fishermenరాష్ట్రంలోవున్న వివిధ కుల వృత్తులవారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందిస్తోంది. అందరి ఆశలను నెరవేరుస్తుందనే మిషన్‌ కాకతీయ కార్యక్రమం కూడా ఓ బృహత్‌ ప్రణాళికగా రూపొందించి అమలు చేస్తున్నది. చెరువులలో నిండుగా నీటి నిల్వలు వున్నప్పుడు కేవలం రైతులకే కాదు వ్యవసాయాధిరిత ఇతర రంగాలు కూడా పుంజుకుంటాయి. తద్వారా ఆయా రంగాలను ఆధారం చేసుకొని జీవనభృతిని పొందేవారి జీవితాలలో సకారాత్మకంగా గుణాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ఆచరణాత్మక ఆలోచనను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం 101 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నీళ్ళు, నిధులు, నియామకాల మీద జరిగిన తెలంగాణ పోరాటంలో అంతిమ విజయం సాధించి నేడు తెలంగాణ ప్రజలకు దాని ఫలితాలను అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ రోజు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలద్వారా ఆయా ప్రాంతాలలోని చెరువులు, కుంటలు నీళ్ళతో కళకళలాడుతున్నాయని, నీళ్ళకు, మత్స్యకారులకు విడదీయరాని బంధం ఉందని మంత్రి ఈటల అన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులంటే కేవలం కోస్తా వారినే పరిగణనలోకి తీసుకునేవని, తెలంగాణ ప్రాంతంగురించి పట్టించుకున్న దాఖలాలులేవని ఆయన అన్నారు. ఎక్కడ నీటి వనరులున్నా వాటిమీద హక్కు మత్స్యకారులకు ఇవ్వాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని, మత్స్యకారుల సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపి వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఆయన అన్నారు.

రాబోయే కాలంలో ప్రతి కుంటను నింపి మత్స్యకారుల సంపదను రెట్టింపు చేసే ఆలోచనలో ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనివిధంగా మన రాష్ట్రంలో మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధికోసం 40 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పట్ల అన్ని రాష్ట్రాలలో కూడా ఆయా ప్రభుత్వాలపై తమ రాష్ట్రంలో కూడా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారులనుండి వత్తిడి వస్తోందన్నారు. పేదవాడి ఆకలి తెలిసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారులందరికీ ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేయాలనే గొప్ప ఆలోచనను చూస్తుంటే వెనుకబడిన తరగతులపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు స్పష్టమవుతున్నాయని అన్నారు. ఇప్పుడు చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతోపాటు రాబోయే కాలంలో పెరిగిన చేపలను మార్కెటింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాలలో అవసరమైన మార్కెట్‌ యార్డులను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు ఆయా సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు మార్కెట్‌ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సేకరించి ఇచ్చినట్లయితే వాటిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆయన అన్నారు. 40 కోట్ల చేపపిల్లలను కలిగిన ఏకైక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తమ చేప పిల్లలను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తోందని తలసాని వివరించారు. మత్స్యకారులు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు రవాణా సౌకర్యార్థం అవసరమైన ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు 75శాతం సబ్సిడీని కూడా అందజేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందని మంత్రి శ్రీనివాస యాదవ్‌ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా కమ్యూనిటీహాళ్ళ నిర్మాణ బాధ్యతలను సొసైటీలకే అప్పగించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన వివరించారు. రిజర్వాయర్లు, చెరువులతోపాటు పంచాయతీ చెరువులలో కూడా ఉచితంగా చేపపిల్లల పంపిణీకోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని, మరికొద్ది రోజులలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మత్స్యకారులకు ఇచ్చే ప్రమాదబీమాను లక్షనుంచి 5 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరికొద్ది రోజులలో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడు తాయని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమానికి ముందు మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తిలకించారు. ఈ సందర్భంగా నీలివిప్లవం పేరుతో రూపొందించిన పోస్టర్‌ను, మత్స్యకారుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్‌లను మంత్రులు ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి లక్ష్మప్ప రూపొందించిన చేపలు-ఉపాధి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో లక్ష్యాలను పూర్తిచేసిన మెదక్‌, కరీంనగర్‌జిల్లాల మత్స్య సొసైటీల అధ్యక్షులను మంత్రులు సన్మా నించారు. ఆయా జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న వివిధ స్థాయిల అధికారులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌చందా, ఇన్‌ఛార్జి కమిషనర్‌ వెంక టేశ్వర్లు, జాయింట్‌ డైరెక్టర్‌ శంకర్‌రాథోడ్‌, జీఎం సరళాదేవి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇరువురు మంత్రులు జ్యోతి ప్రజ్వలనచేసి మత్స్యకారులదినోత్సవ వేడుకలను ప్రారంభించారు.

Other Updates