లోని ఉద్యమ నాయకులతోని ప్రేరణ పొందిన రమాదేవి తల్లిదండ్రుల అనుమతితో, స్నేహితుల సహకారంతో నారాయణగూడ చౌరస్తాలోని రాజబహద్దూర్‌ వెంకట్రామారెడ్డి విగ్రహం వద్ద 1969 అక్టోబర్‌ 18న ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంది. రమాదేవి నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు డా|| మర్రి చెన్నారెడ్డిని కలిసింది. ఆయన ” నువ్వు చిన్న పిల్లవి మేమున్నాం కదా తెలంగాణ సాధించడానికి”అని నిరాహార దీక్ష చేయొద్దని సలహా ఇచ్చారు. ఆయన మాటను లక్ష్యపెట్టకుండా నిరాహార దీక్షను ప్రారంభిస్తానని చెప్పడంతో ” నేను చెప్పినపుడు దీక్షను విరమించాలని” ఆయన కోరినారు.

రమాదేవి సహచరులు తలా కొంత డబ్బు సమకూర్చి టెంట్‌వేసి ఆమె దీక్షకు మద్దతుగా నిలిచారు. దీక్షా శిబిరం వద్దకు డా|| మర్రిచెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, మదన్‌మోహన్‌ తదితరులు వచ్చి రమాదేవికి మద్దతు తెలిపినారు. టంగుటూరి అంజయ్య ఆయన భార్య ప్రతిరోజు దీక్షాశిబిరాన్ని సందర్శించారు. మేయర్‌ లక్ష్మీనారాయణ, శాంతాబాయి, సదాలక్ష్మి, ఈశ్వరీ బాయి తదితరులు రమాదేవికి ధైర్యం చెప్పినారు.

రమాదేవి నిరాహా దీక్షకు కూర్చునే ముందు తన స్నేహితులైన కొందరు విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో పర్యటించారు. స్వంత ఖర్చులతో బస్సులలో వివిధ పట్టణాలకు పోయి అక్కడి విద్యార్థులతో తెలంగాణ విషయమై మాట్లాడినారు. వీరిలో గల పట్టుదలను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే రమాదేవి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనారు.

రమాదేవి దీక్ష ప్రారంభమై నాలుగైదు రోజులు గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని, బాగా బరువు తగ్గిందని వైద్యులు చెప్పడంతో ఆమెచే ఎలాగైనా దీక్ష విరమింప చేయమని, తానే స్వయంగా వచ్చి పండ్లరసం ఇస్తానని డాక్టర్‌ చెన్నారెడ్డి మదన్‌మోహన్‌ను పంపించారు. ఆయన ఎంత నచ్చ చెప్పినా రమాదేవి దీక్షను కొనసాగిస్తానని తేల్చి చెప్పింది. మరో అగ్రనేత, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ రమాదేవి వద్దకు వచ్చి ”మేమంతా ఉండగా నవ్వెందుకమ్మా దీక్ష చేస్తున్నావ్‌. నువ్వు చిన్న పిల్లవు. ఆరోగ్యం చెడుతుంది, తెలంగాణ సంగతి మాకు వదిలేయ్‌” అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. నవ్వుతూనే బాబూజీకి ‘నో’ చెప్పింది రమాదేవి.

రమాదేవి ఆరోగ్యం క్షీణించడంతో తొమ్మిదవరోజు అక్టోబర్‌ 26న ఆమెను పోలీసులు అరెస్టుచేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అరెస్టుకు కారణం చూపాలి కాబట్టి రమాదేవి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడిందని కేేసుపెట్టారు. ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించే ప్రయత్నం చేసి విఫలమైంది రమాదేవి. బలవంతంగా ఆమెకు సెలైన్లు ఎక్కించి సెలైన్‌ తీసుకున్నందున దీక్ష ముగిసినట్లేనని అన్నారు ‘పోలీసులు’. కానీ బయట వదంతులు వ్యాపించినాయి. రమాదేవి చనిపోయిందనే గాలివార్తలు ప్రచారం కావడం, అదే వదంతిని నమ్మి ఎవరో రేడియోలో ప్రకటించడంతో అనేక జిల్లాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వరంగల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన, విధ్వంసం జరిగింది. ఇది వదంతి మాత్రమేనని, రమాదేవి ఆసుపత్రిలో కోలుకుంటున్నదని ఉద్యమనేతలు ప్రకటించడంతో విద్యార్థులు శాంతించారు. నాలుగురోజుల తర్వాత రమాదేవి డిశ్చార్జి అయ్యింది. తనపై పోలీసులు పెట్టిన ఆత్మహత్య కేసు కోసం రమాదేవి అనేకసార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది.

