maga

ప్రపంచ ప్రసిద్ధ జానపద చిత్రకారుడు జామినీరాయ్‌ని మించిన సృజనాత్మకశక్తిగల కాపు రాజయ్యకు శిష్యుడై చిత్రకళారంగంలో పాదంమోపి, బాతిక్‌ హస్తకళలో ‘భేష్‌’ అనిపించుకుని బాతిక్‌ బాలయ్యగా స్థిరపడినవాడు- యాసాల బాలయ్య.

సిద్దిపేట సమీపంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన యాసాల దుర్గయ్య- విశాలాక్షి దంపతులకు 1939లో జన్మించిన బాలయ్య చిన్ననాటినుంచే చిత్రకళపట్ల ఆకర్షితుడయ్యాడు. పొగచూరిన వంటింట్లో చీపురు పుల్లతో తీరొక్క చిత్రాలు వేస్తూ చిత్ర కళాభిరుచిని ఇనుమడింపచేసుకున్నాడు. ”ఇవేమీ దయ్యాల బొమ్మలు వేస్తున్నావం”టూ పెద్దలు నిరుత్సాహపరిచినా, చిత్రకళను విడువకుండా సాధనచేశాడు.

చదువుకోసం సిద్ధిపేట వచ్చాక ఒకవంక చదువు కొనసాగిస్తూనే, మరోవంక-అక్కడి ప్రముఖ చిత్రకారుడు కె. రాజయ్య చిత్రకళా నైపుణ్యానికి ఆకర్షితుడై, ఆయనవద్ద ఈ కళలోని మెళకువలు నేర్చుకున్నాడు. డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ పరీక్షలకు ఆయన చెంత తర్ఫీదు పొంది ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత సుప్రసిద్ధ చిత్రకారుడు-విద్యాభూషణ్‌వద్ద కొంతకాలం శిక్షణ పొందాడు. తనదైన శైలిలో వందలాది చిత్రాలు గీస్తూ పోయాడు.

ఈలోగా ఎం.ఏ. బి.ఇడి పూర్తి చేసి ఉపాధ్యాయుడై, ప్రధానోపాధ్యాయుడై సిద్ధిపేట, మెదక్‌, సదాశివపేట, నారాయణరావుపేట మొదలగు పలుచోట్ల పనిచేసినా, ప్రతిరోజూ మూడు నాలుగు గంటలు చిత్రకళకు కేటాయించి వృత్తిని, ప్రవృత్తిని జమిలిగా కొనసాగించాడు.

ఇదిలా ఉండగా సుప్రసిద్ధ చిత్రకారుడు డా. లక్ష్మాగౌడ్‌ వద్ద బాతిక్‌కళ నేర్చుకుని, తనకంటూ గుర్తింపుకోసం అహరహం అందులోనే శ్రమించాడు. వందలు, వేల సంఖ్యలో బాతిక్‌ చిత్రాలువేసి తిరుగులేని బాతిక్‌ చిత్రకారుడుగా పేరు గడించాడు.

పల్లెపట్టులలోని ప్రకృతి, పండుగలు-పబ్బాలు, పొలాలు, వరినాట్లు, కోతలు, కోలాటం, కోడి పందాలు, మేకలు, చేపలు పట్టేవారు, నీలాటి రేవులు, పల్లెపడుచులు, బింబ ప్రతిబింబాలు ఇత్యాది సమస్త గ్రామీణ జీవితానికి అద్దంపట్టే బాతిక్‌ చిత్రాల రూపకల్పన చేశారు. గణేశుడు, వెంకటేశ్వరస్వామి, రామప్ప, నాగినులు, కోణార్క్‌ శిల్పాలు మొదలగువెన్నో తన పద్ధతిలో బాతిక్‌ బాణీలో వేసి పేరు పొందాడు. వీరి చిత్రాలు పలు వార, మాసపత్రికలను అలంకరించాయి. కొన్ని చిత్రాలు గ్రీటింగ్‌ కార్డులుగా, క్యాలెండర్లుగానూ రూపొందాయి.

నిజానికి ఈ బాతిక్‌ చిత్రకళ ఎంతో ప్రాచీనమైనది. ఈ కళ ఇండోనేషియా, మలేషియా దేశాలలో బహుళ జనాదరణ పొందింది. ఇటీవలి కాలంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచుకుని మనం కూడా ఈ కళకు ప్రాధాన్యమిస్తున్నాము. మన దేశంలో దీనికి హస్తకళగా గుర్తింపునిచ్చాడు.

ప్రస్తుతం అమెరికా, ఇంగ్లాండ్‌, రష్యా తదితర యూరపు దేశాలలోను ఈ కళకు ఎంతో ఆదరణ ఉంది.సాధారణంగా నూలు వస్త్రం, కొన్ని సందర్భాలలో పట్టు వస్త్రంపై కూడా బాతిక్‌ చిత్రం వేస్తారు. అయితే నిత్య జీవితంలో ధరించే దుస్తులు, ముఖ్యంగా చీరలు, లంగాలు, ఓణీలు, లేదా కర్టెన్లు, టి.వి. కవర్లు, టేబుల్‌పై వేసే గుడ్డలు, దిండు గలీబులు, దుప్పట్లు మొదలగు గృహోపకరణాలుగా అలంకారయుతమైన ఈ బాతిక్‌ చిత్రాల వస్త్రాలు ఉపయోగిస్తారు.

