mogulaiahకె.రవీందర్‌

తెలంగాణ అంటేనే ఒక నిరంతర పోరాటా ఝరి. తెలంగాణ చరిత్రంతా అసంఖ్యాక బహుజనుల అసమాన పోరాట త్యాగాల ఫలితమే. ఈ గడ్డమీద జరిగిన ఆధిపత్య వ్యతిరేక పోరాటాల్లో అసువులు బాసిన అమరులంతా.. ఈ నేలపై మరణం కూడా ఒక మధుర జ్ఞాపకమని వాళ్ల అమరత్వపు స్మృతులను మనకు అందించారు. జాతీయ జెండా ఎత్తడంపై నీలినీడల నిషేధాజ్ఞలు కొనసాగుతున్న నిజాం నిరంకుశ పాలనలో, ప్రాణాలకు తెగించి జాతీయ జెండా ఎత్తిన దేశభక్తులను కాపాడడానికి రెండువందల మంది కరుడుగట్టిన రక్తపిపాసులైన రాజాకార్లతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు బత్తిని మొగిలయ్య. అతని అమరత్వమే నాలుగు కోటలున్న చారిత్రాత్మకమైన ఓరుగల్లుకు పెట్టని ఐదవకోట.

ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలనలో తెలంగాణ అంతటా భూస్వామ్య విధానం వేళ్ళూనుకుపోయింది. ఓరుగల్లు మొదటినుండి ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ స్వాతంత్య్రకాంక్ష భావజాల విస్తరణలో భాగంగా 1929లో మొలుగు భూమయ్య ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ సంస్థ యువకులను చైతన్యవంతంచేసింది. అదొక ఉద్యమ వృక్షమై విరగ బూసింది. ఓరుగల్లు కోటలో 1940నుండి ఆచారి అనే దేశభక్తుడి ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌ కార్యక్రమాలు మొదలై కొనసాగుతూ వచ్చాయి. దేశభక్తులైన యువకులు అందులో భాగస్వా ములయ్యారు. ఆసనాలు, సాముగరడీలు, దేశభక్తితో కూడిన సాంస్కృతిక ప్రక్రియలలో ఆ యువకులు మమేకమయ్యారు. అందులో అగ్రభాగాన నిలిచిన ఆరడుగుల ఆజానుబాహుడు బత్తిని మొగిలయ్య. ఆర్యసమాజ్‌ కార్యకలాపాలలో వాటి నిర్వహణలో అగ్రభాగాన ఉండేవాడు. 1944 నుండి వరంగల్‌ కోటలో ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో రాత్రిబడులు మొదలయ్యాయి.

ఆ తర్వాత ఈ క్రమం వరంగల్‌ కోటనుండి హన్మకొండ, కొత్తకొండ, మాను కోట, పరకాల, జనగామలకు విస్తరించింది. 1942 మే 22, 23, 24 తేదీలలో 9వ ఆంధ్ర మహాసభ వరంగల్‌ జిల్లాలోని ధర్మారంలో జరిగింది. ఇందులో బత్తిని మొగిలయ్య అతని బృందంతో కలిసి కోలాటం ప్రదర్శన ఇచ్చాడు. వరంగల్‌లో నిజాం వ్యతిరేక దేశభక్తికి సంబంధించి ఏది జరిగినా పార్టీల, సంస్థల ప్రమేయం లేకుండా యువకులంతా పాల్గొనేవారు. ఇది వరంగల్‌లోని ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. 1946 ఫిబ్రవరి 5న మహాత్మాగాంధీ మద్రాసునుండి అహ్మదా బాద్‌ వెళ్తూ వరంగల్‌ స్టేషన్‌లో ఆగి ఇక్కడి ప్రజల నుద్దేశించి పది నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత ప్రజలలో స్వతంత్య్రకాంక్ష పెరిగి ఆర్యసమాజ్‌ కాంగ్రెస్‌ కార్యక లాపాలు ప్రజా బాహుళ్యంలోకి విస్తరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 1946 ఫిబ్రవరి 12న హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ ఒక రహస్య సర్క్యులర్‌ జారీచేసింది. కాంగ్రెస్‌ సేవాదళ్‌ కార్యకర్తలంతా రహస్యంగానైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవే యాలని జాతీయగీతాన్ని ఆలపించాలని దాని సారాంశం.

బత్తిని మొగిలయ్య, బత్తిని రామస్వామి ఇద్దరు అన్నదమ్ములు. మొగిలయ్య తూర్పు కోటలో 1919లో చెన్నమ్మ మల్లయ్య దంపతుల ఐదవ సంతానంగా జన్మించాడు. కోటబడిలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తాళ్లెక్కే కులవృత్తిని చేపట్టి ఆర్యసమాజ్‌ కార్యకలాపాలలో భాగమయ్యాడు. ఇతని అన్న రామస్వామి గాంధేయవాది. అంకితభావం కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్త. వాళ్ళిద్దరి కారణంగా వరంగల్‌ కోటలో రాజకీయ చై తన్యం వెల్లివిరిసింది. పక్కపక్కనున్న మొగిలయ్య, రామస్వామిల ఇండ్లు ఆ ఇంటిముందుగల ఖాళీస్థలం ఉద్యమ వేదికలైనాయి. నిజాంరాజు అధికారికంగా త్రివర్ణపతాక ఆవిష్కరణను నిషేధించాడు.

