paramaveera-chakraఇకనుంచి ‘పరమవీర చక్ర’ అవార్డు పొందే తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండుకోట్ల 25 లక్షల రూపాయలు నజరానా అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. సైనిక సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జనవరి 18న సీఎం శాసనసభలో ఓ ప్రకటన చేశారు.

భారతదేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలిలో అయినా, దేహాన్ని దహించే ఎడారి ఉష్ణోగ్రతలోనైనా, ఆక్సిజన్‌ సరిగా అందని శిఖరాగ్రాలమీదనైనా.. ఎక్కడైనా సరే, ఎన్నో కష్టాలు భరిస్తూ ఎంతో సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నారు. వారి త్యాగనిరతి వల్లనే దేశపౌరులు భద్రతతో జీవించగలుగుతున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి, తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ.. జీవితంలో ఎక్కువ భాగం దేశ రక్షణలోనే నిమగ్నమవుతున్నారు. ఒక్క సరిహద్దుల్లోనే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా మేమున్నామని సైనికులు రంగంలోకి దూకుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వారు తమ ప్రాణంకన్నా, తమ కుటుంబ క్షేమం కన్నా.. దేశాన్ని క్షేమంగా ఉంచడమే ప్రధానమని భావించి అహరహం పరిశ్రమి స్తున్నారు. అటువంటప్పుడు వారి క్షేమాన్ని, వారి కుటుంబ క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాలి. అదే మనం వారికి చెల్లించే నిజమైన కృతజ్ఞత అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం సైనిక సంక్షేమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆద ర్శంగా నిలవాలి. ఇందుకోసం ప్రజాప్రతినిధుల, ఉద్యోగుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కోరాం. వారి సహకారంతో ఒక సమగ్ర విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ద్వారా విధి నిర్వహణలో కొనసాగుతున్న సైనికులూ, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులూ, యుద్ధంలో క్షతగాత్రులైనవారూ, అంగవైకల్యం పొందినవారూ, మాజీ సైనికులూ.. ప్రయోజనం పొందుతారు.

దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా సైనికుల సంక్షేమంకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమంకోసం ఖర్చు చేస్తాం. సైనికుల సంక్షేమంకోసం చేపట్టే కార్యక్రమాలకోసం తమవంతు ఆర్థిక సహకారం అందించాలనే ప్రభుత్వం పిలుపునందుకుని… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతీ ఏటా 25వేల రూపా యలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 10వేల రూపాయలు సైనిక సంక్షేమనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని ఈ నిధికి అందివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సైనికులపట్ల తమ ఆదరా భిమానాలను ప్రకటించినందుకు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మాజీ సైనికులకు రెండు పెన్షన్లు!

మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తుంది. సైనికులెవరైనా రిటైర్‌ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్‌ పెన్షన్‌ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఈ సదుపాయం మరణించిన మాజీ సైనికుల భార్యలకు వర్తించ డంలేదు. కేంద్రం ఇచ్చేదికానీ, రాష్ట్రం ఇచ్చేది కానీ ఏదో ఒక పెన్షన్‌ మాత్రమే పొందా లనే విధానం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు రెండు పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆ మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా రెండు పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది.

యుద్ధరంగంలో శౌర్యప్రతాపాలు ప్రదర్శించినందుకూ, ప్రాణాలు త్యాగం చేసినందుకూ గ్యాలంటరీ అవార్డు పొందిన సైనికులకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవంగా కొంత నగదును అందిస్తున్నాయి. పరమవీరచక్ర, మహావీరచక్ర, వీరచక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్‌లాంటి అవార్డులు పొందిన వారికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికన్నా ఎక్కువ నగదు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరమవీరచక్ర, అశోక చక్ర అవార్డు పొందినవారికి పంజాబ్‌ ప్రభుత్వం గరిష్టంగా 2 కోట్ల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదిలక్షలు ప్రకటించింది. ఇప్పటినుంచి పరమ వీరచక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రెండు కోట్ల ఇరవై అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. మహావీర చక్ర, కీర్తిచక్ర అవార్డులు పొందిన వారికి పంజాబ్‌ ప్రభుత్వం దేశంలోనే గరిష్టంగా కోటి రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటినుండి తెలంగాణ రాష్ట్రం తరఫున మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డులు పొందిన తెలంగాణ బిడ్డలకు కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

