kota– నాగబాల సురేష్‌ కుమార్‌

భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ‘నేనుసైతం’ అంటూ కదం తొక్కి బ్రిటిషు పాలకులకు గుండెల్లో వణుకు పుట్టించి మన దేశంపై వారు చేస్తున్న దాడిని సింహంలా గాండ్రించి నిలదీసింది కౌలాస్‌ కోట. ఎంతో వైభవోపేతమైన చరిత్రకు, ఎన్నో యుద్ధాలకు, మరెన్నో పోరాటాలకు వేదికై, మన ముందు గత చరిత్రకు చెందిన పుస్తకంలా, అపురూప అవశేషంగా నిలబడిన కోటల్లో నిజామాబాద్‌ జిల్లాలోని ‘కౌలాస్‌ కోట’ కూడా ఒకటి. రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, బరీద్‌ షాహీదులు, మొఘలాయిలు, రాజపుత్రులు, అసఫ్‌జాహీల పరిపాలనను చవిచూసి వారి కట్టడాల తీరును మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఈ కోట జిల్లా కేంద్రానికి 120 కి.మీ. దూరంలోని జుక్కల్‌ మండలంలో కౌలాస్‌ గ్రామానికి దక్షిణంగా బాలా ఘాట్‌ పర్వత శ్రేణులలో వుంటుంది.

ఈ కోట ఎన్నో పోరాటాలకు సాక్ష్యం, సుమారు 1100 సంవత్సరాల క్రితం 300 ఎకరాల వైశాల్యంలో అత్యంత పటిష్టంగా నిర్మించిన ఈ రాతి నిర్మాణం నేటికీ అలాగే వుంది. రాష్ట్ర కూట రాజైన 3వ ఇంద్రుడు (కీ.శ. 915 నుండి 917) బోధన్‌ రాజధానిగా ఇందూరు మండలాన్ని పాలించాడు. అతడే ఇందూరు కోటతో పాటు కౌలాస్‌ కోటను నిర్మించాడు. ఇతని కాలంలోనే బిచ్కుందలో నగరేశ్వరాలయం, బోర్గాంలో బసవేశ్వరాలయం నిర్మించబడ్డాయి.

గతంలో కైలాస ముని ఈ పర్వత శ్రేణులలో తపస్సు ఆచరించటం వల్ల ఆయన పేరిట గ్రామంతో పాటు కోట నిర్మించబడిందని చెబుతారు. ఈ కోటలో శిల్పకళకు కొదవే లేదు. ఈ కోటలో అనేక రాతినిర్మాణాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం, హనుమాన్‌ మందిరం, సరస్వతీ మందిరాలు కూడా కొలువై వున్నాయి. కానీ ఆ అపురూప మందిరాలకు, అందులోని రాతి విగ్రహాలకు ప్రస్తుత పరిస్థితుల్లో దోపిడీ దొంగల నుండి ముప్పు వాటిల్లే ప్రమాదం అడుగడుగునా పొంచి వుంది. నాటి సైనికుల ఆయుధాలు, మందు గుండు సామగ్రిని నిల్వ చేయడానికి నిర్మించిన ప్రత్యేక ఆయుధ భాండాగారాలు, కళాకారుల నృత్య ప్రదర్శనల కోసం నిర్మించిన నృత్య శాలలు చూపరులను అబ్బురపరుస్తాయి.

కోటలోనికి ప్రవేశించడానికి పన్నెండు ప్రవేశ ద్వారాలతో పాటు 52 బురుజులు అత్యంత పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. ఈ కోట ద్వారాలు గోలకొండ కోట ద్వారాలను పోలి ఉన్నాయి. ఆ ద్వారాలపై శిల్పులు అద్భుతంగా చెక్కిన రాజముద్రలు, చిహ్నాలు చూపరులని ఆకట్టుకుంటాయి. తొండం ఎత్తి పరిగెడుతున్న గజరాజుపై స్వారీ చేస్తున్న సింహపు గుర్తు నాటి రాజుల శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కోటలో అక్కడక్కడా పూర్తిగా శిథిలమై కనిపించే రాజ ప్రసాదాలు, మంత్రులు, సైనికుల ఆవాసాలు మనలను గత కాలంలోకి లాక్కు వెళతాయి. ఏనుగుల కోసం నిర్మించిన గజశాలలు, గుర్రాల కోసం నిర్మించిన అశ్వశాలలు పూర్తిగా శిథిలమైపోయాయి. కోటలోని ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన నీటి బావులలో ఇప్పటికీ నీరు నిల్వలు కలిగిన రాతి నిర్మాణపు బావులున్నాయి. వీటి నిర్మాణాలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఇక్కడే ఏనుగుల బావి పేరుతో ఒక పెద్ద బావి ఉంది. ఆ కాలంలో ఏనుగులు ఆ బావిలో జలకాలాడేవట. వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి బావుల్లో నేటికీ నీరు ఉండటం అద్భుతంగా తోస్తుంది. అడుగడుగునా నాటి శిల్పుల అద్భుత నిర్మాణ చాతుర్యం మనల్ని అబ్బురపరుస్తుంది.

