bonalu– ఆచార్య కసిరెడ్డి

ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న
పుణ్యలోకమునకు బోవునతడు…

ఇది యోగివేమన మాట. భగవంతునికి అర్పణ చేసింది యేదైనా, ప్రసాదంగా అందరికీ పంచుతారు. అంటే అందరిలోని భగవంతునికే ఇస్తారన్నమాట. ఇది ప్రేమతో – భక్తితో చేసే పని.

తెలంగాణలోనే ప్రత్యేకంగా నిర్వహించుకొనే బోనాల పండుగ పరమార్థం కూడా ఇదే. అయితే ఇందులోని సంప్రదాయ బద్ధమైన కర్మకాండలో (రిచ్యువల్‌లో) దేవీ ఆరాధనం, ఘటం ఊరేగింపు, బోనాల ఊరేగింపు, సాక సమర్పణ, తొట్టెళ్ల శోభాయాత్ర, పోతురాజుల వీరంగాలు, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మ వారి ఎదురుగానే ‘పడి’ (బలిముద్ద, బోనం, అన్నం) సమర్పణ, రంగమెక్కడం – భవిష్యవాణి చెప్పడం, గావు పట్టడం, అనేక ప్రదర్శనలు నిర్వహించడం, అమ్మవారిని మూలస్థానానికి సాగనంపడంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. అయితే రంగమెక్కడం – భవిష్యవాణి చెప్పడం, గావుపట్టడం వంటివి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వంటి ఒకటి రెండు దేవాలయాల్లోనే ఉంటాయి. మిగతా కార్యక్రమాలన్నీ శ్రద్ధా భక్తులతో అంతటా నిర్వహిస్తారు.

ప్రకృతి ఆరాధనం
బోనాల పండుగ అచ్చమైన ప్రకృతి దేవతారాధనం. కొండల్లో – కోనల్లో మానవుడు జీవించిన కాలంలో తనకు ప్రకృతి ఇచ్చిన పత్రి (పత్రం – ఆకు), పువ్వు, కొమ్మ (శాఖ), పసుపు, కుంకుమ, నీళ్లు, ధాన్యం గింజలు, కూరగాయలు, ఏ నైరూప్య శిలనో (రూపంలేని రాయి లేదా దారువు అంటే కట్టెనో) దేవునికి, దేవతకు ప్రతీకగా చేసికొని సమర్పించాడు. అప్పటి నుండి ప్రారంభమైన సమర్పణమే బోనాల వరకు వచ్చింది. బోనాలల్లో కూడా ఈ సమర్పణంతో పాటు తాము తినేవి, తాగేవి (శాకాహారం, మాంసాహారం, మద్యం, పానకం అన్నీ) నైవేద్యంగా సమర్పించే ఆచారం వచ్చింది. తానేది ఇష్టంగా తింటాడో అదే భగవంతునికి సమర్పిస్తాడు.

ప్రకృతి మహాశక్తివంతమైంది. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ ప్రకృతి వికాసానికి దోహదం చేస్తాయి. ఇందులో ఏది విజృంభించినా భూతాలు (ప్రాణాలు) తట్టుకోవడం కష్టం. వీటివల్లనే చెట్టూ – చేమా, రాయీ – రప్పా, మట్టి – గట్టూ పుట్టాయనే విశ్వాసం మానవుల్లో ఏర్పడిన కాలం నుండి ఈ ఆరాధన ప్రారంభమయింది. వీటిమీద అధ్యయనం చేసిన జానపద – నరశాస్త్ర విజ్ఞాన వేత్తలు (Folkorists & Anthoropologist) దీనినే మాత్రారాధనం (Mother goddesses Worship) అన్నారు. ఆ మాత్రారాధనం తెలంగాణలో తొలి దశలో పల్లెల్లో ఎక్కువగా కనిపించిన కారణంగా గ్రామ దేవతారాధనం అన్నారు. అందుకే బోనాల పండుగను కూడా గ్రామదేవతారాధనం క్రిందనే పరిగణించారు.