వీరచక్ర, శౌర్యచక్ర అవార్డుల కింద పంజాబ్‌ రాష్ట్రం గరిష్ఠంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఏపీలో 6 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డు కింద తెలంగాణలో 75 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సేనా మెడల్‌ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి హర్యానా ప్రభుత్వం గరిష్ఠంగా 21 లక్షలు ఇస్తున్నది. ఉమ్మడి ఏపీలో 23,250 మాత్రమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సేనా అవార్డులు పొందిన వారికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. మెన్షన్‌ ఇన్‌ డిస్పాచెస్‌ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి పంజాబ్‌, హర్యానా ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఏపీలో 12వేల రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డుకింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్‌ పొందిన వారికి కేరళ రాష్ట్రంలో 20 లక్షల రూపా యలు ఇస్తున్నారు. ఉమ్మడి ఏపీలో లక్షా 27వేల రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ఈ మెడల్‌ పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం.

ఉత్తమ యుద్ధ సేవా మెడల్‌ పొందినవారికి కేరళ రాష్ట్రం 16 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఏపీలో 75వేల రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణలో ఈ మెడల్‌ పొందినవారికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. యుద్ధ సేవా మెడల్‌ పొందినవారికి కేరళలో 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 34వేల రూపాయలు ఇచ్చారు. తెలంగాణలో వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వీసు కాలంలో యుద్ధంలో మరణించిన సైనికులకు, ఇతర కారణాలతో మరణించిన సైనికులకు ఇస్తున్న పరిహారంలో ప్రస్తుతం వ్యత్యాసం ఉన్నది. ఇతర సదుపాయాల్లోనూ తేడా ఉన్నది. అయితే, యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఏ రకమైన పరిహారం, సదుపాయాలు ఇస్తున్నారో… సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలలాంటి ఇతర కారణాలవల్ల మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా అదే పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం.

రాష్ట్రస్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం పాత పది జిల్లాల్లో బోర్డులున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తాం.

సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తాం. మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపునిస్తాం. విద్యాసంస్థల్లో స్కౌట్స్‌, గైడ్స్‌, ఎన్‌.సి.సి. శిక్షణను ప్రోత్సహిస్తాం. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరిన విద్యార్థులను ప్రోత్పహించడంకోసం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం.

తెలంగాణలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ స్కూల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఉద్యోగరీత్యా సైనికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు మారుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతీసారి వారి సొంత వాహనాలకు ఆయా రాష్ట్రాల్లో తిరిగి లైఫ్‌ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. ఒకసారి ఏ రాష్ట్రంలోనైనా లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించిన వాహనానికి తెలంగాణలో తిరిగి ట్యాక్స్‌ వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్య పేర ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో మాజీ సైనికులకు రెండు శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించాం.

రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్‌ను మూడువేల రూపాయలనుంచి ఆరువేల రూపాయలకు పెంచాం.

స్పెషల్‌ పోలీస్‌ ఆఫీీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగు లకు జీతాలు పెంచాలని, ఆ జీతాలను ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతోపాటు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం.

రాబోయే రోజుల్లో సైనికుల సంక్షేమంకోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్రస్థాయిలో సైనిక సంక్షేమ సలహామండలిని ఏర్పాటు చేశాం. ఈ మండలితో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సైనికుల సంక్షేమంకోసం తీసుకునే చర్యలను సమన్వయ పరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజంనుంచి గౌరవాభిమానాలు పొందుతూ, మెరుగైన జీవితం గడిపేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని సభకు తెలియజేస్తున్నాను.

Other Updates