యాసా వెంకటేశ్వర్లు


salonఅతనో నిరుపేద. ఆపై మూగ, చెవిటి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో 35 ఏళ్లుగా తనకు ఉన్న ఓ చిన్న డబ్బాలో కుర్చీ.. దానికి ఎదురుగా అద్దం ఏర్పాటు చేసుకొని కుటుంబ వృత్తి అయిన బార్బర్‌గా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ ప్రభుత్వ నిధుల నుంచి రూ. లక్ష వెచ్చించి కార్పొరేట్‌ తీరులో మోడ్రన్‌ సెలూన్‌ ఏర్పాటు చేయించారు. దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి దశ తిరిగింది. మూగ అయినందున ఏదీ బయటకు చెప్పలేనప్పటికీ ఇప్పుడు అతని సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

salon-2సూర్యాపేట మండల పరిధిలోని యండ్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ దాదాపు గంటన్నర పాటు ఉన్నారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న చిన్న డబ్బాలో 50 ఏళ్ల శివకుమార్‌ తరతరాలుగా తన కుటుంబీకులు చేస్తున్న క్షౌర వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఆయనకు మాటలు రావు. చెవులు వినపడవు అని, గ్రామానికి చెందిన వారు కలెక్టర్‌కు వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ అక్కడకు వెళ్లి శివకుమార్‌ పై ఆరా తీయగా కడు నిరుపేద అని… ఆయనకు ఇద్దరు కుమారులకుగాను పెద్ద కుమారుడు సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివి వృత్తిని కూడా కొనసాగిస్తుండగా చిన్న కుమారుడు తండ్రితో పాటు గ్రామంలోనే ఉంటున్నాడని ఎంపిడివో నాగిరెడ్డి, పంచాయితీ కార్యదర్శి వెంకట్రామయ్య కలెక్టర్‌కు వివరించారు. కాగా శివకుమార్‌ తనకు ఉన్నది ఏంటి.. లేనిది ఏంటి.. ఏమైనా కావాలనే కోరివున్నా చెప్పుకోలేని దుస్ధితి. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కలెక్టర్‌ నిధుల నుండి రూ. లక్ష మంజూరు చేశారు. వెంటనే పాత డబ్బా స్ధలంలో అత్యంత ఆధునాతన పరికరాలతో కూడిన మోడ్రన్‌ సెలూన్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో కేవలం శివకుమార్‌కు మాత్రమే లబ్ధి జరుగకుండా గ్రామస్తులం దరికీ అది ఉపయోగపడనుంది. ఆయన సొంతంగా ఎలాంటి నిధులు వెచ్చించకుండానే ఆధునాతన సెలూన్‌ సొంతమైనందున ఇక మీదట ఆయన చేసే కటింగ్‌, షేవింగులకు అదనంగా చార్జి చేసే అవకాశమే లేదు.

గ్రామానికి మంచి సెలూన్‌ రావడంతో కటింగ్‌, షేవింగ్‌లకు సూర్యాపేటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయలు వెచ్చించి బార్బర్‌ షాపు ఏర్పాటు చేయించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ను అభినందిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ సెలూన్‌ ఫోటోలను కలెక్టర్లందరికీ ఫార్వర్డ్‌ చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇదేపద్ధతిలో 20 వేల ఆధునిక సెలూన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

మే 19న జిల్లా కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ స్వయంగా ఈ సెలూన్‌ను సందర్శించి అక్కడే షేవించ్‌ చేయించుకొని ప్రారంభించారు.

Other Updates