గ్రామదేవతలు
నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా నవవిధ దుర్గలను (ఆదిశక్తి అవతారాలు: మహామా, మహాలక్ష్మీ, మహా సరస్వతి, నంద (యోగమాయ) రక్తదంతి, శాకంభరి, దుర్గ, మాతంగి, భ్రామరి) పట్టణాల్లో పూజిస్తున్నది. అయితే పట్టణాల్లో, నగరాల్లో గ్రామాల్లోనూ ఈ నవవిధ దుర్గలతో పాటు ఈక్రింది గ్రామ దేవతలనందరినీ ఆరాధిస్తున్నారు.

ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మాంకాళమ్మ, సమ్మక్క, సారలమ్మ, కొల్లాపురమ్మ, మౌలమ్మ, పిన్నమ్మ, (పిందేవర)… ఇలా ఎందరో గ్రామదేవతలను పూజిస్తున్నారు. వీరందరికీ గుళ్లున్నాయి. ఊరేగింపుల సందర్భంగా సేవలోఉపయోగించడానికి చిన్నవిగ్రహాలూ (ఉత్సవ విగ్రహాలు) ఉంటాయి. గ్రామదేవతలే అనండి లేదా, ఆ ఆదిశక్తి అవతారమనండీ; లక్ష్మీపార్వతీ సరస్వతుల సమాహార స్వరూపే అనండి, బతుకమ్మకు మాత్రం విగ్రహం లేదు. తొమ్మదిరోజుల ఆటాపాటల్లోనే బతుకమ్మ వైభవం తెలుస్తుంది. పై గ్రామ దేవతలకున్నట్టుగా బతుకమ్మకు బోనాలూ లేవు; కానీ రోజు రకరకాల ప్రసాదాలుంటాయి.

ఆషాఢ బోనాలు: అర్థాలు – పరమార్థాలు
తెలంగాణలో జరుపుకునే పండుగలు సర్వసామాన్యమైనవే అయినా గ్రామీణవాతావరణం, జానపద సంస్కృతి నిండుగా కనిపించే పండుగల్లోమొదటిది బతుకమ్మ, రెండోది బోనాల ఉత్సవం. బోనం, బోనాలు, బోనకాడు, బోనకత్తె, బోనాము అనే పదాలన్నిటికీ అన్నమనీ, అన్నం (వంట) చేసేవారనీ, వంటపాత్రనీ అర్థాలున్నాయి. భుక్తి, తినుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.

భోజనం పదమే బోనంగా మారింది. ఆ దేవత మహంకాళి, పెద్దమ్మ, మైసమ్మ ఎవరైనా కాని, ఆ తల్లి దగ్గరికి అన్నం ప్రసాదంగా తీసుకుని వెళ్లడాన్నే బోనం అంటారు. బోనం భువన శబ్ద వికృతి కూడా! అలనాడు ఆది శక్తి భువనభారం మోసింది. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ ఇప్పుడు మోస్తున్నది. బోనం పైన ఉన్న దీపం సూర్యుడు. బోనం కుండకు రంధ్రాలు చేసి లోనపెట్టిన దీపం చైతన్య స్వరూపుడైన పరమాత్మ. అదే అంతర్యామి. అంతర్యామి వల్లనే ఈ చైతన్యం; ఈ వెలుగు.

బోనం కుండలోని అన్నం (ప్రసాదం) అమ్మవారికి సమర్పణం. ఆ ప్రసాదం లేదా ఆ అన్నం ఒక దగ్గర కుప్పపోయడమే పడి. ఈ పడి ప్రసాదంగా – మహా ప్రసాదంగా పంచుతారు. కొన్నిచోట్ల ఈ బోనాన్ని (బలి అన్నాన్ని) వ్యవసాయ క్షేత్రాల్లో వెదజల్లుతారు. బోనం సమర్పించిన వారి కోరికలు తీరుతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. దీనికి ఉదాహరణగా హంసవింశతిలోని ఓపద్య పాదం

”ఆగంగకున్‌, వెలయన్‌ వేటలు
బోనముల్‌ సిరులు గావించెన్‌ సుతోత్పత్తికై” (హంస. 2.91)

కొడుకు పుట్టాలని గంగమ్మకు బోనాలు సమర్పించారు. గంగానదికి కావచ్చు; గంగమ్మ విగ్రహానికి కావచ్చు. బోనం కుండ; బోనం అన్నం; బోనం భువనానికి చిహ్నం. బోనం స్త్రీ మోయడం శక్తిప్రదర్శనం. శక్తి ప్రదర్శనమే శాక్తేయం.

