eetelaఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, ఎంతోకాలంగా అణగారిన ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్‌ బాధ్యతను తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వంపై మోపారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఎనిమిది చీకటి సంవత్సరాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు, సొంత రాష్ట్రంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించారు. మా ప్రభుత్వంపై ప్రజలు కలిగివున్న విశ్వాసానికి అనుగుణంగా నిలవాలనేదే మా నిరంతర ప్రయత్నం.

కొత్త రాష్ట్రం ఏర్పడగానే, వనరులపై అస్పష్టత, పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రెండు రాష్ట్రాల మధ్య సిబ్బంది పంపిణీ వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్ర ఆర్థికస్థితిపైన, వనరులపైన, పేదల దీనస్థితిని తొలగించ డానికి చేపట్టవలసిన శాశ్వత పరిష్కారాలపైన పేదలు మానవీయమైన, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి గల అవకాశాలపైన మాకిప్పుడు పూర్తి అవగాహన ఏర్పడింది.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ప్రభుత్వం చేపట్టిన క్రియాశీల విధానాలవల్ల రెవెన్యూ వృద్ధి అమితంగా ఉందని గౌరవ సభ్యులకు తెలుపడానికి సంతోషంగా ఉన్నది. ఆర్థిక వృద్దికిగల అన్ని అవకాశాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలల్లో పన్నుల ద్వారా సమకూరిన రాష్ట్ర ఆదాయం 19.61 శాతం వృద్ధి రేటుతో దేశంలోని చాలా రాష్ట్రాలకన్నా ఎక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు వల్ల స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ, ఇతర పన్నుల ద్వారా సమకూరే ఆదాయం పెరగడం గమనార్హం. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దడంవల్లనే మన ఆర్థిక వ్యవస్థ ఇంతటి దృఢత్వాన్ని సంతరించుకున్నది.

ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి మాకు నిరంతరం మార్గ నిర్దేశనం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనే ఆరాటం మా ప్రణాళికలో అడుగడుగున ప్రస్ఫుటమవుతుంది. రాష్ట్ర అవతరణ నాటినుంచి పేదల సంక్షేమమే పరమావధిగా, పారదర్శకమైన, ప్రజానుగుణమైన పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మా ప్రభుత్వానికి ప్రజలే ప్రభువులు, వారికోసం పని చేయడమే మా కర్తవ్యం.

2017-18 బడ్జెట్‌ రూపకల్పనలో మార్పులు:

బడ్జెట్‌ రూపకల్పనలో ఈసారి భిన్న పద్ధతి అవలంబించాం. సహజంగా బడ్జెట్‌ను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద చూపిస్తాం. దీనికి బదులుగా రెవిన్యూ, క్యాపిటల్‌ పద్దుల క్రింద బడ్జెట్‌ రూపకల్పన జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పకుండా పాటించాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే మన బడ్జెట్‌ ప్రతిపాదనను కూడా రూపొం దించాం. అకౌంటింగులో కూడా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ సూచనలకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకరీతిన వుండడంకోసం మా ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది. బడ్జెట్‌ వర్గీకరణలో కొత్త విధానాన్ని చేపట్టడంవల్ల, కేంద్ర ప్రభుత్వం, పంచవర్ష, వార్షిక ప్రణాళికల స్థానంలో పదిహేనేండ్ల దార్శనికత, ఏడేండ్ల వ్యూహం, మూడేండ్ల కార్యాచరణ ప్రణాళికలు ప్రవేశపెట్టడమైనది. నిజానికి ఈ పరిణామం ‘మీ జిల్లాను తెలుసుకోండి’, ‘మీ జిల్లా ప్రణాళికను రూపొందించుకోండి…’ అనే ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తుంది.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, టీఎస్‌ఐపాస్‌, నిర్ణీత వ్యవధిలో కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడంవంటి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైనా కావచ్చు. ఇవన్నీ ఊహాతీతంగా అభివృద్ధిని ఎల్లలుదాటి విస్తరింపజేసేవే. వచ్చే కొన్నేండ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల సరసన నిలబెట్టేవే.

బడ్జెట్‌ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా మార్పులు అనివార్యం అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌ కేటాయింపులు ఎలా వుండాలనే విషయం చర్చించి, ప్రభుత్వానికి సూచనలు చేయడానికి ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలను ముఖ్యమంత్రి నియమించారు. ఆయా వర్గాలకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధుల కేటాయింపులు ఉండే విధంగానే అంచనాలు రూపొందించాము. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీలకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎస్సీ, ఎస్టీల స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌లోని నిధులు ఒక ఏడాది వ్యయం కాకపోతే, వాటిని తదుపరి సంవత్సరానికి క్యారీఫార్వర్డ్‌ పద్ధతిలో బదిలీ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపట్ల పూర్తి నిబద్ధత కలిగిన మా ప్రభుత్వం ఈ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నది.

