తెలంగాణలోనే తొలి బహిరంగ బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్‌, అధికార యంత్రాంగాన్ని మంత్రి కె.టి. రామారావు అభినందించారు. స్వచ్ఛ జిల్లాగా సిరిసిల్లా రాష్ట్రానికి అదర్శంగా నిలుస్తుందన్న మంత్రి, ఇందుకు సహకరించి నడిచిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌ పర్యటనలో ఉన్న మంత్రి అక్కడి నుండి జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. సూక్ష్మస్ధాయి ప్రణాళిక ((MICRO LEVEL PLANNING), ప్రజల భాగసామ్యంతో ఇది సాధ్యం అయిందని తెలిపారు.

గత ఎడాదిలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాను బహిరంగ బహిర్భూమి రహిత నియోజకవర్గంగా మార్చిన మంత్రి, ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను సైతం బహిరంగ బహిర్బూమి రహిత జిల్లాగా మార్చడంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ సైతం తన నియోజక వర్గాన్ని బహిరంగ బహిర్భూమి రహితంగా మార్చడంలో జిల్లా యంత్రాంగంతో కలిసి కృషి చేశారు. మంత్రి కె.టి. రామారావు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా సూమారు 6 కోట్ల రూపాయాలను ప్రత్యేక నజరానాగా నియోజకవర్గ గ్రామాలకోసం అందించారు.

సిరిసిల్లా కొత్త జిల్లాగా ఎర్పడిన సందర్భంగా రెండు మండలాలు బోయినపల్లి (చొప్పదండి) ఇల్లంత కుంట( మానకొండూరు)లు జిల్లాలో చేరడంతో సమారు 22,000 మరుగుదొడ్లు కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా మిగిలిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు పూర్తి స్ధాయిలో కట్టడం ద్వారా సిరిసిల్లా జిల్లా ఈ ఘనతను సాధించిన తొలి జిల్లాగా రికార్డ్‌ సృష్టించింది.

ఇందుకోసం మంత్రి మార్గ దర్శనంతో ప్రత్యేకమైన వ్యూహాన్ని అధికారులు అనుసరించారు. ముందుగా ఇంటింటి సమీకృత సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వే ద్వారా అర్హులైన వారందరికి స్వచ్చభారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్లను నిర్మించారు. గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని, సమష్టిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరింగింది. గ్రామాల్లోని ట్రాక్టర్లు, అటోలు, డిసియంలు, లారీల యజమానులు, వాహనదారులు, ఇసుక, ఇటుక, ఇతర సామగ్రి రవాణాను ఉచితంగా చేశారు. సిమెంట్‌తోపాటు మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరం అయిన పైపులు, డోర్లను హోల్‌ సేల్‌ ధరలకు కొనుగోలు చేయడంతో ఖర్చులను కొంత వరకు తగ్గించగలిగారు. కొన్ని చోట్ల 24 గంటల్లోనే ఏకబిగిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి వందల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం అవగాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని కూడా చేపట్టారు. దీంతో కొన్ని గ్రామాల్లో బహిరంగ బహిర్భూమికి వెళ్లే వాళ్లకు జరిమాన వేస్తామంటూ బ్యానర్లు, డప్పులతో ప్రచారం సైతం చేశారు. దీంతో చాలా వరకు ప్రజలు మరుగుదొడ్ల నిర్మించుకోవడంతోపాటు వాటిని ఉపయోగించడం ప్రారంభించారు.

Other Updates