vileenamతెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డా|| చెన్నారెడ్డిని అధ్యక్షస్థానంనుండి తొలగిస్తూ రాష్ట్రకార్యవర్గాన్ని పునర్నిర్మించడం అనివార్యం అయిందని టి.ఎస్‌. సదాలక్ష్మి డిసెంబర్‌ 5న ప్రకటించారు.

కాంగ్రెస్‌లోని ముఠా రాజకీయాలమాదిరే ప్రజాసమితిలో గ్రూపులు ప్రవేశపెడు తున్నారని, 1969 మే 22న అధ్యక్షుడైనప్పటినుండి సమితిలో పెత్తందారీతనం, వ్యక్తిపూజ ఎక్కువైందని ఆమె చెన్నారెడ్డిపై ఆరోపణలు చేశారు.”తనకై తానే డా|| చెన్నారెడ్డి కేంద్ర నాయకులతో సంప్రదింపులు ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ కోసం, శాసనసభ్యులు, యంపీలు చేయదలచుకొన్న రాజీనామాల విషయం డాక్టర్‌ రెడ్డి మూలకు నెట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు శత్రువులుగా పేరుపొందిన జె. చొక్కారావు, వి.బి. రాజు, నూకల రామచంద్రారెడ్డిలతో మిలాఖతై డా|| చెన్నారెడ్డి సమైక్య ప్రకటనలిస్తున్నారు. రాజకీయ పరిపాలన మార్పులకోసం వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఆందోళనను పున: ప్రారంభించి జయప్రదంగా నడుపవలసిందిపోయి, సంస్థాగత ఎన్నికలు జరపాలి లేనియెడల రాజీనామా చేస్తానంటూ డాక్టర్‌ చెన్నారెడ్డి బెదిరిస్తూ ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నార”ని తీవ్రమైన ఆరోపణలను సదాలక్ష్మి చేశారు.

సదాలక్ష్మితోబాటు ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో జి.ఎస్‌. సక్సేనా (ఉపాధ్యక్షుడు), న్యాయవాదులు జి. నారాయణరావు, జగన్‌మోహన్‌రెడ్డి (ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు), బి.వి. బక్షి (కార్యవర్గ సభ్యుడు) వున్నారు. సదాలక్ష్మి ప్రకటనపై మదన్‌మోహన్‌ స్పందించారు. డా. చెన్నారెడ్డిని సమర్ధిస్తూ సదాలక్ష్మి ఆరోపణలను ఖండించారు. చెన్నారెడ్డిని తొలగించే అధికారం వీరికి లేదన్నారు.జనవరి రెండోవారంలో ప్రజాసమితి సంస్థాగత ఎన్నికలు జరుగనున్నాయి. ఉద్యమ సారథులలో ఒకరైన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అక్టోబర్‌ 8న ప్రజాసమితికి రాజీనామా చేసినట్టు డిసెంబర్‌ 9న ప్రజాసమితి కార్యదర్శి బి. సత్యనారాయణరెడ్డి లేఖకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

డిసెంబరు 15న తెలంగాణ కోరుతున్న కాంగ్రెస్‌వాదుల సమావేశాన్ని జి. రాజారామ్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ పి.సి.సి.తోబాటు ప్రత్యేక రాష్ట్రం కూడా కావాలని సమావేశానికి హాజరైన నాయకులు అభిప్రాయపడినట్లు తెలిపారు. జనవాక్య సేకరణ ద్వారా నిర్ణయం తీసుకోవాలని డా|| చెన్నారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఎంపీల అభిప్రాయం తెలుసుకొని రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని వి.బి. రాజు అభిప్రాయపడినట్లు జి. రాజారామ్‌, జి.వి. సుధాకర్‌రావులు పత్రికలకు తెలిపారు.