బోనం తయ్యారీ: పండుగ
మన రాష్ట్రంలో ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దేశంలో ఒక్క తెలంగాణాలోనే ఈ ఉత్సవాలున్నాయి. అయితే పచ్చికుండ నెత్తిన పెట్టుకుని చేసే ‘కరగ’ నృత్యం కోస్తాంధ్రలోనూ, రాయలసీమలోనూ కొన్ని చోట్ల కనిపిస్తుంది. పాండవుల స్వర్గారోహణ సందర్భంగా మూర్ఛపోయిన ద్రౌపది మేల్కొని పచ్చిమట్టికుండ నెత్తిన పెట్టుకొన్న సంఘటన ఆధారంగానే కరగ (గరగ) నృత్యం చేస్తారని చెబుతారు. తెలంగాణలోని జంటనగరాలలో ఆషాఢ మాసం తొలి మలి ఆదివారాలు, వీలుగాకుంటే ఆ తర్వాతి ఆదివారాలు కూడా బోనాల శోభాయాత్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో శ్రావణ మాసంలో కూడా బోనాల ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఇంట్లో బోనం కుండ సంసిద్ధం చేయడానికి ముందే, మొదట కుమ్మరిని తయారు చేయమంటారు. కుమ్మరి పచ్చికుండకు రంధ్రాలు చేసిన తర్వాతనే కాలుస్తాడు. అవసరమున్నవారు తీసుకుని వెడతారు.

కుండకు పసుపు పూస్తారు. కుంకుమబొట్లు పెడతారు. కొందరు మొత్తం పసుపు మాత్రమే పూస్తారు. కుండమీద ముంత పెడతారు. ముంత మీద కంచుడుంటుంది. ఈ ముంత కంచుళ్ల క్రింద నుండి బయటకు వ్రేలాడే విధంగా వేప రెమ్మలు (రిల్లెలు రిల్లెలు) అమరుస్తారు. బోనం మోసుకొని వెళ్లే మహిళ కోరిక తీరితే బోనం మోస్తానని మొక్కుకుంటుంది. పిల్లలకు అమ్మవారు పోయగూడదనీ, పోస్తే తగ్గాలని కూడా మొక్కు కుంటారు. కొందరు వెయ్యికండ్ల (రంధ్రాల) బోనం మోస్తానని మొక్కుకుంటారు.

రాను రాను అక్కడక్కడ సంప్రదాయంలో మార్పు వచ్చింది. కుమ్మరుల కుండలు దొరుకని కారణంగానో, అక్కడక్కడ కుండలు నెత్తిపైననే పగిలిగిన కారణంగానో, ఇనుప – రాగి – స్టీల్‌బిందెలు, ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. మొక్కులు అలంకరణ యథాతథంగానే ఉంటుంది.

ఒక్కొక్కరుగా ఇంటినుండి బయలుదేరి వచ్చినా అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చేవరకు వందలాదిగా సంఖ్యపెరుగుతుంది. రంధ్రాలున్న కుండలో దీపముండడం, ఆ కుండ మీది ముంతలోగాని మరోకుండలోగానీ అన్నముండడం పరిపాటి. తెచ్చిన బోనాన్ని, అన్నాన్ని అమ్మవారికి గుడి ముందు సమర్పించి, కొంత మిగుల్చుకొని ఇంటికి తీసుకొనిపోతారు. కొందరు కండ్ల (రంద్రాల) బోనాలను గుడిదగ్గరే సమర్పించి వెడతారు.