దుర్గానికి పడమర దిశలో ‘కాశీ గుండం’ ఉంది. ఇక్కడే కాశీ విశ్వనాథ మందిరం ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో నాడు మునులు తపం ఆచరించేవారట. కోటలోపలి భాగంలో సహజసిద్ధంగా ఏర్పడిన రెండు మంచినీటి కొలనులను నాటి రాజులు కొంచెం విస్తరింపజేసి అందులోని నీటిని ప్రజలు తమ అవసరాలకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. కోటకు ఉత్తరాన అతి సమీపంలో కౌలస నది ప్రవహిస్తోంది. తూర్పున ఖలా చెరువు శతృవులు రాకుండా ఏర్పాటు చేశారు. పడమరలో బాలాఘాట్‌ పర్వత శ్రేణితో పాటు కాశీ గుండం ఉంది. దక్షిణాన భవాని మాత మందిరంతో పాటు ఎత్తయిన కొండలు కోటకు రక్షా వలయంగా ఉన్నాయి.

రాణి సోనే కున్వర్‌బాయి పాలనలో కోటకు సంబంధించిన వ్యవసాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇక్కడ వున్న 9 అడుగుల నుండి 24 అడుగుల ఉన్న ఆ ఫిరంగులే ఆనాటి బ్రిటీషు వారి దమననీతికి, ఆరాచకాలకు వ్యతిరేకంగా బ్రిటిషు సైనికులపై ఎక్కుపెట్టబడ్డాయి. నాటి ఫిరంగులు నేటికీ నాటి చరిత్రకు ఆనవాళ్ళుగా, చెక్కు చెదరని చిహ్నాలుగా కోటలో అనేక చోట్ల మనకు కనిపిస్తాయి.

కోటలోని ప్రతి మందిరం పరిసరాల్లో ప్రత్యేకంగా నిర్మించిన నీటి బావుల ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. కోట మధ్య భాగంలో మొగలాయిల కాలంలో నిర్మించిన రెండు మసీదులతోపాటు శిథిలావస్థలోని దర్గా మనకు కానవస్తాయి. భూ ఉపరితలానికి సుమారు 250 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ కోట దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. సుమారు 18 అడుగుల ఎత్తు, మీటరు మందపు రాతి ప్రహరీ గోడలతో రెండు కిలోమీటర్ల చుట్టుకొలతతో శతృదుర్భేద్యమైన కోటగా దీన్ని నిర్మించారు. రెండవ కుతుబ్‌ షాహీ నవాబు జంషీద్‌, కౌలాస్‌ కోటను పునర్నిర్మాణం గావించాడు. కోట చుట్టూ నిర్మించిన లోతైన కందకం కాలక్రమంలో పూడుకుపోయి పిచ్చిమొక్కలతో నిండిపోయింది. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఆధీనంలో ఈ కోట చాలాకాలం పాటు వుండేదని, వారి కాలంలోనే కోటలో అనేక నిర్మాణాలు చేపట్టి శత్రు దుర్భేద్యమైన కోటగా దీన్ని తీర్చిదిద్దారని చారిత్రక కథనం.