ప్రధాని ఇందిర, నిజలింగప్ప వేర్వేరుగా ఏర్పాటు చేసే అహ్మదాబాద్‌, బొంబాయిలలో జరిగే ఏ కాంగ్రెస్‌ మహాసభకూ హాజరుకారాదని తెలంగాణ కాంగ్రెస్‌వాదులలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడినారు.”దేశంలో ప్రస్తుతం వున్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్‌వాదులు బలపర్చాల”లని డా|| చెన్నారెడ్డి అన్నారు. ”తెలంగాణ సమస్యను ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాన్ని ప్రధాని కనుగొనగలరన్న ఆశాభావాన్ని చెన్నారెడ్డి వ్యక్తం చేశారు.

కొత్త కాంగ్రెస్‌ నేతలకు విజ్ఞప్తులు

ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగ్జీవన్‌రామ్‌కు, ప్రధానికి ఏపీ కాంగ్రెస్‌ సంఘంలోని 82మంది, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విచ్ఛిన్నకరశక్తులను ప్రోత్సహించగలదనీ, కాంగ్రెస్‌ సంఘీభావాన్ని బలహీనపరచగలదనీ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పత్రంపై సంతకాలు చేసినవారిలో ఉప ముఖ్యమంత్రి జె.వి. నరసింగారావు, మంత్రులు జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, ఇబ్రహీం అలీ అన్సారీ, రాజనరసింహ, పురుషోత్తమరెడ్డి ఇతర నేతలు బి.వి. గురుమూర్తి, కమాలొద్దీన్‌, భోజరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుని హోదాలో కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షునికి లేఖ రాశారు.

ప్రజా సమితి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెన్నారెడ్డి

1969 డిసెంబర్‌ చివరివారంలో టి.పి.ఎస్‌. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మాజీ పీసీసీ అధ్యక్షులు నూకల నరోత్తమరెడ్డి వ్యవహరించారు. ప్రజాసమితి అధ్యక్షస్థానానికి ఆఖరు రోజునాటికి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. అది దాఖలు చేసింది డా|| చెన్నారెడ్డి కావడంతో అధ్యక్షునిగా చెన్నారెడ్డి పేరును నరోత్తమరెడ్డి డిసెంబరు26 రాత్రి ప్రకటించారు.

బొంబాయిలో జరిగిన కొత్త కాంగ్రెస్‌ మహాసభ

జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన చీలిక వలన డిసెంబర్‌ నెలలో ఇరువర్గాలు తమ మహాసభలు జరుపుకున్నాయి. నిజలింగప్ప, కామరాజ్‌, నీలం సంజీవరెడ్డి, మొరార్జీదేశాయ్‌ తదితరులు అహ్మదాబాద్‌లో, ప్రధాని ఇందిర, జగ్జీవన్‌రాం, బ్రహ్మానందరెడ్డి తదితరులు బొంబాయిలో మహాసభలు జరుపుకున్నారు. బ్రహ్మానందరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాని బలపరిచిన వి.వి.గిరి గెలవడంతో బ్రహ్మానందరెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కొత్త కాంగ్రెస్‌ వైపుకు వచ్చారు. బొంబాయి సభల్లో తెలంగాణపై అనధికార తీర్మానాన్ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ సమర్పించారు. కానీ దాన్ని చర్చకు స్వీకరించలేదు. బహుశా బ్రహ్మానందరెడ్డి తమవైపుకు రావడంవల్ల ఇందిరాగాంధీ ఈ తీర్మానాన్ని బుట్టదాఖలు చేసిందేమో! 28.12.1969న మహాసభలో ఆర్థిక తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనే అవకాశం కొండా లక్ష్మణ్‌ బాపూజీకి వచ్చింది. ఆయన తన సహజ ధోరణిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ”గడువుతో ముడిపడిన సోషలిస్టు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు జరుపడంకోసం తెలంగాణ వంటి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాల”ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. ”తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా వుంచినట్లయితే దీనిపట్ల అశ్రద్ధ కొనసాగగలదని” అన్నారు. భూస్వామ్యశక్తులు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వెనుకవున్నందువల్ల ఆంధ్రప్రాంతంలో ప్రగతిశీలకమైన విధానాల అమలుకూడా తనకు సందేహమేనని బాపూజీ ఆవేదన వ్యక్తం చేశారు.

