paleluఅన్నవరం దేవేందర్‌

రోణి ఎండల్ల ఎవుసం చేసికునేటోల్లు మడికట్లల్లకు పెంట జారకొట్టుకుంటరు. ఆ నెలలోనే మొగులు మెత్తగై వానలు పడుతై. ఇంట్ల దాసుకున్న ఇత్తనపు అడ్లు నానపెట్టి మండె పోస్తరు. ఆ మొల్క మండెమీన నాలుగు రోజులు నీళ్ళు పోయంగనే మొల్కలు వస్తయి. అట్లనే నారుమండి ఇరువాలు మూడు సాల్లు మెత్తగ దున్ని పెరుగు పెరుగు చేస్తరు. మొల్క మండె ఇప్పి మొల్కంత కుల్లం కుల్ల చేసి రాతెండి డబ్బ, తట్టల్ల పట్టుకుంటరు. అంతలనే నారుమండి ఒడ్డుమీద నాలుగు పలుగు రాల్లు పెట్టి సున్నం ఏస్తరు. బొట్లు పెడుతరు, కొబ్బరికాయ కొడుతరు కొందరు కోన్ని సుత కోస్తరు. ఆ పలుగు రాళ్ళకు మొక్కి మొల్క అలుకుతరు. ఎవుసం చేసెటోల్లకు నమ్మకం మొగులును మొక్కుతరు. బాయి తవ్వంగ మొక్కుతరు అట్లనే మొల్క అల్కంగ సుత మనుసుల మొక్కుకుంటరు అదొక మనసు నిమ్మళపు ఆధ్యాత్మికత.

ఊర్లల్ల నమ్మకాలు ఉంటయి. వాటి సుట్టు వాల్లే ఉంటరు. అప్పుడప్పుడు కోన్ని కోసుకుంటరు. శ్రావణ శుక్రవారం నాడు కొబ్బరికాయ కొడుతరు. కొట్టి కొడవలి లిక్కెతోని వక్కలు తీస్తరు తాంబాలంల ఏసుకొని ఇంత ఏంచిన పెసరుపప్పు కలుపుతరు బెల్లం కలుపుతరు. తాంబాలం చేతుల పట్టుకొని నాలుగు బాటల్ల నిలబడి అటూ ఇటూ పోయేటోల్లకు పలారముల్లో అని అందరికి పెడుతరు. దేవుని పేరుమీద కొట్టిన పాలకాయ పదిమందికి పంచిపెట్టి తుర్తి పడుడే ఆ నిమ్మళపు మనస్సు. ఇగ కొబ్బరి కాయ సుత కొట్టెతందుకు పైసలు లేనోల్లు ఏంచిన పెసరు పప్పు బెల్లం పంచి పెడుతరు.

బగ్గ వానలు పడి చెర్లుకుంటలు పురాగ నిండినంక ఎవసాయదార్లు సంబురంగ ఉంటరు. ఒక్క ఎవుసం చేసేటోల్లే గాక అన్ని పనులోల్లకు మొకం మీద కళ కన్పిస్తది. చెరువు నిండితే ఆ సామికి పంట పండుతది ఇంటికి ఇన్ని ఇత్తులు అస్తయి. అండ్లకెల్లి అందరు పనోల్లు తెచ్చుకోవచ్చుననే ధీమా ఉంటది. అట్లనే చెరువునిండి మత్తడి పడ్డంక చెరువెనుక పట్టాదార్లు కట్టమీద మ్యాకపోతులు కోస్తరు. కట్టమైసమ్మకు అనే పేరుగని ఓ మెద్కు చెట్టుకాడ కోసి ఊరందరికి పాల్లు పెడుతరు. మనిషికి ఇంత అని మెద్కు ఆకుల్ల పెట్టుకొని కట్టమీంచే పట్టుకపోతరు. దీన్ని మైసమ్మ చేసుకునుడు అంటరు. ఆ దినమంత సంబురం కుషి నిమ్మళపు నమ్మిక. వానదేవుడు కరుణించిండనే నమ్మిక. వానలు పడి చెర్లు కుంటలు పొంగి బాయిల్ల నీళ్ళు నిండి పంటలు పండినంక దసర బతుకమ్మ పండుగలకు ముందు ఊర్లల్ల ఎవల మొకం చూసినా నవ్వు మొకమే కన్పిస్తది. నీళ్ళమీద పంట మీద నమ్మకమైన మనాది. కొత్తగ పంట కోసేటప్పుడు సుత కొబ్బరికాయ కొట్టి మొదలుపెడుతరు. వరికోసి కుప్ప ఏస్తరు. కట్టలు కట్టి ఒక్క దగ్గర కల్లంలకు తెస్తరు. కల్లంల వరి కుప్పలు పెట్టి పాలుపోస్తరు. అటెన్క పంజ కొడుతరు. బండిగీరను తెచ్చి కల్లంల ఏసి దానిమీదవరికట్టలు పట్టుకొని గింజలు రాలకొడుతరు. ముందుగాల పొలిగోలిగ అని మొదలు పెడుతరు అట్లంటె బుర్కతి ఉండదనే నమ్మిక.