కొందరు తొట్టెళ్ల ఊరేగింపులతో వస్తారు. ఈ తొట్టెళ్లను ప్రధానంగా పిల్లలు కానివారు మాత్రమే తెచ్చి మొక్కుతీర్చు కుంటారు. తొట్టెళ్లను గుడికి గానీ, గుడి పక్షాన చెట్టుకు గానీ, ఓ గుంజకు గానీ, రాతి స్తంభానికి గానీ కట్టి దండంపెట్టి వెళ్లి పోతారు.

హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాలలో అమ్మవారి దేవాలయాలు దాదాపు మూడువందలుంటాయి. ఇందులో సికింద్రాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం పెద్దది. రంగమెక్కడం వంటి కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి.

పండుగ విధి – విధానాలు
తొట్టెళ్లు, బోనం కుండలు (అన్నమున్నవి), బోనాలు (దీపంతలున్నవి) ఇంటి నుండి ఆలయం వరకు తీసుకురావడానికి ముందే ఆలయంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ ఆలయ శుభ్రతకు, అలంకరణకు సంబంధించినవి. పల్లెల్లో అయితే సాన్పి (కల్లాపి) చల్లి, జాజుతో పట్టెలు దీర్చి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలువేసి అలంకరిస్తారు. పట్టణాల్లో నీళ్లతో శుభ్రంచేసిన తర్వాత, ముగ్గులు, వస్త్రధారణలు, అలంకరణలు, ధూప-దీప-నైవేద్యాదులు కొనసాగిస్తారు.

ఘటంతో స్వాగతం
అమ్మవారికి ఘటంతో (కలశంతో) స్వాగతం పలుకుతారు. ఆ ఘటంలోకి సూక్ష్మరూపంలో ఉన్న విగ్రహాన్ని తెచ్చి పెడతారు. ఉత్సవ విగ్రహమన్నమాట. ఘటం పురవీధుల్లో ఊరేగిస్తారు. ఎక్కడివారక్కడే అమ్మవారిని దర్శించుకొని హారతులిస్తారు. ప్రసాదాలు సమర్పిస్తారు. పూలుపళ్ళతో అమ్మవారిని అలంక రిస్తారు. మొక్కులు తీర్చుకొనే వారు ఆ మొక్కు ప్రకారం సమర్పించుకొంటారు.

అమ్మవారు మూలస్థానం చేరుకోంటుండగానే బోనాలు వస్తాయి. ఇదే శోభాయాత్ర.

బోనాల శోభాయాత్ర
వందలాది మంది దేదీప్యమానంగా వెలుగుతున్న బోనాలతో వస్తారు. ఈ సందర్భంగా పూర్వ కాలంలో అయితే అమ్మవారి దర్శనం నిమిత్తం తపిస్తూ పాటలు పాడినట్లుగా పెద్దలు చెబుతున్నారు. ఇందులో తమ కోరికలు చెప్పుకొంటారు. మేలు జరగాలని కోరుకుంటారు.

‘తెల్లంగ సీరగట్టి – తెల్లంగ రైకతొడిగీ

యాడికో పోతవమ్మ-ఎయిగండ్ల నాయిపోచ(మ్మ)

ఓ ఎయి గండ్ల నాగ పోచా’

కట్టమీదీ రెండు కలియాపా నాగ చెట్లోయ్‌

కడగొట్టు లింగమయ్యా

కలియానం నేనెపోత, కలియానం (కల్యాణం) నేనే పోత ||

ఇలాంటి పాటలు వివిధ బాణీల్లో ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కాని రికార్డులు వచ్చేసి ఈ పాటల్ని తొక్కేశాయి.

