sampadakeeyamప్రజల మేలుకోసం, ముందు తరాల సమగ్ర అభ్యున్నతికోసం ప్రభుత్వాలు తీసుకునే ఆయా నిర్ణయాల ఫలితాలు భవిష్యత్తులో ప్రయోజనాలు అందిస్తాయేమో కానీ ప్రజల స్పందనలు తక్షణమే వ్యక్తం అవుతాయి. గత నెలలో రాష్ట్రానికి సంబంధించి కీలక ఘట్టాలు కార్యరూపం ధరించిన సందర్భంగా ప్రజల పక్షాన వ్యక్తమైన స్పందనలు ‘మంచిని’ ఆహ్వానించే సానుకూల దృక్పధంతో ఉండడం గమనార్హం.

మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై నిర్మించనున్న బ్యారేజీలపై చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడంద్వారా రాష్ట్రప్రభుత్వం తమ ప్రాథమ్యం ఏమిటో మరోసారి స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిలువెత్తు నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల రంగానికి జవజీవాలు కల్పించాలనే లక్ష్యంతో పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమంత్రి కెేసీఆర్‌ ప్రశంసాపూర్వక ధోరణితో వ్యవహరించారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పాదుకొన్న ప్రధానాంశం నీళ్ళు. లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగునీటి వసతి కల్పించడంలో నాటి ప్రభుత్వాలు అవలంబించిన వైఖరిని బద్ధ్దలు కొడుతూ రాష్ట్రప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టి జయప్రదంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే కార్యరూపం ధరించిన ఇరురాష్ట్రాల ఒప్పందం సర్కారు చిత్తశుద్ధి, అంకితభావానికి తిరుగులేని రుజువు.

ఇక పరిపాలనా సౌలభ్యంకోసం పదిహేడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రజల ముందుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించడం ప్రజాస్వామిక స్ఫూర్తికి పరిమళం అద్దినట్లుగా పేర్కొనవచ్చు.

ప్రజల సౌకర్యం పరమావధిగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి శాస్త్రీయ ప్రాతిపదికపై రూపుదిద్దుకున్నది. అన్ని పక్షాలవారితో సమావేశమై, అందరి మనోభావాలను పరిగణనలోకి స్వీకరించి ముసాయి దాను వెలువరించడం, అభిప్రాయాల స్వీకరణ ముగిశాక అవసరమైతే మార్పుల, చేర్పులకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. గతంలో ”మేం ప్రభుత్వాధినేతలం, మేం పరిపాలిస్తాం. మీరు ఫలితాలు అనుభవించి తీరాలనే” ఒంటెత్తుపోకడలకు పూర్తి భిన్నంగా, పారదర్శకంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రజలు మనసారా ఆహ్వానిస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా మిషన్‌ భగీరథకు శ్రీకారం, కృష్ణవేణి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం శ్రద్ధవహించిన తీరు మరో సారి ప్రజల ప్రశంసలకు పాత్రమైంది. అన్నివేళలా ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను గౌరవించే ముఖ్యమంత్రి సారథ్యంలో పాలనా యంత్రాంగం బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేస్తున్నది.

Other Updates