వడ్లకుప్ప రాశిలెక్క అయినంక సుత అదే కల్లంల ఉండాలంటే ఆ రాశి సుట్టు వరిగడ్డి కాల్చిన ఊబది పోస్తరు. ఎడ్లబండ్లల్ల ఇంటికి జార కొట్టినంక వాటిని మొదలుపెట్టుడే కొత్త పెట్టుడు అంటరు అదొక పండుగ సంబురం. వరికల్లం కాడి ఎవసాయదారునికి అక్కరకు వచ్చే పనోల్లు నాగలి అమిరిచ్చిన వడ్లాయన, కర్రు మొన పెట్టిన కమ్మరాయన, బట్టలు ఉతికిన సాకలాయన, కుండలు ఇచ్చిన కుమ్మరాయన నీళ్ళు పార్చిన నీరటి ఆయన ఎడ్లకాసినాయనా, ఊరబర్లు కొట్టుకపోయిన ఆయన ఇట్ల సకలం పనోల్లు వచ్చి ఆసామి వడ్లు కుంచంల కొలిచి ఇస్తాంటే వాల్లు గొంగట్ల ముల్లె కట్టుకపోతరు. ఇచ్చెటాయనకు తీసుకున్నాయనకు ఇదొక గమ్మతైన అనుభవమే. వానలు పడి పంటలు పండె ఇత్తనాలు వస్తేనే అందరికి పండుగ. కల్లం కాన్నే ఇత్తులు కొంటబోయినంక మిగిలిన వడ్లు బోరెంల, బస్తాలల్ల ఇంటికస్తయి. ఇంట్ల గర్శలల్ల నింపి పెడుతరు. లేకుంటే సాయమన్ల కుప్పపోసి ధరపడ్డప్పుడు అమ్ముకుంటరు.

ఇట్లనే వడ్లు, జొన్నలు, పెసర్లు, కందులు ఇండ్లకు వచ్చినంక రైతు కుటుంబాలు కొత్త పెట్టు పెట్టుకుంటయి. కొత్త అంటే కొత్త కొత్తగ ధాన్యం ఇంటికి వచ్చినట్టు లెక్క. అప్పుడు ఆ ఇంటి ఆమె రాశిల నుంచి కుంచెడు వడ్లు తీస్తది. కుంచంకు రోలుకు, రోకలికి కుందెనకు సున్నం బొట్లతో పూదిస్తరు. కురాటిని పుదిస్తరు. పుదిచ్చుడు అంటే అందంగ అలంకరించుడు. కుంచం వడ్లు తీసికొని వాకిట్ల పెద్ద రోలు కాడ కుందెన పెట్టి అండ్ల వడ్లు పోసి రెండు పొడుగు రోకండ్లతోని దంచుతరు. అత్తకోడండ్లు లేదా యారాండ్లు ఇద్దరు సువ్వి.. సువ్వి అనుకుంట దంచుతరు. దంచిన వాటిని శాట్ల పోసి తవుడోదిక్కు, వడ్లో దిక్కు పోసి వేరు చేస్తరు. అండ్లకెల్లి మెరిగెలు తీసి నూకలు తీసి వేరు చేస్తరు. అప్పుడు అవ్వి కొత్త బియ్యం వచ్చినయని మురిపెంగ సూసుకొని శాట్లు పోసుకొని కొత్త కుండల పోసె ఉడకబెడుతరు. ఆ కుండను పొయ్యిని సుత మంచిగ పుదిస్తరు. అప్పటి బెల్లం కోసి పెట్టుకొని పాలు సుత ఉంచుకొని, పాలు బెల్లం అన్నంల ఏసి ఉడకబెడుతరు. దాన్ని బెల్లం బువ్వ అంటరు. ఆ బెల్లంబువ్వను కురాటి కుండ ముందు పెట్టి మొక్కుతరు. అందరు కల్సి బెల్లం బువ్వ తింటరు. కొత్త పెట్టుకున్న వాతావరణం కన్పిస్తది. ఇంట్ల అందరు నెత్తిమీద నుంచి తానం చేస్తరు. ఆడోల్లు కాళ్ళకు పసుపు పెట్టుకుంటరు. గదువలకు గంధం రాసుకుంటరు. ఇట్లనే ఇంట్లోల్లకు కొత్త పెట్టుకునుడు పండుగ.

ఈ పండుగకు ఒక్క దినం అని ఉండది ఏ రైతు అయినా వాల్లకు పంట ఇంట్లకు వచ్చిన్నాడు చేసి కుంటరు. ఊర్లల్ల బతుకమ్మ సంస్కృతి ఒక ప్రకృతి పండుగ అట్లనే పంటలు పండి కొత్తగ వంట చేసుకున్ననాడు కొత్త పండుగ అంటరు. తెలంగాణ పల్లెల్లో ఎద్దు ఎవుసాన్ని ప్రేమించెటోల్లు, ప్రకృతిని పూలను ప్రేమించెటోల్లు. లాలించేటోల్లు, వాల్లవైన ప్రత్యేకమైన పండుగలు చేసుకుంటరు. ఇదొక వ్యవసాయ ఆధ్యాత్మికత ఇదొక పారవశ్యత.

Other Updates