bammeraజనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు గ్రామాలలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏప్రిల్‌ 28న పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బమ్మెర, రాఘవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండు సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

రాఘవాపురంలో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకునుంచి ఇంటింటికీ మంచినీటిని, నల్లా తిప్పి ప్రారంభించారు. రాఘవాపురం సభలో మాట్లాడుతూ పట్టుబట్టి తెలంగాణను ఎట్లాగైతే సాధించుకున్నామో… అట్లనే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి ఓపికతో కష్టపడాలె, రాష్టంలోని ప్రతి గ్రామం గంగదేవిపల్లె స్ఫూర్తిగా సంఘటిత శక్తితో ముందుకు సాగాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మనం ఎంచుకునే మార్గం మంచిదైతే అందరూ మన వెనకే నడిచివస్తారని అన్నారు. ప్రతీ పల్లె పాడిపశువులతో కళకళలాడాలె. ఎర్రవల్లిలో నేను ఇచ్చిన 270 బర్లతో ఊరికి మేలు జరిగింది. పాలు అమ్ముకోవడం ద్వారా ఒక్క యేడాదిలోనే 13 లక్షల ఆదాయం సమకూరిందని అన్నారు. ఇక్కడ మీ గ్రామంలో కూడా బర్లను ఇవ్వాలని కలెక్టరుకు చెప్పాను అంటూ, ఆదర్శంగా నిలుస్తున్న రాఘవాపురం గ్రామానికి నా నిధి నుంచి కోటి రూపాయలు ఇస్తాను అని ప్రకటించారు.

అనంతరం బమ్మెరలోని పోతన సమాధిని, పోతన వ్యవసాయం చేసిన బావిని పరిశీలించారు. పోతనామాత్యునికి నివాళులర్పించి ఆయన అందించిన స్ఫూర్తితో ఆత్మగౌరవంతో ముందుకు సాగుదామని ప్రకటించారు. పోతన సమాధివద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ… సమైక్య పాలనలో తెలంగాణలోని ఎన్నో విశేషాంశాలు మరుగున పడ్డాయన్నారు. పోతన స్వస్థలాన్ని కూడా తారుమారు చేద్దామని సమైక్యపాలకులు ప్రయత్నించారని విమర్శించారు. మహాకవి శ్రీనాథుడికి, పోతనామాత్యుడికి మధ్య చుట్టరికం వుండేదని.. ఈ విషయమై పద్యాలు, ఆధారాలు ఎన్నో వున్నాయని కేసీఆర్‌ వివరించారు. పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా వున్న పేర్వారం రాములు, జనగామ జిల్లావాసి. ఈయన ఆధ్వర్యంలో రూ. 40 కోట్లతో జనగామ జిల్లాను ప్రత్యేక పర్యాటక ప్యాకేజీ కింద అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఇందులో 7.5 కోట్ల రూపాయలను బమ్మెర అభివృద్ధికి కేటాయించి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఈ సభలో పోతన గురించి మాట్లాడుతూ, తనకు తెలుగు అంటే చాలా ఇష్టమని అంటూ పోతన పద్యాలను చదవగా సభికులంతా సంబురంగా చప్పట్లు కొట్టారు. పోతన కవితా శైలిని వివరిస్తూ.. భోగభాగ్యాలను చూసి పోతన ఏ రాజుకూ తలవంచలేదని, పొలం దున్నుకుం టూనే పద్యాలు రాశారని చెప్తూ, పద్యాలెన్నో కంఠోపాఠంగా వచ్చని పేర్కొంటూ, తాను డిగ్రీ చదివిన రోజుల్ని అప్పటిగురువులను పేరు పేరునా గుర్తు చేసుకున్నారు.

బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజక వర్గంలో దశాబ్ధాలుగా పరిష్కరించని సమస్యలున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 176 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం తన సమ్మతిని తెలియజేశారు. పాలకుర్తికి వెయ్యి రెండు పడక గదుల ఇళ్ళను ఇవ్వమని ఎమ్మేల్యే దయాకర్‌రావు కోరగా… 500 ఇళ్ళకు ముఖ్యమంత్రి ఆమోదించారు.

Other Updates