అయితే తరువాతి కాలంలో కోట పాలన సక్రమంగా కొనసాగడానికి వారి సామంతులకు కోటపై పూర్తి అధికా రాలను అప్పజెప్పినట్లు చారిత్రక కథనం. నాటి పాలకులు అటు శైవాన్ని, ఇటు వైష్ణవాన్ని సమంగా ఆదరించారు. కాకతీయుల కాలంలో రాణిరుద్రమ దేవి కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతాలను జయించిన తన మాండలికునిగా సోమనాథ్‌ను నియమించారు. సోమనాథ్‌ పాలనలో ఈ కోట దశాబ్ధం పాటు కొనసాగింది. కాకతీయ చక్రవర్తులు కౌలాస్‌ కోటను గొప్ప యుద్ధ కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ కోట కేంద్రంగా ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను విజయవంతంగా ఎదిరించి వారిని పలుమార్లు ఓడించాడు. ఈ కోట ప్రాధాన్యతను గుర్తించిన ఢిల్లీ సుల్తానుల సేనాని మాలిక్‌ కాఫిర్‌, తుగ్లక్‌లు ఈ కోటను ఎలాగైనా జయించాలని పెద్ద సైన్యంతో దండయాత్ర చేసి కోటను ఆక్రమించుకున్నారు. అనంతర కాలంలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఈ కోటపై దండెత్తి ఆక్రమించుకున్నట్లు చరిత్రకారుల కథనం. 13వ శతాబ్ధంలో జరిగిన ఆ భీకర యుద్ధంలో అనేకమంది వీరయోధులు మరణించారు. కోటను స్వాధీనపరచుకున్న తర్వాత ముస్లిం సేనలు చాలాకాలం పాటు ఈ కోటలో మకాం వేసి యధేచ్ఛగా కోట విధ్వంసానికి పాల్ప డ్డారు. అయితే 1327వ సంవత్సరంలో దీనిని తన సైనిక కేంద్రంగా మార్చడానికి, అలాగే ఇక్కడి నుండే తన సైనికులకు కావాల్సిన ఆయుధాల పంపిణీ, తయారీతోబాటు సైనిక శిక్షణా కేంద్రాలుగా ఈ కోటను ఉపయోగించుకున్నాడని చరిత్రకారుల విశ్వాసం, వారి కాలంలో ప్రతిష్ఠించిన ఒక ముస్లిం శాసనం కూడా ఇక్కడ ఉంది.

మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కుమారుడు కూడా కౌలాస్‌ కోటను ఆక్రమించుకున్నాడు. వారి కాలంలో అనేక ముస్లిం నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఆయుధ భాండాగారాల నిర్మాణాలు చాలా విశాలంగా వుండి అవి మొత్తం రాతితో కట్టుబడి వున్నాయి. ఈ నిర్మాణాలలో వేయి ఏళ్ళు గడిచినా అలాగే చెక్కు చెదరకుండా నిలిచి వున్నాయి. కోటకు వెనుక దక్షిణ భాగంలో నిర్మించిన ‘జగదాంబమాత దేవాలయం’ రాజపుత్రరాజుల కాలంలో గొప్ప వైభవాన్ని చవిచూసింది. ఇందులోని ప్రధాన దేవత ఎనిమిది చేతులు కలిగిన ‘అష్టభుజ జగదాంబ’గా పూజలందుకున్నది. యుద్ధాలకు బయలుదేరే ముందు నాటి రాజులు ఈ దేవిని పూజించి యుద్ధానికి బయలుదేరేవారు. ఔరంగజేబ్‌ కౌలాస్‌ కోటను వశపరచుకుని తన పాలకునిగా రాజా పథం సింగ్‌ను నియమించాడు. 16వ శతాబ్ధంలో ఈ కోట రాజా గోపాల్‌సింగ్‌ గౌర్‌ అనే రాజపుత్ర రాజు ఆధీనంలోకి వెళ్ళి అనేక సంవత్సరాల పాటు అనగా దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకూ రాజపుత్రుల ఏలుబడిలోనే కొనసాగింది. రాజాగో పాల్‌సింగ్‌ అనంతర కాలంలో మహారాష్ట్రంలోని కాంధార్‌, మా హోర్‌ సంస్థానాలను ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఆయన పాలనలో కోట మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. శిథిల కట్టడాల పునర్నిర్మాణం జరిగింది. ఈ కోటకు చివరి పాలకుడు రాజా దుర్జన్‌ సింగ్‌.

1857వ సంవత్సరంలో ఈ కోటను ఏలుబడిలోకి తీసుకున్న రాజానీల్‌ సింగ్‌ కుమారుడైన రాజా రాజ్‌దీప్‌ సింగ్‌ ఇక్కడి నుండి భారతమాత సంకెళ్ళు విముక్తి కోసం, భారత స్వాతంత్య్రం కోసం బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడాడని చరిత్ర కారుల కథనం. ఆయన ఇందు కోసం ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశాడు. దాంతో ఈ కోట భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాల్గొని భారత దేశం కోసం పోరాడిన మొదటి సంస్థానంగా చరిత్రలో పేరు సంపాదించుకుంది.

