cm-bamkersసాంకేతిక అభివృద్ధి దినదిన ప్రవర?మానమవుతున్న నేపథ్యంలో ప్రజలకు డిజిటల్‌ ఫైనాన్షియల్‌ లిటరేచర్‌ (సాంకేతిక ఆర్థిక అక్షరాస్యత) పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో వున్నదని, ఈ మేరకు ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు రావాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు.పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు డిజిటల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిని అవలంబించడం నేటి అవసరంగా మారిందన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ రూపంలో అభివృద్ధి పరిచేందుకు, అందుకు సంబంధించిన సేవలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ ముందుకు వచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో డిసెంబర్‌ 6న ‘ప్రగతిభవన్‌’లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల ధోరణులను ముఖ్యమంత్రికి వారు వివరించారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ను తమ బ్యాంకు తరఫున అందిస్తామని సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మార్పుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటారని అయితే వారి అలవాటును మార్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యే విధంగా వివరించడం ద్వారా వారిలో మార్పు సులభతరమవుతుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్‌ విధానంలో డబ్బును బదలాయించే విధానం తక్షణావసరం అని సీఎం తెలిపారు.

సాధ్యమైనంత త్వరలో తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి డిజిటల్‌ విధానాన్ని అవలంభిస్తూ… నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిపే రాష్ట్రంలో నిలుస్తుందన్నారు. అంతకు ముందు ఐదు రోజుల్లో ప్రతి రోజూ అత్యధికంగా డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు నడుస్తున్న రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందనే సమాచారం తెలుసుకుని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ”ప్రజలకు సాంకేతికతను ఉపయోగించు కోవడం తెలియదని కాదు.. కాకపోతే నగదు వాడకం అలవాటుగా మారిన నేపథ్యంలో వారికి ఏటీయం కార్డులు, స్వైపింగ్‌ మిషిన్లు ఇంకా అలవాటు కాలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నగదు రూపంలోనే చలామణిలో వున్నది. పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మటన్‌కోసే దుకాణాల్లో, కిరాణం కొట్లల్లో చెక్కులిచ్చి కొనుక్కునే అలవాటు ప్రజలకు వున్నదా? బ్యాంకు లావాదేవీలు ఇటువంటి వ్యవహారాల్లో వున్నాయా? అది ఒక్కసారే అలవాటు కాదు.. వాళ్ల ఆలోచనా విధానం మారాలి.. అందుకు వాళ్లకు అవగామన కల్పించి సన్నద్ధం చేయాలి.. అందుకు మీ బ్యాంకు వాళ్లు కూడా సహకారం అందించడానికి ముందుకు రావడం సంతోషం” అని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో అవగాహన కల్పించే విధంగా జంగిల్స్‌ తయారు చేసి ప్రసారం చేయాలని మంత్రి కే.తారకరామారావును సీఎం ఆదేశించారు. ”రూపాయల నోట్లు జేబుల్లో పెట్టుకొని తిరిగితే యింట్లో దాసుకుంటే.. వో దొంగో డొచ్చి యేసుకపోయే.. యాన్నో పోగొట్టుకుంటేమి.. అట్లా ఆగం కాకుండా తమ డబ్బులకు డిజిటల్‌ పద్ధతిలో అయితే పూర్తి భరోసా వుంటది, అనే విషయాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించాలి అని మంత్రి కేటీఆర్‌కు సీఎం సూచించారు. ప్రజలకు ఆ దిశగా చైతన్య పరచాలే.. అందుకు ప్రభుత్వం ఏమి చేయాలె? ప్రభుత్వ అధికార యంత్రాంగం బ్యాంకర్లతో ఎట్లా సమన్వయం అయి పని చేయాలె? అందుకు బ్యాంర్లు ఎట్లా సహకరిస్తరు? అనే అంశాలను వివిధ బ్యాంకర్లతో కూర్చొని చర్చించాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వినియోగదారులు ఏటీయం డెబిట్‌కార్డులను వాడుతున్నారు? ఎన్ని బ్యాంకులు కార్డులు జారీ చేసినయి? వాటి మొత్తం సంఖ్య ఎంత? అందులో గ్రామీణ ప్రాంతంలో ఎన్ని? పట్టణ ప్రాంతంలో ఎన్ని కార్డులు వాడకంలో వున్నాయి? అవి ప్రస్తుత లావాదేవీల అవసరాలను ఏ మేరకు తీరుస్తున్నాయి? అందులో వాడకంలో వున్నయెన్ని? లేనివెన్ని? అనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో బ్యాంకులనుంచి సమీకరించాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు.

బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అందుకు డిజిటల్‌ ట్రాన్సాక్షన్లను, మొబైల్‌ యాప్‌, తదితర సెల్‌ఫోన్‌ సంబంధిత వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సీఎం అభిప్రాయపడ్డారు.

”విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు, ఐటీ సెక్టార్‌ తదితర ప్రైవేట్‌ రంగ ఉద్యోగులు ఎట్లయినా కార్డులనుపయోగిస్తారు. గ్రామాల్లోని రైతులు, కూలీలు తదితర వృత్తి పనులు చేసుకుంటూ జీవించే వారికి దీనిపట్ల అవగాహన పెంచాలే. వాళ్లకు వాళ్ల పిల్లలు, విద్యార్థులద్వారా, టీచర్లు తదితర విద్యావంతులైన గ్రామస్థులద్వారా, ఎంపిక చేయబడిన నిపుణుల ద్వారా అవగాహన పెంచాల్సిన అవసరం వున్నది’ అని సీఎం తెలిపారు.

ఈ డిజిటలైజేషన్‌ మిషన్‌లో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరమున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేజి సెక్రటరీలు, తదితర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణనివ్వాల్సిన అవసరమున్నదన్నారు. ఈ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు పలు సలహాలను, సూచనలను ముఖ్యమంత్రికి అందజేశారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి.. ఈ వ్యవహారం హడావుడిగా అములులోకి తెస్తామంటే కుదరదు. మొదటి దశలో ప్రభుత్వంలో నడిచే ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ మనీ ట్రాన్సాక్షన్‌ పద్ధతిలో నడిపించాలి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లద్వారా, సివిల్‌ సప్లయ్‌ ద్వారా ఇంకా యితర రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని… పూర్తిస్థాయి ‘ఇ’ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో, డిజిటల్‌ రూపంలో నడిపించాలని సీఎం తెలిపారు. ఆర్థిక వ్యవహారాలన్నీ.. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌స్ఫేస్‌ (యుపిఐ) పద్ధతిలోకి మలచడం ద్వారా సులభతరం చేయవచ్చని తెలిపారు. ఇదే పద్ధతిలో రైతులకు ధాన్యం అమ్మకం ద్వారా, తదితర వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించడం.. తద్వారా వారు డ్రా చేసుకొనే క్రమంలో ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతి క్రమేణా అలవాటవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కొంతశాతం నగదు లావాదేవీలు నడుస్తున్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక సంస్కృతి నగదుతోనే ముడిపడి వున్నందున.. నగదు లావాదేవీల అవసరం కొంత మేరకు ఎల్లప్పుడూ తప్పనిసరిగా వుంటుందని సీఎం అన్నారు. ‘సామాన్యులు తమ సంపాదనను డబ్బుల రూపంలో చూసుకుంటారు. నోట్లను చిల్లర పైసలను తడిమి చూసుకుని దాచుకుంటేనే వాళ్లకు తృప్తి’ అని ముఖ్యమంత్రి వివరించారు. కాగా దేశంలో రానున్న కాలంలో అన్నిరకాల టాక్సులు రద్దయి బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌ (బీటీటీ-బ్యాంకులనుంచి నగదు లావాదేవీల ప్రకారం ట్యాక్సు విధింపు) మాత్రమే విధించే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్‌ వివరించారు. మార్పుకు అనుగుణంగా బ్యాంకు మేనేజర్లు, అధికారులు, సిబ్బంది మారాలని, ప్రజలకు సహకరించాలని సూచించారు. ఈ మేరకు వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు.

డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను చేపట్టేందుకు (ఐటీ మంత్రిత్వశాఖ) తెలంగాణ ప్రభుత్వం స్వయంగా తయారుచేసిన మొబైల్‌ యాప్‌.. ‘టీఎస్‌ వాలెట్‌’ను త్వరలో విడుదల చేయాల్సిందిగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

సీఎం కేసీఆర్‌తో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతాధికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్‌ బల్హోత్రా, అవిజిత్‌ షా, జితా మిత్రా తదితరులు సమావేశమైన ఈ కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్‌ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates