sai-2వానలు వాపసు రావాలి… కోతులు వాపసు పోవాలి… అనే నినాదంతోపాటు రాష్ట్రంలో 24 నుంచి 33 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని హారంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సీఎం సీేఆర్‌ లక్ష్యాన్ని అమలు చేయడమే ధ్యేయంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమం గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున సాగుతోంది. రానున్న జూలై రెండవ వారంలో మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అటవీ శాఖ సర్వం సిద్ధం చేసింది. నీడనిచ్చే, పూలు, పండ్ల మొక్కలను సిద్ధం చేస్తోంది.

హరితహారం కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా పాల్గొని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను తీసుకుంటున్నారు. గత రెండేళ్లలో దాదాపు 49 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. 2015వ సంవత్సరం జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిల్కూరులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంగా ప్రారంభమై విజవయవంతంగా, అప్రతిహాతంగా సాగుతోంది. హరితహారం కార్యక్రమం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో 16.49 కోట్ల మొక్కలను నాటగా, రెండవ ఏడాది 2016లో వర్షాలు మెరుగ్గా కురవడంతో 32.51 కోట్ల మొక్కలను నాటి చరిత్రను సృష్టించింది అటవీ శాఖ. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న నిరంతరం జిల్లా అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతోపాటు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా తెలంగాణకు హరితహారం అనే కొత్త పథకానికి సీఎం సీేఆర్‌ అంకురార్పణ చేశారు. 2015లో ప్రారంభించి నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పాన్ని తీసుకున్నారు. అందులో 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, 100 కోట్ల మొక్కలను డీగ్రేడ్‌ అయిన అటవీ ప్రాంతంలో, మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో నాటాలని ప్రణాళికను రచించారు. ప్రభుత్వ పరంగానే నర్సరీలలో మొక్కలను సిద్ధం చేస్తున్నామని, అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు ఇతర శాఖల ద్వారా 4,213 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. 120 కోట్ల మొక్కలలో ప్రతి ఏడాది 40 కోట్ల చొప్పున మొక్కలను నాటాలని ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 40 లక్షల మొక్కలను, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేశారు.

sai4హరితహారం
ప్రతి ఒక్కరీ బాధ్యత

అటవీ శాఖ మంత్రి జోగు రామన్న


తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడం ప్రతి పౌరుడీ బాధ్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారం ద్వారా కోతులను తిరిగి అడవిలోకి పంపడం, వానలను తిరిగి రప్పించడం, తెలంగాణలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి సీేఆర్‌ మానసపుత్రిక అని, ఇది ప్రపంచంలో అతి పెద్ద మూడవ ప్రయత్నమని ఆయన అన్నారు. రెండేళ్లలో హరితహారం కార్యక్రమం ద్వారా దాదాపు 49 కోట్ల మొక్కలను నాటామని, ప్రస్తుత ఏడాదిలో 40 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించి, వాటి అమలుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విస్తృతంగా మొక్కలు నాటడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించేందుకు గత ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది.. కనీసం 50 మొక్కలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటే వ్యక్తులకు, సంస్థలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మొక్కకు రూ. 5 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమాన్ని, మొక్కల సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను టాేయించి ప్రోత్సాహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెట్లు ఉంటేనే వానలు పడుతాయని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్న అవగాహన ప్రజలలో పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మొక్కలు నాటే పౌరులకు, యువజన, ప్రజా సంఘాలను, ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులకు ప్రోత్సాహకాలను ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అవార్డుల ద్వారా మొక్కలు నాటే వారికి పోత్సహించడమే కాకుండా, లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

Other Updates