గతంలో ఉప ప్రణాళికల క్రిందగల బడ్జెట్‌ వ్యయంపై దృష్టిసారించి, నిర్ణీత వ్యవధిలో సమీక్షించకపోయేవారు. దీనివల్ల నిధులు పూర్తిగా వ్యయం కాకపోయేవి. కానీ కొత్త చట్టం ఇందుకు భిన్నమైనది. కొత్త చట్టం ప్రకారం-నిర్ణీత కాలానికి పథకాలవారీగా సమీక్ష జరిపి, మూడు నెలలకు ఒకసారి అసెంబ్లీలో, శాసనమండలిలో నివేదికలు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈ విధానం మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని సూచిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికోసం వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ నిధులు కేటాయించడంతో బాధ్యత తీరిపోదని, వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించేవిధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద ఈసారి బడ్జెట్‌లో రూ. 14,375.12 కోట్లను, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద ఈసారి బడ్జెట్‌లో రూ. 8,165.88 కోట్లను కేటాయిస్తున్నాము.

2016 నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేయడం 2017-18 సంవత్సర బడ్జెట్‌పై అమిత ప్రభావాన్ని చూపింది. ఇది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం వసూళ్లను దెబ్బతీసింది. కొంతమేరకు వ్యాట్‌ రెవిన్యూను కూడా తగ్గించింది. అయితే నగదు లావాదేవీలు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకున్నట్లయితే పన్నుల వసూలు మెరుగుపడుతుందని, కేంద్రంనుంచి పన్నుల రాబటి కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నది. 2017 జూలై నుంచి అమలయ్యే గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్టీ) ప్రభావంపై కూడా కొంత అనిశ్చితి ఉన్నది.

ఈ బడ్జెట్‌పై మన ముఖ్యమంత్రి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమంపట్ల ఆపేక్షతోపాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తున్నది.

భారీ పాలనా సంస్కరణలు

పరిపాలనా విభాగాలు చిన్నవిగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే అంబేద్కర్‌ మహాశయుని తాత్విక చింతనను సూక్ష్మస్థాయిలో ఆచరించే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేసింది. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం అనే మూడు ప్రాతిపదికల ఆధారంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను చేపట్టింది. తెలంగాణ 10 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతోపాటు 25 కొత్త రెవిన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, కొత్త పోలీస్‌ కమిషనరేట్లు, 23 కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 28 సర్కిల్‌ కార్యాలయాలు, 94 కొత్త పోలీస్‌ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సామాన్యుల ముంగిట్లోకి పాలన రావాలనే లక్ష్యానికి పరిపాలన విభాగాల పునర్‌వ్యవస్థీకరణ దోహదం చేసింది. జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దేశానికి ఆదర్శంగా…

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికి గర్వకారణం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలాంటి కార్యక్రమాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించడమేకాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది.రాష్ట్రం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు అభినందించింది. అవార్డులు ప్రకటించింది. అభివృద్ధిలో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 30కిపైగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూ బడ్జెట్‌లో సింహభాగం కేటాయింపులు జరుపుతూ సంక్షేమరంగంలో మన దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నాం.

అభివృద్ధి నమూనా అంటే ఇప్పటివరకు కేరళ, గుజరాత్‌ల గురించి దేశం మాట్లాడేది. కానీ అతికొద్ది సమయంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం నాకున్నది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రజాభ్యుదయం కోసం అర్థవంతంగా, సమర్థవంతంగా నిర్వహించే సృజనాత్మక ఆర్థిక ప్రణాళికయే బడ్జెట్‌. వందలకోట్లు వచ్చిపడినా పరిపాలన దక్షత, అంకితభావం లేకపోతే ప్రజాధనం నిరర్థకమైపోతుంది. వృధా వ్యయానికి అసంగత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజా జీవన వికాసమే గీటురాయిగా కూర్చిన ఆర్థిక ప్రణాళిక ఇది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చి కులవృత్తులకు ఆదరువుగా నిలిచి, కూలిన జీవితాలను నిలబెట్టేదే బడ్జెట్‌. జానెడు పొట్టనింపుకోవడం కోసం ఊరు జాడలు మరిచి, తల్లిదండ్రులను విడిచి, భార్యాబిడ్డలకు దూరమై దూరదేశాలలో దు:ఖం వెళ్లదీస్తున్న తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష. మైగ్రేషన్‌ నుంచి రివర్స్‌ మేగ్రేషన్‌ దిశగా తెలంగాణ ప్రస్థానం సాగేందుకు ఈ బడ్జెట్‌ దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాను.అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగాన్ని సాధిం చేందుకు కరువంటూ కాటకమంటూ కనిపించని తీరాలకు తెలంగాణను చేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి నాయ కత్వంలో మేము అలుపెరుగకుండా పరిశ్రమిస్తాం. బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను ఆమోదించాలని కోరుతున్నాను.

Other Updates