palamuruకాగితాలకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాణం వచ్చింది. సాగునీరు లేక భూములు బీళ్లుగా మారి కూలి పనుల కోసం వలస బాట పట్టిన మహబూబ్‌ నగర్‌ రైతుల తలరాత మారే ఘడియలు వచ్చాయి. దాదాపు 15 లక్షల మంది వలస బాట పట్టి దేశంలోనే రికార్డు సృష్టించిన పాలమూరు రైతుల బతుకులు మారాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు నిజమవుతున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నాలుగు పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ ఖరీఫ్‌ నుంచే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటున్నది. బీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఖరీఫ్‌ నుంచే మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.

పాలమూరుకే తొలి ఫలితం అన్న ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప పాలమూరు రైతుల బతుకులు మారవని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పలుమార్లు చెప్పేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యం అత్యంత నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకే దక్కాలని సంకల్పించారు. జిల్లాలోని ప్రతీ ఎకరం సాగులోకి రావాలని తపించారు. ప్రాజెక్టుల రీ డిజైన్లో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకే తొలి శంకుస్థాపన చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యే లోపు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేశారు. పాత బిల్లులు కూడా చెల్లించారు. పరిపాలనా పరమైన జాప్యాన్ని నివారించారు. ఫలితంగా 2005 జలయజ్ఞంలో భాగంగా చేపట్టినప్పటికీ నత్తనడక పనులు నడుస్తున్న బీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌, కల్వకుర్తి ప్రాజెక్టులు పరుగులందుకున్నాయి.

ప్రాజెక్టుల వద్ద నిద్ర చేసి మరీ పనులు చేయించిన హరీష్‌ రావు
పాలమూరు ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ పథకాలకు అవసరమైన భూ సేకరణ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. భూ నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. కొన్ని చోట్ల సాగు నీటి ప్రాజెక్టులు, ప్రధాన కాలువలకు అంతరాయంగా ఉన్న రైల్వే సమస్యలను రైల్వే అధికారులతో నిరంతరం చర్చించి పరిష్కరించారు. కాంట్రాక్టర్లు, అధికారులతో పలుమార్లు సమావేశమై ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాలు అన్వేషించారు. కారణాలు తెలిసిన తర్వాత వాటి పరిష్కారానికి చొరవ చూపారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించారు. పని అయిన వెంటనే బిల్లు ఇవ్వడం ద్వారా రేయింబవళ్లు ప్రాజెక్టు పనులు జరిగేలా ప్రోత్సహించారు. పలుమార్లు మహబూబ్‌నగర్‌ జిల్లాను సందర్శించారు. దాదాపు ప్రతీ ప్రాజెక్టులోని లిప్టులు, పంప్‌హౌజ్‌లు, కాలువలు, పైపులను స్వయంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి,ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న చోటే నిద్ర చేసి అక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు, టెక్నీషియన్లు, కూలీలతో కూడా మాట్లాడారు. వారిలో ఉత్సాహం నింపారు. పనులు త్వరగా జరిగేలా చూశారు. ప్రతీ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు తయారు చేసి ప్రతీ క్షణం ఎక్కడేమి జరుగుతుందో తెలుసుకున్నారు. సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారితో కూడా స్వయంగా మాట్లాడారు. ప్రతీ రోజు పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. అందుకోసం రోజుకో గంట సమయం ప్రత్యేకంగా వెచ్చించారు. ఇన్ని ప్రయత్నాల తర్వాత ప్రాజెక్టు పనులు అనుకున్న రీతిలో పూర్తి దశకు చేరుకున్నాయి.ఈ ఏడాది ఖరీఫ్‌కు ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు అందివ్వాలనే లక్ష్యం నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడానికి పట్టుదలతో పనిచేశారు. తాను స్వయంగా చొరవ చూపి పూర్తి చేయించిన పనులను తానే స్వయంగా జులై 21న ప్రారంభించి, రైతులకు పవిత్ర కృష్ణా జలాలు అందించారు. రాష్ట్రానికి తాను పెద్ద నీరడిలా పనిచేస్తానని ప్రకటించుకున్న మంత్రి ఈ పనులు ప్రారంభించడం ద్వారా మాట నిలబెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రులు పాల్గొన్నారు.

కష్టపడి పనిచేసిన అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతను, పాలమూరు ప్రజల అవసరాలను గుర్తించిన నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు కూడా ఈ రెండేళ్ల సమయంలో ఎంతో కష్టపడి పనిచేశారు. మారుమూల ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో పనులను జరుగుతున్నా సరే, కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల వద్ద మకాం పెట్టారు. కింది స్థాయి అధికారి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇంజనీర్లు రేయింబవళ్లు పనులు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి అందించిన ప్రత్యేక సహకారంతో అధికారులు, ఇంజనీర్లు శక్తివంచన లేకుండా పనిచేశారు. రికార్డు టైమ్‌ లో పనులు పూర్తి చేసి రైతులకు మేలు చేశారు.

సభా కార్యక్రమం:
మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల వలసగోస తీర్చి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందిస్తున్నదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అన్నారు. జులై 21న మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలం నందిమల్ల వద్ద బీమా సమాంతర కాల్వకు సాగునీటిని విడుదల చేసి ప్రారంభించారు. దీంతో పాటు అదే రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట వద్ద రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకం – 1 పంప్‌లను, ధన్వాడ మండలం తీలేరు వద్ద కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం -2 పంప్‌లను ప్రారంభించారు. ముందుగా జూరాల ప్రాజెక్టుకు చేరిన కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు వదలడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, జిల్లా ప్రజల వలసలగోస తీరే రోజు వచ్చిందని అన్నారు. జిల్లాలోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ల ద్వారా ఈ ఖరీఫ్‌లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మరో 8లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించే వరకు విశ్రమించబోమని అన్నారు. నందిమల్ల పెద్దచెరువును రిజర్వాయర్‌గా మార్చి నీరందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామని, జూరాల ద్వారా హై లెవల్‌ కెనాల్‌ లేదా లిఫ్ట్‌ ద్వారా నీటిని నింపి నందిమల్లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖల అధికారులు బాగా కృషి చేసి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయటం పట్ల ఆయన అధికారులను అభినందించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే బీమా సమాంతర కాల్వ ద్వారా సాగునీరు అందిస్తున్నామని, అంతేకాక నెట్టెంపాడు ద్వారా లక్షా 40వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తుండగా, రానున్న వారం పది రోజుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష 50వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు ఎ.పి. జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌ సీజల్‌లో మొదటి సారిగా కృష్ణా నదికి వరద నీరు రాగానే చుక్కనీరు కూడా వృధా కాకుండా వాడుకు నేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్టుల పంప్‌ లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మన నీళ్లను మనమే వాడుకోవచ్చన్న ఆశయం నెరవే రిందని, ప్రాజెక్టులను ఆపడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి చేసి తీరుతామని తెలిపారు. ఈ సమావేశానికి మక్తల్‌ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

కొత్తకోట వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 సంవత్సరాలు పట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెడింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద 2500 ఎకరాల భూసేకరణను పూర్తి చేశామని, తనతోపాటు సాగునీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది పట్టుదలతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా ప్రాజెక్టులకై 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మరో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కల్వకుర్తి ఎత్తిపోతల కింద లిఫ్ట్‌ – 3 పనులు చేపట్టామని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవని తెలిపారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు ప్రజల ముఖ్యంగా రైతుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా పాలమూరుపై ప్రత్యేక అభిమానం ఉందని, అందువల్లనే జిల్లాపై ప్రత్యేక దృష్టి నిలిపి జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారని అన్నారు.

Other Updates