ఎంతో చరిత్ర కలిగిన భాషా నిలయం శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం. మహాకవి కీ||శే|| దాశరది అనుబంధం ఎంతో చిరస్మరణీయమైంది. వారి సంక్షిప్త కావ్యాలను దాదాపుగా అన్నింటిని ముద్రించినారు. ఈ వినూత్న మహాగ్రంథము ‘దాశరథి స్మృతి’ చెప్పుకోతగ్గ మహాగ్రంథము. టి. ఉడయవర్లు సంపాదకత్వం వహించిన ఈ గ్రంథంలో మహామహులు ఎంతోమంది వారి వారి అభిప్రాయాలతో చక్కటి వ్యాసాలను, మహాకవి దాశరథితో సంబంధ బాంధవ్యాలు ఎలా సాగాయో స్పష్టంగా పొందుపరిచినారు. ఇందులో డా|| సినారె నివేదన, తే.గీ. పద్యాలు అమోఘం.

వేయి స్తంభాలగుడి వ్రాయించుకొన్నది
నాచేత ఏకశిలా చరిత్ర / పోతన్న కవి కల బోయించుకున్నాడు
నాచేత నేటి ఆనాటి కవిత నాకు/ తల్లివి నీవు, నీకు సుతుడవల నాటికి
నేటికి నను దినమ్ము మ్రోయుచున్నావు/ నాగళమ్మున, కలాన్ని నా తెలంగాణ!

కోటిరత్నాల వీణ (రుద్రవీణ) కోటి సంఖ్యను సూచించే శబ్దం మాత్రమేకాదు. అనంతతత్వాన్ని ద్యోతకం చేసే శబ్దమది అని దాశరథి గురించి చెపుతున్నారు ఉడయవర్లు. అలాగే, డా|| తిరుమల శ్రీనివాసాచార్య దాశరథి రుబాయిలూ చెపుతూనే

నింగి కితాబుగా చేశాను/ చుక్కల హిసాబు చేశాను
ప్రేయసి కోసం వేచీవేచీ/ తుదకు మంచమే వేశాను

ఇందులో ప్రతిపాదాన్నీ ‘అంత్యప్రాసను’ పులుముకున్న క్రియతో, పూర్తి చేయడం ఈ రుబాయి ప్రత్యేకత, అని అంటూనే చతురస్రగతిలో సాగిన ఈ రూబాయి మూడవ పాదంలో మూడు మాత్రలధికం అంటాడు, ఇక స్వయాన వారి తమ్ముడు డా|| దాశరథి రంగాచార్య ‘మా అన్నయ్య’ వ్యాసంలో మృత్యువు సైతం మా అన్నయ్య మందహాసాన్ని ఆర్పలేకపోయింది, చావు తరువాత సైతం మా అన్నయ్య ముఖంలో మార్పులేదని అంటాడు. తెలంగాణలో సాగివస్తూ వున్న సమన్వయం రూపాల మధ్య, ధోరణులమధ్య కొనసాగుతూ వచ్చిందే. తెలంగాణ కవులు తెచ్చిన సమన్వయం ఒత్తిడి అఖిలాంధ్ర కవిత్వంలోనూ ప్రబలంగా రూపుదిద్దుకున్నది. దాశరథి ఈ సమన్వయ భావనకు ప్రధాన ప్రేరణయై నిలిచినవాడు అని స్పష్టంగా వివరించారు.

ఇంకా ఇందులో రామలింగం, తిరుమల శ్రీనివాసాచార్య, రమణాచారి, డా|| ఎం.ఎల్‌. నర్సింహారావు, మల్లెమాట రాజన్న శాస్త్రి, వాసా ప్రభావతి, దివాకర్ల రాజేశ్వరి, అక్కిరాజు రమాపతిరావు, తిరునగరి పోతుకూచి సాంబశివరావు మొదలగు వారు ఎంతోమంది మహోన్నతులు ”కీ||శే|| దాశరథి స్మృతి” గ్రంథానికి వారివారి అభిప్రాయాలను వెలిబుచ్చినారు. అందరూ చదువదగ్గ మహాగ్రంథం ఇది.

-కావూరి శ్రీనివాస్‌

Other Updates