నిజాం ప్రాంతంలో జెండా ఎత్తడమంటే.. మరణానికి కూడా వెరువకుండా చేసే సాహసోపేత కార్యమే! కోటలో వరంగల్‌లో రజాకార్లు వాళ్ళ అనుయాయులుండేవాళ్ళు. నలుదిక్కులా నిర్భంధమే. నింగిని తాకుతూ ఆ సమయంలో తూర్పుకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి నినాదాల మధ్య ఒక నిర్భంధ ఉద్విగ్నవాతావరణంలో ఉద్వేగపూరిత ఆనందాన్ని యువకులైన దేశభక్తులు అనుభవించేవారు. ఈ చైతన్యమే క్రమంగా చాపక్రిందనీరులా నిజాం సంస్థానమంతా విస్తరించింది. ఈ రహస్య జెండావందనం గురించి రజాకార్‌ నాయ కులకు తెలిసి కోటలో జెండా ఎత్తినరోజే ఈ కార్యక్ర మానికి నాయకత్వం వహిస్తున్న నాయకు లందరిని చంపి ఇంకెవ్వరూ జెండా ఎత్తకుండా చెయ్యాలనుకున్నారు.

ఆరోజు 11 ఆగస్టు 1946 ఆదివారం ఉదయం 7.30 గంటలకు తూర్పుకోట ముఖద్వారం దగ్గర జెండా ఎగురవేయాల ని అందులో కోటలో ఉన్నవాళ్ళందరిని భాగస్వాములను చేయాలని కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించారు. అప్పుడు హయగ్రీవాచారి కాంగ్రెస్‌ పట్టణ అధ్య క్షులుగా, భూపతి కృష్ణమూర్తి కోశాధి కారిగా ఉన్నారు. కోటలోని ప్రజలు తూ ర్పుకోట ముఖద్వారం దగ్గర గుమిగూ డారు. నాయకులు జెండా ఎత్తారు. జై కొట్టారు. పిల్లలు దేశభక్తి గీతాలనాల పించారు. నీరెండలోని నింగిలో సగౌ రవంగా జాతీయజెండా రెపరెపలాడింది. కోటగోడల మీదనుంచి వీచిన అపురూపమైన గాలి అందరినీ ఆత్మీయంగా స్పృషించింది. అనంతరం మొగిలయ్య, రామస్వామిలతో కలిసి నాయకులంతా రామస్వామి ఇంటికి చేరుకున్నారు. మొగిలయ్య అనంతరం వృత్తిలో భాగంగా తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్ళాడు. రామస్వామి ఇంట్లో కాంగ్రెస్‌ నాయకులంతా కలిసి చాయ్‌ తాగుతూ భవిష్యత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల గూర్చి చర్చించుకుంటున్నారు.

అప్పుడే సుమారు రెండువందలమంది రాజాకార్లు, వారి అనుయాయులు కత్తులు, బర్సెలు, తుపాకులు మొదలైన మారణాయుధాలతో ఖాసిం షరీఫ్‌ అనే రజాకారు నాయకుని ఆధ్వర్యంలో తూర్పుకోటలోని జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండాను చూసిన రజాకార్ల కోపం కట్టలు తెంచుకుంది. జెండాదించి కాళ్ళతో తొక్కి తగులబెట్టి నిజాం అనుకూల నినాదాలు చేస్తూ, జెండా ఎత్తిన నాయకులు సమావేశమైన రామస్వామి ఇంటిని చుట్టుముట్టారు. ఇది గమనించిన ఇంటిలోపల ఉన్న నాయకులు భూపతి కృష్ణమూర్తి, కెప్టెన్‌ సమ్మయ్యలు కాంపౌండ్‌ గేటుకు గొళ్లెం పెట్టారు. రజాకార్లు ఆ ఇంటిపై రాళ్ళదాడి మొదలు పెట్టారు. ఈ విషయం తాటివనంలోని మొగిల య్యకు తెలిసింది. వెంటనే తన ఇంటివైపు పరిగెత్తి ఇంటి వెనుకనుండి రజాకార్ల కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి ఇంటి సూరులోవున్న తల్వార్‌ను సర్రునలాగి క్షణాల్లో బీభత్సంగా దాడిచేస్తున్న రజాకార్ల గుంపుముందు నిల్చాడు. మొగిలయ్య ఇంట్లో అతని భార్య లచ్చవ్వ పురిటిబిడ్డతో మంచంపై ఉంది. అతని తల్లి చెన్నమ్మ ఈ పరిణామాలకు భీతిల్లి పోయారు.

