palamuruజిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా మహబూబ్‌ నగర్‌ (పాత) జిల్లాను తూర్పు గోదావరి జిల్లాకు ధీటుగా తయారు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. పాత మహబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డికె. అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తదితరులు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో సమావేశమయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పాలమూరు జిల్లాకున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్‌ తదితర అంశాలను సిఎం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయం నుంచి రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను బయటపడెయ్యాలన్నది తమ అభిమతమని సిఎం అన్నారు.

”గోదావరిలో 3వేల టిఎంసిల లభ్యత ఉంది. కృష్ణలో 1200 టిఎంసిల లభ్యత ఉన్నది. రెండు నదుల్లో కలిపి 4వేల టిఎంసిలకు పైగా నీరుంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే చాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చెప్పాను. తెలంగాణలో గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర జలవిధానం అమలు చేస్తున్నా. ఇందుకోసం ప్రాజెక్టుల రీ డిజైన్‌ చేశాం. తెలంగాణకు ఎక్కువ మేలు గోదావరి జలాల ద్వారా జరుగుతుంది. పాలమూరు జిల్లాకు మాత్రం నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకోసమే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్‌ చేశాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా సరే, అపెక్స్‌ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం. అభ్యంతరాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టి తీరుతాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుంది. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు కూడా నీరందుతుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.

”ప్రాజెక్టుల రీ డిజైన్లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని వాడుకోవాలని నిర్ణయించాం. జూరాల పాయింట్‌ వద్ద గరిష్టంగా 8 టిఎంసిలు వాడుకోవడానికి మాత్రమే మనకు అవకాశం ఉంది. కానీ శ్రీశైలం పాయింట్‌ వద్ద 100 టిఎంసిల లభ్యత ఉన్నది. ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం పాయింట్‌ వద్దనే పాలమూరు ఇన్‌ టేక్‌ ప్లాన్‌ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయల్‌ సాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. గత ఏడాది నీరిచ్చాం. ఈ ఖరీఫ్‌ నాటికి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూడా చేపట్టాలని నిర్ణయించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. గట్టు లిఫ్టు పనులు కూడా త్వరగా పూర్తయ్యేట్లు చూస్తాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”గద్వాల-మాచర్ల రైల్వే లైను పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైను పనులు చేపట్టడం అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల పీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను మరిన్ని ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు. సమైక్య పాలనలో ఎంతో నష్టపోయిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి రావాలని కోరారు

Other Updates