ఒక విద్యా సంవత్సరాన్ని రమాదేవి, తెలంగాణలో ఎస్‌.ఎస్‌్‌సీ. హెచ్‌.ఎస్‌.సీ చదివే విద్యార్థులు నష్టపోయారు. 1969 నవంబర్‌లో పరీక్షలు రాసి రమాదేవి పదోతరగతి పాసయినారు. తన చదువును కొనసాగించాలనే కోరిక ఆమెలో బలంగా ఉన్నా తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత సరిగా లేనందున ఆమె ప్రయత్నం ముందుకు సాగలేదు. ఈ విషయం తెలిసి రామచంద్రారెడ్డి అనే న్యాయవాది(అలియాబాద్‌, చార్మినార్‌) తన భార్యతో కలిసి వెళ్ళి రమాదేవిని తన ఇంట్లో పెట్టుకొని చదివిస్తానని, ఖర్చులన్నీ తానే భరిస్తానని ఆమె తల్లిదండ్రులను కోరినారు. వారందుకు సంతోషంతో అంగీకరించారు. రమాదేవి హెచ్‌ఎస్‌సీలో చేరింది. కొద్ది నెలలకే ఆమెకు పెళ్ళికావడంతో అర్ధాంతరంగా చదువు ఆపి సాధారణ జీవితంలోకి ఆమె వెళ్ళింది. ఒక గొప్పనాయకురాలు కాగలిగే అన్ని లక్షణాలు రమాదేవిలో ఉండేవి. బాల్య వివాహం ఆమె దిశను మార్చింది

నవంబర్‌ 1న బాపూజీ 11 రోజుల దీక్ష

రమాదేవి దీక్షను పోలీసులు బలవంతంగా ఆపడంతో మాజీ మంత్రి లక్ష్మణ్‌ బాపూజీ 1969 నవంబర్‌ ఒకటిన పదకొండు రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినం సందర్భంగా ఒప్పందాల ఉల్లంఘనలను కేంద్రప్రభుత్వం దృష్టికి తేవడానికి బాపూజీ దీక్షను తలపెట్టారు. తెలంగాణ ఉద్యమ అణచివేతకు ప్రభుత్వం అనుసరిస్తున్న అవినీతిని, హింసాయుత పద్ధతులను, అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపడం తమ దీక్షా లక్ష్యాలుగా బాపూజీ ప్రకటించారు.

అక్టోబర్‌ రెండోవారంలోనే కొండాలక్ష్మణ్‌ బాపూజీ డా. చెన్నారెడ్డితో విభేదించి తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ సభ్య త్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనసా గించే పద్ధతులు, విధానాలపైనే ఈ నేతలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినవి. అప్పటి నుండి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విడిగా, తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమాన్ని కొనసా గించారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని ఏ.ఐ.సీ.సీ. గుర్తించక పోయినా దాని అధ్యక్షునిగా కొనసాగినారు.

విద్యార్థినేత మల్లికార్జున్‌ దీక్షా భంగం.. అరెస్ట్‌

1969 అక్టోబర్‌ పదిన ప్రారంభమైన మల్లికార్జున్‌ ఆమరణ నిరాహార దీక్ష నవంబర్‌ మూడవ తేదీన బలవంతంగా పోలీసులచే నిలిపివేయబడింది. 25రోజుల పాటు ఏకబిగిన సాగిన దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఉస్మానియా ఆసుపత్రికి మల్లికార్జున్‌ను తరలించారు పోలీసులు. ఆయన అరెస్ట్‌ విషయం తెలిసి జంటనగరాల్లో, జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అక్కడక్కడ బస్సులపైకి రాళ్ళు రువ్వినారు. వారిని చెదర గొట్టడానికి పోలీసులు పలు ప్రదేశాల్లో లాఠీఛార్జీ చేశారు. మల్లికార్జున్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత నవంబర్‌ 11న ఉస్మానియా ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయినారు.

ఆగిపోయిన పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 1969 జనవరి రెండోవారంలో మూతబడిన విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో మళ్ళీ ప్రారంభమైనవి అక్టోబర్‌ నెలలోనే, ఎస్‌.ఎస్‌.సీ, హెచ్‌.ఎస్‌.సీ. విద్యార్థులు, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులంతా ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. పదవ తరగతి, హెచ్‌.ఎస్‌.సీ. విద్యార్థులకు నవంబర్‌ రెండో వారంలో పరీక్షలను నిర్వహించింది ప్రభుత్వం. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులైనా, కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యేదాక ఖాళీగానే వున్నారు.

వచ్చే సంచికలో: ప్రధాని విజ్ఞప్తితో

తాత్కాలికంగా ఉద్యమానికి విరామం

Other Updates