telanganaతెలంగాణ ప్రాంతంలో బళ్ళ కొద్దీ పలుకుబళ్ళు ఉన్నాయి. గంపల కొద్ది సామెతలున్నాయి. ఇక్కడ పొణకల నిండా పొడుపుకథలున్నాయి. పట్టేన్ని పదాలు ఉన్నాయి. ఒల్మెన్ని విభక్తి ప్రత్యయాలున్నాయి. వీటన్నింటినీ తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల పలుకుబళ్ళతోనూ, సామెతలూ, పొడుపుకథలూ, పదాలూ, ప్రత్యయాలతోనూ పోల్చిచూసినప్పుడు తెలంగాణ పలుకుబడి ప్రత్యేకమైనదిగా కనబడుతుంది.

ఈ ప్రాంత సామెతలు విశిష్టమైనవిగా గమనించగలం. ఇక్కడి పొడుపుకథల్లో వైలక్షణ్యం గోచరిస్తుంది. తెలంగాణలో వ్యవహృతం అవుతున్న పదాలూ, విభక్తులూ విభిన్నంగా అగుపిస్తున్నాయి. ఈ ప్రత్యేకతలకు కారణాలు అనేకం. నిజానికి తెలంగాణ ఒక ప్రత్యేకప్రాంతం. ఇవాళ అది ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ సాహిత్యం ప్రధానంగా దేశి కవితా సంప్రదాయానికి చెందింది. అది శిష్టేతరమైన జానపదుల సారస్వతం, తెలంగాణ పల్లె మమతానురాగాల ముల్లె, నెనరు గల్ల మాటలకు నెలవు తెలంగాణం. ఆత్మ గల్ల పాటలకు కొలువు తెలంగాణం.

తెలంగాణలో చాలా మాటలు ఎదలోతుల్లోంచి ఎగిసివస్తాయి. నాలుక కొస నుండి కాకుండా నాభి దగ్గర నుండి పెకులుతాయి. తెలంగాణ పదాలు, పాటలు ప్రజల అనుభవంలోంచి, జీవితం నుండి, సమాజం నుంచి ఆవిర్భవిస్తాయి. ప్రజల కష్టసుఖాల నుండి కన్నీళ్ళ నుండి, చెమటలోంచి వచ్చిన ఈ పలుకుబళ్ళు మట్టి వాసనలతో గుబాళిస్తాయి. ఈ పలుకుబడి శీర్షికలో సామెతల్ని సైతం ఈ వ్యాస రచయిత పరిగణనలోకి తీసుకున్నాడు. ఇప్పుడిక మట్టి గురించిన పలుకుబళ్ళను చూద్దాం!

తెలంగాణలో ‘ఇయ్యల్ల ఇంట్ల – రేపు మంట్లె’ అనే నానుడి ఉంది. బాగా చదువుకున్న వాళ్ళూ, సంస్కృత భాష ఇంతో కొంతో తెలిసిన వాళ్ళూ ‘జాతస్య మరణం ధ్రువం’ అని ధృవీకరిస్తారు. అర్థం పుట్టిన ప్రతి వాడికి చావు తథ్యం అని. తెలుగులో ఈ అర్థంలో మరో సామెత ఉంది. అది.. ‘పుట్టిన వాడు గిట్టక పోడు..’ ‘ఇయ్యల్ల ఇంట్ల – రేపు మంట్లె..’ అనే సామెతలో అంత్యానుప్రాస ఉంది. ఇది ఒక రకమైన నాదమాధుర్యాన్ని అందిస్తున్నది. పుట్టినవాడు గిట్టక పోడులో ప్రాసయతీ, అనుప్రాసా వున్నా.. ఇంట్ల – మంట్లె లో వున్న సున్నా లేక పోవడం చేత నాదసౌందర్యం లేకుండా పోయింది.

‘ఇంటింటికి మంటి పొయ్యే’ అనేది మరొక తెలంగాణ సామెత. శేషప్ప అన్నట్లు లక్షాధికారైన లవణమన్నమె కాని/ మెరుగు బంగారమ్ము మింగ బోడు కదా! ప్రతి ఇంటికి పొయ్యి మట్టితోనే తయారై వుంటుంది. బంగారు పొయ్యి ఎవరికి వుండదు. ఎన్ని అష్టైశ్వర్యాలున్నా ఎవ్వరూ బంగారు బువ్వ తినరు. అన్నమే తినాలి. ప్రతి ఇంటికీ గృహచ్ఛిద్రాలూ, అంతఃకలహాలూ, కష్టసుఖాలూ దాదాపు సమానమే అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మరి ఇతర ప్రాంతాల్లో ఈ సామెత ఎలా వుందో చూద్దాం.. ‘ఎవరి ఇంటి దోసెకైనా తూట్లే..’ ‘ఇంటింటికి మంటి పొయ్యే’ అనే సామెత మనిషికి, మట్టికి వున్న సంబంధం నాటిదైతే.. ఎవరి ఇంటి దోసకైనా తూట్లే అన్నది కొంత ఆధునికం కావచ్చును.

‘మంటి పనికైనా ఇంటివాడు ఉండాలె అనేది తెలంగాణ సామెత. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఈ సామెతను ఎట్లా చెబుతున్నారో తెలియదు. ఎంత చిన్నపనికైనా మన ఇంటివాడు ఉన్నప్పుడే అది చక్కగా నెరవేరుతుంది. ఏ రకమైన ఆటంకాలూ, అడ్డంకులూ లేకుండా ఎంచక్కా పని పూర్తయిపోతుంది. ఇంటివాడికీ, పరాయివాడికీ చాలా తేడా ఉంటుంది కదా!

‘మంట్లె,’ ‘మంటి పొయ్యి,’ ‘మంటి పని..’ ఈ పదాలు ఇతర ప్రాంతాల్లో మట్టిలో, మట్టిపొయ్యి, మట్టిపని అని వ్యవహ రించబడతాయి. ‘మన్ను’ నుండి వచ్చినవే ‘మంట్లె’ మొదలైన ఔపవిభక్తికాలు. సున్నా (బిందువు)తో ూడివుండడం ూడా తెలంగాణ ప్రత్యేకత.

Other Updates