bhagiradhaనీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వు చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లతో మిషన్‌ భగీరథ అనుసంధానం కావాలి. ఇన్‌ టేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, మోటార్ల ఫిటింగ్‌ తదితర పనులన్నీ 2017 డిసెంబర్‌ నాటికి పూర్తి కావాలి. భవిష్యత్తులో మిషన్‌ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు 365 రోజుల పాటు 24 గంటలూ అందేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి.

గ్రామాల్లో ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం దళిత వాడల నుంచే ప్రారంభం కావాలని, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలతో సహా ప్రతీ ఇంటికి తప్పక నీరు చేరేలా చూడాలని సీఎం ఆదేశించారు. అభివద్ధి కార్యక్రమాల్లో దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని, మంచినీటి పథకం వారితోనే ప్రారంభం కావాలని చెప్పారు.

మిషన్‌ భగీరథ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది… ప్రజలకు అత్యంత ముఖ్యమైనదీ అయినందున మంత్రులు, కలెక్టర్లు జిల్లాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సీఎం కోరారు. పనులు జరుగుతున్న చోటికి వెళ్లి పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. రైల్వే, రోడ్ల క్రాసింగులు దాటుకుని, ఫారెస్ట్‌ క్లియరెన్సులు సాధించి, ప్రైవేటు భూముల యజమానులను ఒప్పించి రికార్డు సమయంలో పైపులైన్ల నిర్మాణం చేసుకోవడాన్ని దేశమంతా గుర్తించి, అభినందిస్తున్నదని సిఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా జరగాలని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లకు మిషన్‌ భగీరథ పనుల వివరాలు అందివ్వాలని, తమ పరిధిలో వారు పర్యటించి పర్యవేక్షిస్తారని వివరించారు. ఎక్కడైనా పనులు అనుకున్నవేగంతో జరగకుంటే వెంటనే వర్కింగ్‌ ఏజన్సీలతో మాట్లాడాలని మిషన్‌ భగీరథ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన విద్యుత్‌ ను నిరంతరం అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం విద్యుత్‌ శాఖ అధికారులు, మిషన్‌ భగీరథ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సీఎం అన్నారు. అవసరమైన విద్యుత్‌ ను ఏ సబ్‌ స్టేషన్‌ నుంచి ఎంత పొందాలనే విషయంలో అంచనాలు వేసుకుని అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.

మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్‌ భగీరథ పనులను పర్యవేక్షించాలని సీఎం కోరారు. 2017 డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు గోదావరి, కష్ణా నదీ జలాలు చేరుకునేలా పనులు పూర్తి కావాలని, తదనంతరం గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికి నీళ్లు పంపాలని చెప్పారు. ప్రతీ ఇంటిలో నల్లా బిగించడమే ఈ పథకంలో అతిపెద్ద పని అని, ఈ పని వేగంగా పూర్తి కావడానికి అవసరమైన ఆచరణాత్మక వ్యూహం రూపొందించాలని ఆదేశించారు.

మిషన్‌ భగీరథ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో అక్టోబర్‌ 16న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపి బాల్క సుమన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, జెన్‌ కో సిఎండి ప్రభాకర్‌ రావు, ఎస్పీ డీసీఎల్‌ సిఎండి రఘుమారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.పి. సింగ్‌, ఆర్‌.డబ్ల్యుఎస్‌ ఇఎన్సీ సురేందర్‌ రెడ్డి, సిఇ జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌ టేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, మోటార్ల ఫిటింగ్‌ తదితర పనులన్నీ 2017 డిసెంబర్‌ నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో వాటర్‌ ట్యాంకుల నిర్మాణంతో సహా అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. గ్రామాల వరకు చేరిన నీళ్లను అంతర్గత పైపులైన్ల ద్వారా ఇంటింటికి అందించాలన్నారు. ప్రభుత్వం తరఫునే నల్లాలు కూడా కొని, ప్రతీ ఇంటిలో బిగించాలని చెప్పారు. ప్రస్తుతం గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రజలు మిషన్‌ భగీరథ పథకం ద్వారా అందే నీళ్లతో ఎంత ఆనందంగా ఉన్నారో, త్వరలోనే రాష్ట్ర ప్రజలంతా ఆ అనుభూతి పొందాలని ఆకాంక్షించారు. 20 ఏండ్ల కిందటే సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నీళ్లిచ్చామని, అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమం రూపొందించినట్లు పునరుద్ఘాటించారు. నల్లాల దగ్గర బిందెల యుద్ధం బంద్‌ కావాలని, ఎవరింట్లో వాళ్లు బయటకు రాకుండా నీళ్లు పొందాలని చెప్పారు.

నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వు చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లతో మిషన్‌ భగీరథ అనుసంధానం కావాలన్నారు. మిషన్‌ భగీరథ సామాగ్రిని మండలాల్లోని గోదాముల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు.

మిషన్‌ భగీరథ కోసం ఉపయోగించే ఎలక్ట్రో మెకానికల్‌ పరికరాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బి.హెచ్‌.ఇ.ఎల్‌. ద్వారా కొనుగోలు చేయాలని సిఎం ఆదేశించారు. మోటార్లు, పంపింగ్‌ సామాగ్రి కోసం టెండర్లు పిలిచినప్పటికీ పలు కంపెనీలు ధర విషయంలో బేరసారాలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్‌ భగీరథకు పెద్ద ఎత్తున మోటార్లు, పంపింగ్‌ సామాగ్రి అవసరం ఉన్నందున, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్‌ఇఎల్‌ ద్వారానే వాటిని సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ రంగాల్లో బిహెచ్‌ఇఎల్‌ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్‌ భగీరథలో కూడా అలాగే జరగాలని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థతో పని తీసుకోవడం వల్ల అనవసర రాద్ధాంతాలేవీ ఉండవని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. బిహెచ్‌ఇఎల్‌ సిఎండి అతుల్‌ సోమ్టితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. మిషన్‌ భగీరథ కోసం 50 హెచ్‌.పి.ల నుంచి 1000 హెచ్‌.పి.ల వరకు మోటార్లు కావాలని, వాటిని సమకూర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బిహెచ్‌ఇఎల్‌ అధికారులు త్వరలోనే సమావేశమై ఈ విషయంలో అవగాహనకు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ప్రతీనిత్యం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అనుకున్న ప్రకారం నడుస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సంతప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి తెలంగాణ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సీఎం కితాబునిచ్చారు. అతి తక్కువ సమయంలో అనేక అవాంతరాలను అధిగమించి ముందుకుసాగుతున్న పథకం 2017 డిసెంబర్‌ నాటికి పూర్తి కావడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైన పనులుగా భావించాలని సీిఎం చెప్పారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను అధిగమించాలని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పక వస్తాయనే విషయం అందరి దష్టిలో ఉండాలని సీఎం అన్నారు.

మిషన్‌ భగీరథపై ఎంసిఆర్‌ హెచ్‌ఆర్డిలో అక్టోబర్‌ 17న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత రెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి. సింగ్‌, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. ఇఎన్‌సి సురేందర్‌ రెడ్డి, సిఇలు, ఎస్‌ఇలు, ఇఇలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్‌ టేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌, పైపులైన్ల నిర్మాణం, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం, జిఎల్బిఆర్‌ ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నదని, ఆరు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్‌ భగీరథను అధ్యయనం చేశాయని సీఎం చెప్పారు. ఈ పథకం కోసం వివిధ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రూ.22వేల కోట్లు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం కూడా వస్తున్నదన్నారు. ఇంకా అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. నిధుల కొరత లేదు కాబట్టి, బిల్లులు కూడా వెంటనే చెల్లిస్తున్నామని, కాబట్టి పనులు కూడా అనుకున్నదాని ప్రకారం వేగంగా జరిగే విధంగా వర్క్‌ ఏజన్సీలతో మాట్లాడాలని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పనులు చేసే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేస్తే 1.5శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ కూడా అందులోనే వేయాలని, దీనికోసం ఐ.టి.శాఖ నుంచి సాంకేతిక అంశాలపై సలహా తీసుకోవాలని సూచించారు. తక్కువ జనాభా కలిగిన ఆవాస ప్రాంతాల్లో హెచ్‌.డి.పి.ఇ పైపులు వేయాలా? పివిసి పైపులు వేయాలా? అనే అంశంపై స్థానిక భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇఇలకు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

మిషన్‌ భగీరథ పథకం పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. శాఖకే ఉంటుందని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణం తదితర పనులు కూడా చేయాల్సి ఉన్నందున ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని చెప్పారు. పని విభజన కూడా పకడ్బందీగా జరగాలని చెప్పారు.

”మిషన్‌ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ గా నియమితులైన వేముల ప్రశాంత రెడ్డికి కేబినెట్‌ హోదా కల్పించినం. ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఉంది. స్వయంగా ఇంజనీర్‌ కూడా అయిన ప్రశాంత్‌ రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు” అని సిఎం చెప్పారు.

Other Updates