సాక సమర్పణం
బోనాలు అమ్మవారి గుడిదగ్గరికి వచ్చింతర్వాత అందరూ అమ్మవారి దగ్గర సాకవోస్తారు. గుడి ముందటి పోతరాజు దగ్గరగానీ, బొడ్రాయి దగ్గర గానీ సాకవోసి నైవేద్యం పెడతరు. కొబ్బరి కాయ కొడతరు. వేపరెమ్మలు (రిల్లలు) అక్కడే సమర్పిస్తారు. దేవికి ఇష్టమనీ కల్లు – సారా సమర్పించడమే సాకవోయడం. సాక వోయడం అంటే ‘శాఖలు’ (కొమ్మలు) సమర్పించడంగా కొందరు చెబుతారు. కాని ఈ పండుగలో పాల్గొనే వారు మాత్రం కల్లు – సారాలే ప్రస్తావిస్తున్నారు. కల్లు – సారాలు కాక, బీరు బ్రాందీరమ్ములు కూడా కొందరు సమర్పిస్తున్నారని చెబుతున్నారు. ఈ మత్తు పదార్థాలు వద్దనుకొన్నవారు బెల్లం పానకం సాకవోస్తున్నారు.

తొట్టెల ఊరేగింపు
రంగు రంగుల అరకు (మెరిసే) కాగితాలతో 3,4,5,6,7 అంతస్తుల తొట్టెలతో ఊరేగింపుగా వస్తారు. అయితే పిల్లలు (సంతానం) కాని (లేని) వాళ్ళే ఈ మొక్కు తీర్చుకోవడానికి వస్తారు. మెరిసేరంగు రంగు మెరుపు తొట్టెలలు తేరులా ఉంటాయి. పూల రథాల్లా ఉంటాయి. విద్యుద్దీపాలున్న పొడుగు పాటి చెట్లలా ఉంటాయి. తొట్టెలలు మగవారు మోస్తారు. స్త్రీలు వెంబడి ఉంటారు. వీటి పరమార్థం తెలియని చిన్నపిల్లలు కేరింతలు కొడతారు.

పోతురాజుల వీరంగాలు
ఈ దేవీ దేవతలకు ఏడుగురు అక్క చెల్లెండ్రుంటారు. వీరికి తోడపుట్టిన తమ్ముడొ కడుంటారు. అతని పేరే పోతరాజు. ఒక్కడేకాని, వేషాలు వేసుకుని ఇద్దరు ముగ్గురు వస్తారు. దూకుతూ, కేకలు వేస్తూ, లయబద్ధంగా నృత్యం చేస్తూ, నడుముకు ట్టుకున్న తోకతో (కొరడాతో) ఫెడేళ్‌ ఫెడేళ్‌ మని కొడుతూ వస్తాడు. అశ్శరభ అశ్శరభ అని వీరంగాలు చేసినట్టే ఉంటుంది ప్రదర్శన. ఒక విధంగా చెప్పాలంటే వీరభద్రుని దూకుళ్లే ఇవి. దక్షయజ్ఞ ధ్వంసంలో వీరభద్రుడేవిధంగా దూకుతాడో ఆ కొరడాతో (వీరగోలతో) హడలగొడతాడు. నాలుకకు నారాచాలు గుచ్చుకొనే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది.

ముఖానికి పూసుకున్న పసుపు కుంకుమలు, బొట్టూ బోనాలు, కట్టూ – జుట్టూ అన్నీ వీరత్వాన్ని ప్రదర్శించేవిగా ఉంటాయి. ఆ తల్లి ముందు, అమ్మలక్కల్లో పోతరాజొక్కడు వీరభద్రునిగానే మిగిలిపోతాడు.

గావు పట్టడం
కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఈ సంప్రదాయం ఉంది. ఇక్కడ కులం పేరు పేర్కొనడం లేదుగాని వా రున్న చోటనే ఇది ఉంది. పోతురాజుల వీరంగాలు ఒకవైపుండగా, ఈ పూజల్లో పాల్గొన్న ఆ వర్గానికి చెందిన ఒక వ్యక్తి మేకపోతు గొంతు పట్టి కొరుకుతాడు. దీని గళం తెగిపోయింతర్వాత విదలిస్తాడు. గొంతువట్టి కొరకడాన్నే గావు పట్టడం అంటారు.

ఈ పద్ధతి నిషేధింపబడ్డా రక్షకుల కళ్లుగప్పి నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని పల్లెల్లో గావు పట్టడం యధావిధిగా జరుగుతున్నది. చట్టం చట్టమే, ఆచారం ఆచారమే అంటున్న వారున్నారు.