తేనెటీగల మైనం, ప్యారాఫిన్‌ మైనం సమపాళ్ళలో కలిపి వేడిచేసి మరిగిస్తారు. సన్నని వెదురు పుల్లకు రెండు ఇనుపచువ్వలు ఒక అంగుళం బయటకు ఉండేట్టు బిగించి కండె ఆకారంలో దారం చుడతారు. మరుగుతున్న మైనంలో ఆ కలం ముంచి గుడ్డపై మొదలే వేసుకున్న చిత్రం గీతలపై గీస్తారు. మైనం దారం, ఇనుపచువ్వల ద్వారా స్కెచ్‌ గీతలపై కారి, గీతలను మైనంతో కప్పివేస్తుంది. అప్పుడు దాన్ని కావాలనుకున్న రంగులో ముంచితే, బట్ట అంతా రంగు అద్దుకుని, స్కెచ్‌ గీతలు మాత్రం మైనంవల్ల తెల్లగా మిగిలిపోతాయి. అక్కడక్కడ మైనం పగుళ్ళు ఏర్పడి రంగులోనికెళ్ళి ఏర్పడే గీతలు కళాత్మకంగా మిగులుతాయి. ఎన్ని రంగులు కావాలనుకుంటే అన్ని రంగుల్లో అన్నిసార్లు ముంచవచ్చు. కానీ సాధారణంగా పసుపు, ఎరుపు, నీలం ప్రాథమిక రంగులే బాతిక్‌ చిత్రకళలో వాడతారు. ఎక్కడ ఏ రంగు కావాలనుకుంటే, మరో రంగులో ముంచేముందు కావాలనుకున్న రంగుపై మైనంతో కప్పుతారు.

ఇలాంటి విశిష్టకళను పుణికిపుచ్చుకున్న బాలయ్య 1972నుంచి దాదాపు డజను పర్యాయాలు దేశవిదేశాల్లో సమష్టి చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్నారు. 1975నుంచి వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలకు శ్రీకారం చుట్టి హైదరాబాద్‌, న్యూఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాల్లో వాటిని ఏర్పాటు చేసి కళాభిమానుల ప్రశంసలు పొందాడు. ఈ వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు దాదాపు నలభై పర్యాయాలు నిర్వహించగా అందులో దాదాపు డజనుసార్లు అమెరికాలోని పలు నగరాల్లో ఏర్పాటు చేయడం విశేషం.

కేవలం చిత్రకారుడుగానే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డును 1994లోనే అప్పటి రాష్ట్రపతి డా|| శంకర్‌ దయాళ్‌శర్మ నుంచి స్వీకరించారు. చిత్రకళా ప్రవీణ, ”శ్రమశక్తి”, ”వాసవి నవరత్న”, ”ఆంధ్రప్రదేశ్‌ కళానీరాజనం” పురస్కారాలను పొందాడు. వీరి బాతిక్‌ చిత్రాలకు హస్తకళల అభివృద్ధి సంస్థలో ఎంతో డిమాండ్‌ ఉంది.

వీరు రూపొందించిన వర్ణ చిత్రానికి 1963లో గూడూరు లలితకళా మందిర్‌ అవార్డు, 1965లో తెనాలి ఆంధ్ర శిల్పకళా పరిషత్‌ అవార్డు, 1966లో భీమవరం అంకాల కళా అకాడమీ అవార్డు, 1974, 1977, 1983, 1990, 1995 సంవత్సరాల్లో సిద్ధిపేట లలితకళా సమితి అవార్డులు పొందారు. 1997, 1998లో అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్‌ అవార్డులు, 1977లోనే బాపట్ల లలితకళా కేంద్ర అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, 2001లో హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ రజిత పతకం, 2002లో అఖిలభారత లలితకళలు, హస్తకళల సొసైటీ ప్రశంసాపత్రం పొందారు. 2003లో సిద్ధిపేట లలితకళా సమితి, అఖిల భారత లలిత కళలు, హస్తకళల సొసైటీలు పరిణత కళా కారుడుగా సత్కరించాయి. ఇంకా ఆయన అనేక చిత్రకళల పోటీలలో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. లేపాక్షి, రామప్ప, కోణార్క్‌, మణిపాల్‌, హైదరాబాద్‌లలో పలు సంస్థలు నిర్వహించిన చిత్రకళా శిబిరాలలో పాల్గొని అపురూపమైన చిత్రాలు గీశారు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ మ్యూజియం, కేంద్ర లలితకళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ, సాలార్‌జంగ్‌ మ్యూజి యం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మ్యూజి యం, పలువురు కళా భిమానులు వీరి చిత్రాలను సేకరించారు. తనకు ఇంత పేరు తెచ్చిన బాతిక్‌ కళపై బాలయ్య ప్రామాణికమైన గ్రంథాన్ని ఇటీవల వెలువరించారు.

 

టి. ఉడయవర్లు

Other Updates