నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం. 1932లో భక్తప్రహ్లాద చిత్రంతో మొదలైన తెలుగు సినిమారంగం, నేడు హిందీ సినిమా రంగం తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద పరిశ్రమగా కూడా గుర్తించబడి, వేలమందికి ఉపాధి కల్పిస్తోంది.

కారణాలు ఏవైనా కావొచ్చును. కానీ నేడు పాటలులేని సినిమాను ఊహించుకోలేము. వంద వాక్యాలకన్నా, ఒక పాట/పద్యం గొప్పదని పెద్దలు అంటారు. ఒక పాటకు రచయిత ఆత్మనిస్తే సంగీత దర్శకుడు, దర్శకుడు దానికి శరీరాన్నిచ్చి మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు దోహదపడతారు. అందుకే కథకు అదనపు బలం చేకూర్చేది గేయ రచయిత కలం అంటే ఆశ్చర్యం లేదు.

అన్ని రంగాల్లో లాగానే సినిమా రంగంలోని తెలంగాణా ప్రాంత కవులు/గేయ రచయితలు (ఏ కొద్దిమందో తప్ప) కూడా సమైక్యాంధ్రలో విస్మరించబడ్డారు. పైన చెప్పిన భక్తప్రహ్లాదలో తొలి తెలుగు సినిమా పాట రచించినది ఖమ్మం జిల్లా వాసి చందాల కేశవదాస్‌ అని బహుశా ఏ కొద్దిమందికో తెలుసును. అట్లాగే, తెలుగు పాటల పూదోటలో తెలంగాణా గేయ రచయితలెందరో ఒక సమగ్రమైన వివరణ లేదు. ఇట్టి లోటును పూరించటానికా అన్నట్లు సినీ గేయ రచయిత డా|| కందికొండ (కందికొండ యాదగిరి) పూనుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు కందికొండల సమష్టి కృషి ఫలితమే ‘తెలంగాణ సినీ గేయ వైభవం’. ప్రపంచ తెలుగు మహాసభల (డిసెంబర్‌ 15నుండి 19, 1917 వరకు) సందర్భంగా ఈ సంకలనాన్ని వెలువరించారు.

Other Updates