”ఏఐసీసీ సభ్యుడైన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డిని నేర నిరోధక చట్టం క్రింద ఒక కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేయడాన్నిబట్టే, తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతున్నదో తెలుసుకోవచ్చున”ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. తెలంగాణ సమస్యపై కేంద్ర నాయకత్వం గట్టి శ్రద్ధ చూపగలదని తాను ఆశిస్తున్నానంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

బొంబాయి మహాసభలో బాపూజీ ‘తెలంగాణ’ తీర్మానం:

”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ ఆదేశించాలని” కొండా లక్ష్మణ్‌ బాపూజీ బొంబాయిలో జరిగిన కొత్త కాంగ్రెస్‌ మహాసభకు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

తీర్మానంలోని అంశాలు:

”తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు, కల్పించిన రక్షణలు అమలులోకి రాలేదు. పరిపాలనలోనూ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలోనూ ఆంధ్రుల పెత్తనం, దోపిడీ ఫలితంగా తెలంగాణకు తీరని హాని వాటిల్లడమేకాక, తాము రెండవ తరగతి పౌరులుగా మారిపోయామని తెలంగాణ ప్రజలు నిజంగా భావిస్తున్నారు.

”అవకతవకలుగా ఉన్న రాష్ట్రాలు ప్రస్తుత స్వరూపానికి సహేతుకమైన ప్రాతిపదిక అంటూ ఏమీలేదు.

”పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకు 1956 సంవత్సరంలో జాతీయ నాయకులు అవలంభించిన వైఖరిని అంటిపెట్టుకోరాదు. ప్రజాభీష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యతరహా, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రజలు తమ అభీష్టాన్ని వ్యక్తం చేయడానికి నిర్ణయించవలసిన ప్రజాస్వామ్య రాజ్యాంగ పద్ధతుల గురించి మౌలికాంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా పార్టీని కోరుతున్నాము”.

ఏఐసీసీ డెలిగేట్లకు, సభ్యులందరికీ వ్రాసిన లేఖలతో తీర్మానం కాపీలను జతపరిచినారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ. తీర్మానాన్ని చర్చకు తీసుకోకపోవడం బాపూజీని, తెలంగాణ ప్రతినిధులను నిరాశకు గురిచేసింది.

ప్రధాని వైఖరిపై చెన్నారెడ్డి విమర్శ

తెలంగాణ సమస్యపై ప్రధానమంత్రి వైఖరిలో కదలికయేమీ కనబడలేదని” బొంబాయి సభలనుంచి తిరిగివచ్చిన తర్వాత డా|| చెన్నారెడ్డి అన్నారు. వి.బి. రాజు, డా. చెన్నారెడ్డి తెలంగాణ సమస్యపై ప్రధానితో జగ్జీవన్‌రాం చర్చించారు. ‘బొంబాయి సభల్లో తెలంగాణ సమస్యను విస్మరించడం దురదృష్టకరం’ అని చెన్నారెడ్డి అన్నారు.’తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోర్కెపై వెనుకంజవేయడమనే ప్రసక్తే లేదని కేంద్ర నేతలతో చెప్పాం. ఇక తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారిదేనని” చెన్నారెడ్డి విలేకరులతో అన్నారు.

