nizamabadఎలక్ట్రానిక్‌ వ్యవసాయ-మార్కెటింగ్‌ విధానం అమలు లో జాతీయ స్థాయి అవార్డును నిజామాబాద్‌ మార్కెట్‌ దక్కించుకుంది.

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఏప్రిల్‌ 21నాడు ఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ జాతీయ స్థాయిలో ఈ-నామ్‌ అమలులో కేంద్ర ప్రభుత్వ అవార్డు సాధించినందుకు జిల్లా కలెక్టర్‌, మార్కెటింగ్‌ అధికారులు, సిబ్బందిని మంత్రి హరీశ్‌ రావు అభినందించారు.

‘ఈ- నామ్‌’అమలుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 22 మార్కెట్లను గుర్తించగా అందులో తెలంగాణ లోని నిజామాబాద్‌,వరంగల్‌,తిరుమలగిరి, మలక్‌ పేట,బాదేపల్లి మార్కెట్లున్నాయి.ఈ – నామ్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలలో గుజరాత్‌ తో తెలంగాణ పోటీ పడింది . ఈ- నామ్‌ ను కేంద్రం గత ఏడాది ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం అమలులో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు మార్గదర్శకాలలో, వివిధ అంశాలలో నిజామాబాద్‌ నెంబర్‌ వన్‌ గా నిలబడింది.ఈ-నామ్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణలోని మార్కెట్లు జాతీయ స్థాయి గుర్తింపు సాధించాలని మార్కెటింగ్‌ మంత్రి హరీష్‌ రావు మార్కెటింగ్‌ అధికారులను ఆదేశిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సమీక్షిస్తూ వచ్చారు.ఈ- నామ్‌ అమలును తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ-నామ్‌ నిబంధనల ప్రకారం తెలంగాణ లోని 5 వ్యవసాయ మార్కెట్లలో కంప్యూటర్లు,ఇతర సాంకేతిక, ఆధునిక వసతులను సమకూర్చారు.రైతుల సరుకులకు ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. క్వాలిటీ సర్టిఫికేషన్‌ తర్వాత వేలం లో ఉంచుతూ ఉన్నారు. కొనుగోలుదారులు ధర నిర్ణయించుకొని ఆన్‌ లైన్లో ఉంచినప్పుడే ఎక్కువ ధర కోట్‌ చేసిన వారి వివరాలను మార్కెట్‌ కమిటీ ప్రకటిస్తుంది.ఈ విధంగా ఆన్‌ లైన్‌ బిడ్డింగ్‌ లో ధరలు నిర్ణయించినందున రైతులకు ప్రయోజనం కల్గుతోంది.రైతుల పంటకు మంచి ధర లభిస్తున్నది.

‘డైరెక్ట్‌ సేల్స్‌ ప్లాట్‌ ఫామ్‌’ను నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.ఈ విధానం విజయవంతం అయింది.మంచి ఫలితాలు వస్తున్నాయి.కొనుగోలుదారులు నేరుగా సరుకులు కొంటున్నారు.అదేరోజు చెల్లింపులు ఆన్‌ లైన్‌ లో జరుగుతున్నాయి. ఇదివరకే అనుమతి పొందిన చార్జీలు వసూలు చేస్తున్నారు.ఖాళీ బస్తాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు.దీంతో రైతు తన ఇంటి దగ్గరే సరుకు నింపుకొని మార్కెట్‌కు రాగల్గుతున్నారు.లారీ యజమానులతో ముందే మాట్లాడి కిరాయి నిర్ణయిస్తున్నందున సరుకుల రవాణా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతున్నాయి.దళారుల జోక్యం లేకుండా రైతులు తమ కష్టాన్ని ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం కలిగింది.మార్కెట్‌ యార్డులలో రైతులకు కావలసిన కనీస సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.మట్టి నమూనా పరీక్షకు సంబంధించిన ల్యాబ్‌, రైతుల రెస్ట్‌ హౌస్‌, తాగు నీరు వంటి సౌకర్యాలు, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయడం మార్కెటింగ్‌ రంగంలో మార్పులు, సంస్కరణలకు ఉదాహరణలు. వ్యవసాయ మార్కెట్‌లలో ప్రతి స్థాయిలోనూ పారదర్శకతను పాటిస్తున్నందున అవినీతి, అక్రమాలకీ అవకాశం లేకుండా చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు ప్రతి రోజు మార్కెట్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూన్నారు. క్రయ విక్రయాలు, మార్కెట్‌లలో నిర్వహణ, ఇతర వ్యవహారాల పై ఉన్నతాధికారులు పూర్తి నిఘా ఉంచడం తో పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పలు మార్లు వ్యవసాయ మార్కెట్లను పరిశీలించి వెళ్లారు.

Other Updates