projectsనాబార్డు రుణం 7వేల కోట్లు

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సెప్టెంబరు 6న కేంద్ర మంత్రులు ఉమాభారతి, నిర్మలా సీతారామన్‌, గడ్కరీ, రాధామోహన్‌లతో సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులు, మార్కెటింగ్‌, వ్యవసాయ, పరిశ్రమల శాఖలకు చెందిన పలు పెండింగ్‌ అంశాలపై చర్చించారు. వాటికి సంబంధించిన వినతి పత్రాలను ఆయా మంత్రులకు సమర్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటి వాడకంపై ఆంధ్రప్రదేశ్‌ నివేదికలకు, వాస్తవానికి పొంతన కుదరడం లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి హరీష్‌రావు తెలిపారు. ప్రాజెక్టుల ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో లెక్కలు పక్కాగా తేలవలసి ఉందన్నారు. టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేసేంత వరకు కృష్ణా ప్రాజెక్టుల దగ్గర ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అధికారులతో సంయుక్త అజమాయిషీ కమిటీని నియమించాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వారీగా కృష్ణాలో నీటి వాటాను బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఖరారు చేయవలసి వుందన్నారు. గత రెండేళ్ళుగా తాత్కాలిక వర్కింగ్‌ అరేంజ్‌ మెంటు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నాయని మంత్రి హరీష్‌ రావు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు, కృష్ణా, గోదావరిలలో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటా, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ అడ్డగోలు నీటి వాడకం, కెఆర్‌ ఎంబి సమర్థవంతంగా పనిచేయకపోవడం వంటి అంశాలపై అపెక్స్‌ బాడీలో చర్చించాలని మంత్రి హరీష్‌ కేంద్రాన్ని కోరారు.

తెలంగాణలోని దేవాదుల సహా 11 ఆన్‌ గోయింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కరుణించింది.ఈ ప్రాజెక్టులకు 7 వేల కోట్ల నాబార్డు రుణ సహాయానికి సంబంధించి ఢిల్లీలో సెప్టెంబరు 6న ఎంవోయూ కుదిరింది.

కేంద్ర ప్రభుత్వ సహకారం పట్ల మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించక పోవడంతో ప్రాజెక్టులు పూర్తికావడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతుందని మంత్రి హరీష్‌ రావు అంటున్నారు.

కేంద్రం రాష్ట్రాలకు నాబార్డుతో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అంగీకారాన్ని తెలియజేయడం శుభసూచకమని అన్నారు.

అంతే కాకుండా ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత కాలువల నిర్మాణం సాగుకు నీళ్లందించే లక్ష్యాన్ని చేరేంత వరకు నిధుల మద్దతుకు సహకరించడం కేటాయింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవడాన్ని చరిత్రాత్మకమైన నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రాలు 15 సంవత్సరాల లోపు తిరిగి నాబార్డుకు రుణాలను చెల్లించాల్సి వుంటుంది. ఈ ప్రణాళికలో తెలంగాణ నుంచి 11 ప్రధాన ప్రాజెక్టులకు దాదాపు ఏడు వేల కోట్ల సహాయం లభిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందనున్నది. దేశంలోని ముఖ్యమైన ప్రాజెక్టుల ఎంపికకు గతంలో చత్తీస్‌గఢ్‌ నీటి పారుదలశాఖ మంత్రి నేతత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు సభ్యులుగా కొనసాగుతున్నారు.

రాబోయే నాలుగేళ్లలో పెండింగులోవున్న 99 ప్రాజెక్టుల నిర్మాణ పనుల కోసం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నాబార్డుతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఢిల్లీలోని ఇండియా హాబిటేట్‌ సెంటరులో జరిగిన ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నేషనల్‌ వాటర్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ, నాబార్డుతో ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి.

పలు రాష్ట్రాల్లోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేసే చరిత్రాత్మక నిర్ణయానికి ముందడుగు పడింది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో 2020లోపు 99 ప్రాజెక్టులను నిర్మించడానికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ, నాబార్డుతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాబోయే నాలుగేళ్లలో 77, 595 కోట్ల ఖర్చుతో కేంద్రం 60శాతం రాష్ట్ర సర్కారులు 40శాతం నిధులతో ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పిఎంకెఎస్‌వై ప్రత్యేక కార్యదర్శి అమర్‌ జిత్‌ సింగ్‌, శశి శేఖర్‌ జలవనరుల కార్యదర్శి, నాబార్డు ఛైర్మన్‌, బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ చత్తీస్‌గఢ్‌ జల వనరుల మంత్రి, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా, కేంద్ర జలవనరుల సహాయ మంత్రి బలియాన్‌ పాల్గొన్నారు. కార్యక్రమం రాబోయే నాలుగేళ్లలో విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఉమాభారతి అన్నారు.

దేశ వ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, రెండో దశ 2017-2018లో 31 ప్రాజెక్టులు, మూడో దశ డిసెంబర్‌ 2019లోపు 45 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు 77595 కోట్లు ఖర్చు చేయనున్నారు.

నిర్ధేశించుకున్న ఈ లక్ష్యాన్ని నాలుగేళ్లలో చేరుకుంటే దేశ వ్యాప్తంగా 76లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. మొత్తం 99 ప్రాజెక్టులకు అయ్యే 77595 కోట్ల ఖర్చులో ప్రాజెక్టు నిర్మాణం కోసం 48546కోట్లు ఖర్చు చేస్తుండగా నిర్మాణం పూర్తయిన తర్వాత కమాండ్‌ ఏరియా డెవలప్‌ మెంట్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌ మెంట్‌ కోసం అంటే కాలువల ఏర్పాటు, సాగుకు నీరందించే వరకు కావాల్సిన నిధులు 31342 కోట్లు కేటాయించనున్నారు. కాగా నాబార్డుతో ఒప్పందం తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి హరీశ్‌ రావు. రాష్ట్రంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పారు. మొత్తం 11 ప్రాజెక్టుల కోసం 7 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని, రెండు వేల కోట్లు గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కోరామన్నారు. సెప్టెంబర్‌ చివరికల్లా నిధులు విడుదల చేస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

గుడిమల్కాపూర్‌, వంటిమామిడి, బోయిన్‌పల్లి, వరంగల్‌ కూరగాయలు మార్కెట్లు, షాద్‌ నగర్‌ మామిడి మార్కెట్లను ఆధునీకరించడంతో పాటు 5 కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసేందుకు 65 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్‌ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారి నిర్వహణ కోసం నిధులు కేటాయించాలని మంత్రి హరీష్‌రావు కేంద్రమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

పెసరపప్పును నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌.సి.ఐ, నాఫిడ్‌ వంటి సంస్థలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌కు మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.

ఒప్పందం లక్ష్యాలు

రాబోయే నాలుగేళ్లలో 77, 595 కోట్ల ఖర్చుతో కేంద్రం 60శాతం రాష్ట్ర సర్కారులు 40శాతం నిధులతో ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాయి.

దేశ వ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, రెండో దశ 2017-18లో 31 ప్రాజెక్టులు, మూడో దశ డిసెంబర్‌ 2019లోపు 45 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది.

ఈ ప్రణాళికలో తెలంగాణ నుంచి 11 ప్రధాన ప్రాజెక్టులకు దాదాపు ఏడు వేల కోట్ల సహాయం లభిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందనున్నది.

Other Updates