జనవరి 15న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి పిలుపు

1969 డిసెంబర్‌ 28న ఓయూ విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌ అధ్యక్షతన తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. జనవరి 15న విద్యార్థులు సార్వత్రిక సమ్మె చేయాలని సమావేశం నిర్ణయించింది. 1969 జనవరి 15న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష మొదటిసారిగా జంటనగరాల్లో ప్రతిధ్వనించింది. ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి నిజాం కాలేజీ వరకు సాగిన విద్యార్థుల ఊరేగింపులో ప్రత్యేక తెలంగాణ నినాదాలు మార్మోగినవి. ఏడాది పూర్తయిన సందర్భంగా సార్వత్రిక సమ్మెకు విద్యార్థులు పిలుపునిచ్చారు.కొంతమంది విద్యార్థులు ఆ రోజు పరీక్షలు రాస్తున్నందున తమ నిర్ణయం వారికి వర్తించదని మల్లికార్జున్‌ స్పష్టం చేశారు.తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి స్వతంత్రంగా వ్యవహరిస్తూనే డా|| చెన్నారెడ్డి అధ్యక్షతనగల ప్రజాసమితితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మల్లికార్జున్‌ వెల్లడించారు. ‘తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పన్నులు, శిస్తు నిరాకరించాలని’ సమితి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

విద్యార్థి కార్యాచరణ సమితి చిత్తు నియమావళిని రూపొందించడానికి బి. పుల్లారెడ్డి కన్వీనర్‌గా ఒక ఉపసంఘాన్ని, మరో రెండు ఉపసంఘాలను నియమించుకున్నారు. విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షులుగా మల్లికార్జున్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించాలని పాత కాంగ్రెస్‌ సూచన

నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్‌ల సారధ్యంలోని పాత కాంగ్రెస్‌ ‘తెలంగాణ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు అవసరం. ప్రజా ప్రతినిధులతో వెంటనే సంప్రదింపు జరుపాలని’ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బ్రహ్మానందరెడ్డి వీరిని విడిచిపెట్టి కొత్త కాంగ్రెస్‌లో చేరడంతో గతంలో తెలంగాణను వ్యతిరేకించిన పాత కాంగ్రెస్‌ అగ్రనేతలు బహుశా తమ వైఖరిని మార్చుకోవచ్చు.

”తెలంగాణా ప్రాంతంలో ఎనిమిది నెలలపాటు జరిగిన ఆందోళనలో వేలాదిమంది అరెస్టుకాగా, అనేక అమాయక ప్రాణాలు బలయ్యాయని’ ఒక తీర్మానంలో పాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పేర్కొన్నది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అడ్‌హాక్‌ కమిటీలను పాత కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. బ్రహ్మానందరెడ్డిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ నేతలు తాము ఏర్పాటు చేసిన అడ్‌హాక్‌ కమిటీలో చేరాలని నీలం సంజీవరెడ్డి సూచించారు. అడ్‌హాక్‌ కమిటీలో చేరి తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నారు. 1958లో ప్రత్యేక కమిటీని మీరే రద్దు చేశారు కదా?’ అని విలేకరి గుర్తు చేయగా అప్పటి తెలంగాణ కమిటీ కోర్కె మేరకు ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు’ నీలం.

కేంద్రమంత్రి ఫకృద్దీన్‌తో ప్రజా సమితి చర్చలు

కేంద్ర పారిశ్రామికాభివృద్ధిశాఖమంత్రి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ మాజీ కేంద్ర డిప్యూటీ మంత్రి ముత్యాలరావు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా టి.పి.ఎస్‌. నేతలైన చెన్నారెడ్డి, జె. చొక్కారావు, వి.బి. రాజు, ఎన్‌. రామచంద్రారెడ్డిలతో చర్చలు జరిపారు. అంతకుముందు డా. చెన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ‘తనను ఆహ్వానించని పక్షంలో తాను ఫక్రుద్దీన్‌ను కలుసుకోబోన’ని అన్నారు. ఈ నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంత్రికి వివరించారు.

(చెన్నారెడ్డి-కొండా లక్ష్మణ్‌ల మధ్య తీవ్ర విభేదాలు వచ్చే సంచికలో…)

Other Updates