కాకతీయ ప్రతాపానికి ప్రతీకగా నిలిచి వైరివర్గాల కార్యకలాపాల కవాతులో మునిగితేలిన యుద్ధభూమిపై నిలిచిన మొగిలయ్య సింహంలా రజాకార్‌ మూకలపై లంఘించాడు. ఆర్యసమా జ్‌లో నేర్పిన తన కత్తియుద్ధ విన్యాసం ముందు రజాకార్లు నిలువలేకపోయారు. నెత్తురు రుచి మరిగిన మానవమృగాలమధ్య మొగిలయ్య యుద్ధ వీరుడుగా మారి వీరవిహారం చేశాడు. రామస్వామి ఇంటిచుట్టూ ఆవరించి ఉన్న రెండువందలమంది రజాకార్లు ఒక్కసారిగా చెదిరిన చీమల పుట్టలా చెదిరిపోయారు. దూరంగా పారిపోయిన రజాకార్లు తమకుతాము ధైర్యం చెప్పుకొని ఖాసీం షరీఫ్‌ నాయకత్వంలో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. బల్లెంతో వేగంగా తనవైపు వస్తున్న షరీఫ్‌ను గమనించిన మొగిలయ్య అతన్ని నరకడానికై మెరుపువేగంతో కత్తిని పైకెత్తాడు. అది అనుకోనివిధంగా తన ఇంటి ముందుగల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. అది అదనుగా భావించిన షరీఫ్‌ తన బల్లెంతో బలంగా మొగిలయ్య గుండలమీద పొడిచాడు. క్షణాల్లో మొగిలయ్య శరీరమంతా రక్తసిక్తమయింది. రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు.

ఈ క్రమంలో తన తమ్మునిపై జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా ఇంట్లో నుండి చూసిన మొగి లయ్య అన్న బత్తిని రామస్వామి రోదిస్తూ తన తమ్ముని శవంపైబడి రజాకార్లను వేడుకు న్నాడు. కానీ అతన్ని కత్తులతో నరకడంవల్ల స్పృహ కోల్పోయాడు. అనంతరం నాయకు డైన షరీఫ్‌ అరుస్తూ మొగిలయ్య గుండెలపై స్రవి స్తున్న రక్తమంతా తన ముఖానికి శరీరానికి పూసుకున్నాడు. తరు వాత తన తుపాకితో కాల్పులు జరిపాడు. అందులో ఇద్దరు మర ణించారు. ముగ్గురు క్షతగాత్రు లైనారు. షరీఫ్‌ను రజాకార్‌ అనుయా యులు తమ భుజాలపై మోస్తూ ఈలలువేస్తూ నృత్యాలు చేస్తూ అతన్ని వరంగల్‌ కోటనుండి ఇప్పటి వరంగల్‌ చౌరస్తావరకు ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అప్పటి వరంగల్‌ తాలూక్‌దార్‌ (కలెక్టర్‌) అబ్దుల్‌ మొహిత్‌మిన్‌, ఇన్‌ స్పెక్టర్‌ జియా ఉల్ఫాలు హంతకుడైన ఖాసిం షరీఫ్‌కు పూలమాలలువేసి ఆలింగనం చేసు కున్నారు. అది తన వారసత్వమన్నట్లు ఆ దండలు చించి వికృతంగా నవ్వుతూ షరీఫ్‌ ప్రజలపై చల్లాడు. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకు 14 ఆగస్టు 1940న సాయంత్రం 4.00 గంటలకు మండిబజార్‌లోని నారాయ ణరెడ్డి అనే డాక్టర్‌నుకూడా ఈ షరీఫే హత్య చేశాడు. అతనుకూడా ఆర్యసమాజ్‌ కార్యకర్తే.

జెండా ఎత్తిన నాయకులకు ప్రాణభిక్షపెట్టి అమరుడైన నిష్కలంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య. ప్రాణాలకు తెగించి చేసే పోరాటమేదైనా సజీవమైందే. పోరాటవీరులు మరణించవచ్చు. చంపిన శత్రువు విజయగర్వంతో విర్రవీగవచ్చు. కానీ… వాళ్ళ త్యాగం సమస్త ప్రజల ఆకాంక్షలతో వెల్లివిరుస్తుంది. సమ్మక్క సారలమ్మనుండి.. భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులనుండి, దొడ్డి కొమురయ్య, కొమురంభీంలనుండి బత్తిని మొగిలయ్యలదాకా మనం మననం చేసుకునేది, ఈమట్టిని మానవీయతను ప్రేమించిన మనుషులను… త్యాగధనులనే…

Other Updates