ఈ విషయం తెలిసిన ఆంగ్లేయులు రాజాదీప్‌ సింగ్‌తోపాటు ఆయనకు సహకరించిన సఫారుద్ధౌలా, శేఖ్‌మదార్‌, నార్ఖేడ్‌ గ్రామ పట్వారి శ్రీరంగారావు మొదలైన దేశ భక్తులను బంధించి వారిపై హైదరాబాద్‌ హైకోర్టులో విచారణ కొనసాగించారు. వారిని విప్లవకారులుగా, కుట్ర దారులుగా కోర్టులో నిరూపించి కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రకంగా ఈ కోట ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి అంకురార్పణ చేసింది.

కాశీ దేవాలయాన్ని పోలిన కాశీకుండ్‌ దేవాలయం రాజపుత్ర రాజుల కాలంలోనే నిర్మించబడింది. ఈ దేవాలయంతో పాటు ఇతర అద్భుత నిర్మాణాలు ముస్లిం రాజుల కాలంలో పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. అతి ఎత్తయిన బురుజులపై నిర్మించిన పట్టె మంచం మనకు నేటికీ దర్శనమిస్తుంది. ఇది కోటకు నైరుతి దిశలో ఉంది. రాణి సోనే కున్వర్‌బాయి పాలనలో కోటకు సంబంధించిన వ్యవసాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇక్కడ వున్న 9 అడుగుల నుండి 24 అడుగుల ఉన్న ఆ ఫిరంగులే ఆనాటి బ్రిటీషు వారి దమననీతికి, ఆరాచకాలకు వ్యతిరేకంగా బ్రిటీషు సైనికులపై ఎక్కుపెట్టబడ్డాయి. నాటి ఫిరంగులు నేటికీ నాటి చరిత్రకు ఆనవాళ్ళుగా, చెక్కు చెదరని చిహ్నాలుగా కోటలో అనేక చోట్ల మనకు కనిపిస్తాయి. ఈ ఫిరంగులు బ్రిటీష్‌వారిపై దాడికోసం ప్రత్యేకంగా చేయించినవి. కొన్ని మరఫిరంగులు నాందేడ్‌, బిచ్‌కుంద, మద్నూర్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించబడ్డాయి.

ఈ కోటలో రాణిగారి మందిరానికి చుట్టూ 30కి పైగా వివిధ దేవాలయాలు నిర్మించబడ్డాయి. కోట చుట్టూ దాదాపు 55 రాతి బురుజులున్నాయి. ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ కోటకు పర్యాటకుల తాకిడి ఇంకా పెరగలేదు కారణం ? సరైన రోడ్డు మార్గం కోట వరకు లేకపోవడం. పర్యాటకులకు ఇక్కడ సరైన వసతులు కల్పించి కోట పరిరక్షణాచర్యలు చేపడితే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుంది. కోటలోని దేవాలయం, దర్గాలను అపురూప కట్టడాల క్రింద కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ గుర్తించింది. స్థానిక ముస్లిం గ్రంథం ‘తారిఖి – ఇ -కౌలాస్‌’లో ఈ కోట పాలకుల గొప్పదనం, వైభవం వివరించబడింది.

కోటకు వెళ్ళే దారిలో కౌలాస్‌ గ్రామం నుండి కొంత దూరంలో ‘కౌలాస్‌ వాగు’ వుండటంలో పర్యాటకులకు ఆ నది కొంత అడ్డంకిగా మారుతోంది. వర్షాకాలంలో చెట్లు చేమలతో పరిసరాలు మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. కానీ వాగుని దాటడంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆ వాగుపై వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది. వాగుపై వంతెన నిర్మించి కోట వరకూ రహదారి మార్గాన్ని విస్తరించి కోట పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.

కాకతీయుల అసమాన పోరాటం, ఢిల్లీ సుల్తానుల దురాక్రమణ, బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటు లాంటి ఎన్నెన్నో గొప్ప ఘట్టాలకు సాక్ష్యం ఈ కౌలాస్‌పూర్‌ కోట. కోటలోని అడుగుభాగాన ఇప్పటికి గుప్తనిధుల ఆనవాళ్ళు వున్నట్టు గ్రామస్థుల కథనం. ఈ కారణంగానే దొపిడీ దొంగల చేతిలో కోట పలుసార్లు ధ్వంసమయింది. హైదరాబాద్‌ నుండి సంగారెడ్డి, అందోల్‌, నిజాంసాగర్‌ – పిట్లం మీదుగా ప్రయాణించి కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ చారిత్రక కోటను సుమారు 180 కి.మీ. దూరం ప్రయాణించి 4 గంటలలో చేరుకోవచ్చు. ఇంతటి ఘన చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ఈ కోటను పరిరక్షించి కలకాలం నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.

Other Updates