cm-kcrనగదు రహిత లావాదేవీలే నోట్ల రద్దు సమస్యకు పరిష్కారమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నవంబరు 28వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానంతరం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం సరైందేనని, దానికి పూర్తిగా అండగా నిలుస్తామని అన్నారు. నల్లధనాన్ని వెలికితీయడానికి మోదీ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులకు పరిష్కారమార్గాలు వెతకాలన్నారు. కేంద్రం నిర్ణయంతో అసౌ కర్యానికి గురవుతున్న ప్రజలను ఎలా ఆదుకోవాలనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా బ్యాంకు లావా దేవీల వైపు మొగ్గుచూపేలా ప్రయత్నించాలన్నారు. ప్రజలు నోట్ల రద్దు సమ స్యతో ఆందోళన చెందవద్దని మీవెంట ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.

అర్ధక్రాంతి కాదు సంపూర్ణ క్రాంతి కావాలి

వజ్రాలు, బంగారం, ఆస్తులు, విదేశీనగదు, షేర్లు ఇలా నల్లధనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలిస్తేనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతామని, అర్దక్రాంతి కాకుండా సంపూర్ణ క్రాంతిని తేగలుగుతామని సీఎం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు తెలిపారు. గతంలో తాను కొందరు జర్నలిస్టు మిత్రులతో కలిసి అణగారిన జాతులపై అధ్యయన కేంద్రం నడిపించినట్లు తెలిపారు. అందులో అరుణ్‌శౌరీ లాంటి ప్రముఖ పాత్రికేయులు పత్రాలు సమర్పించినట్లు కేసీఆర్‌ వివరించారు. నల్లధన నిర్మూలన, లంచగొండితనం సమాజం నుంచి పోవాలంటే ఏ ఏ చర్యలు తీసుకోవాలో తాము ఆనాడే అధ్యయనం చేశామని తెలిపారు. తన అనుభవాలను ప్రధాని మోదీకి వివరించినట్లు తెలిపారు. అర్దక్రాంతి కాదు సంపూర్ణక్రాంతి తేవాలని ప్రధానిని కోరినట్లు కేసీఆర్‌ తెలిపారు.

నగదురహిత లావాదేవీలపై చర్చ

మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ఎలా ప్రోత్సహించాలనే విషయంలో చర్చించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందరకూ బ్యాంకు ఖాతాలు ఉండవని, అలాంటి పరిస్థితుల్లో వారికి బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థిరాస్థి రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఉపాధి కరువవుతుందన్నారు. అందుకు రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణంలో వారికి అవకాశం కల్పించి ఆదుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 లక్షల మంది ఆదారపడి ఉన్నారని తెలిపారు. వీరికి కొంత ఆసరాగా ఉండేందుకు గాను జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 5కు భోజనం కేంద్రాలను 50 నుంచి 150కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ వేయడం జరిగింది. ఈ కమిటీ కొన్ని సూచనలు చేసిందని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌ తదితర శాఖలలో స్వైపింగ్‌ యంత్రాలు పెట్టి నగదు రహితంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యాట్‌ డీలర్ల దగ్గర, అమ్మకాల దగ్గర, వ్యవసాయ మార్కెట్లు, చౌక దుకాణాలలో, పాల సమాఖ్యల వద్ద కూడా బ్యాంకు లావాదేవీలనే అనుమతించాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు జరగాలంటే స్వైపింగ్‌ యంత్రాలు ఎక్కువగా అవసరమవుతాయన్నారు. రాష్ట్రంలో 85వేల స్వైపింగ్‌ యంత్రాలు ఉంటే అందులో 70శాతం హైదరాబాద్‌, మిగతా పట్టణాల్లో ఉన్నాయని తెలిపారు. స్వైపింగ్‌ యంత్రాల వినియోగానికి వ్యాపారులు వెనుకంజ వేయవద్దన్నారు. మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటు వల్లనే వ్యాపారులు భయపడతారన్నారు. అవసరమైతే అది ఎత్తివేయాలని అన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి టీఎస్‌-వ్యాలెట్‌ను కూడా ప్రవేశపెట్ట బోతున్నట్లు తెలిపారు. ఐటీశాఖ దీన్ని రూపొందిస్తుందని తెలిపారు.

మోడల్‌ నియోజకవర్గంగా సిద్ధిపేట

రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలకు అంకురార్పణగా సిద్ధిపేట నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ మొదట రూ. 500 మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగా చేస్తామన్నారు. ఆ తరువాత రూ. 200లకు తగ్గిస్తామని, ఆ తరువాత పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని బ్యాంకర్లతో సమావేశం జరిపి, అందరు వ్యాపారస్థులకు స్వైపింగ్‌ యంత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. వీలైనంత త్వరగా ఇక్కడ పూర్తిచేసి, సాధకబాదకాలు తెలుసుకుని, అనంతరం రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. తాము అమలు చేద్దామనుకున్నవన్నీ రాత్రికి రాత్రే పూర్తి కావని, కొన్ని మాసాలు గడిస్తే గానీ అమలులోకి రావని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు నగదు కష్టాలు తీరిపోతాయని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రులు కడియం, మహమూద్‌అలీ, ఆర్థిక మంత్రి ఈటెల, హోం మంత్రి నాయిని తదితరులు పాల్గొన్నారు.

Other Updates