రంగమెక్కడం (భవిష్యవాణి)
హిందూ సంస్కృతిలో కుండకున్న ప్రాధాన్యం ప్రత్యేకంగా పరిశీలించాలి. బోనంకుండ ఈ భువనానికి సంకేతం అన్నట్టుగానీ పచ్చికుండనే మూలాధారంగా నిలుస్తుంది. రంగమంటేనే భవిష్యవాణి.

ఈ రిచ్యువల్స్‌లో లీనమై, ప్రతి యేటా పరమ పవిత్రంగా ఉండి, విశుద్ధ మానసికస్థితిని ఏర్పరచుకొన్న, ఒక అవివాహిత ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ముఖం నిండా పసుపు పూసుకొన్న ఊర్ధ్వపుండ్రధారియైన ఆ యువతి అచ్చం అమ్మవారిలా కదలి వస్తుంది. ఆమె కళ్లు దివ్య తేజఃపుంజాలై ప్రకాశిస్తుంటాయి. ఆమె ప్రతివాక్కు శబ్ద బ్రహ్మను మురిపిస్తుంది.

ఆ తల్లి ఒక పచ్చికుండపై నిలుస్తుంది. ఆమె అప్పటికే మాతంగిగా మారుతుంది. ఆ కుండయే రంగమవుతుంది. దేశాన్ని గూర్చి ధర్మాన్ని గూర్చి, పరిపాలకులను గూర్చి, పాడిపంటలను గూర్చి దేశానికి వచ్చే ప్రమాదాల గూర్చి అడిగిన ప్రశ్నలకల్లా సూటిగా సమాధానాలు చెబుతుంది. ఈ భవిష్యవాణి బోనాల జాతరలో పాల్గొన్న అందరూ వినేటట్లుగా ఏర్పాటు చేస్తారు.

అవును! బోనాలు శాక్తేయంలో అంతర్భాగమే
భవిష్యవాణి తర్వాత జగన్మాతకు ప్రతినిధియైన గ్రామ దేవతను సాగనంపే ఉత్సవం కొనసాగుతుంది. ఈ మొత్తం ఉత్సవంలో అక్కడక్కడా, వాద్యాలకు కదలిన స్త్రీలు, భావోద్వేగాని కి లోనైన వారు సిగాలూగుతారు. వీరినే శివసత్తులం టారు.

ఇది శివతాండవమే. ఇందులో లాస్యమున్నా శక్తి ప్రదర్శనే ముఖ్య మైంది. సిగం వచ్చినవారిలా కొందరు భవిష్యవాణి పలుకుతారు.

ఈ పద్ధతి శాక్తేయంలో భాగమే. అసలు బోనాల జాతరే శక్తి ప్రదర్శన. జగన్మాతయైన అమ్మవారు మాతంగియై మన ఇంట్లో, మన ఊళ్లో, మన వ్యవసాయ క్షేత్రంలో, మన వీధి ప్రక్కన వెలసిన తర్వాతనే బోనాల జాతర ప్రారంభమైంది. తెలంగాణ శాక్తేయమై నిలచింది.

తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోంది. జూలై 7 నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాల నిర్వహణకుగాను రాష్ట్ర హాం శాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.

ఆషాఢ మాసం ఆరంభంలో మొదలయ్యే బోనాల సంబురాలు రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. గోల్కొండ జగదాంబిక ఆలయంలో జులై 17, 18న, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాంకాళి ఉత్సవాలను జూలై 24, 25న, అటు తర్వాత లాల్‌ దర్వాజ సింహవాహిని మహాంకాళి ఉత్సవాలు జూలై 31, ఆగస్టు 1వ తేదీలలో వైభవోపేతంగా జరుగనున్నాయి. ప్రభుత్వం అత్యంత పటిష్టమైన చర్యలు చేపట్టి ముందస్తు ప్రణాళికలతో సర్వసన్నద్ధంగా వుండాలని వివిధ ప్రభుత్వ శాఖల యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది.

Other Updates