sampadakeeyamగ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలని, భారతదేశం భవిష్యత్తు గ్రామీణప్రాంతాల అభివృద్ధిపైనే ఆధారపడి వున్నదని జాతిపిత మహాత్మా గాంధి ప్రగాఢంగా విశ్వసించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని భావించి, ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా బలోపేతంచేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.

గ్రామాలు అంటేనే వివిధ వృత్తిపనివారల సమ్మేళనం. వాస్తవానికి అపారమైన అనుభవంగల ఈ వృత్తిపనివారే తెలంగాణకు వున్న ప్రధాన మానవ వనరు. వీరికి సరైన ప్రోత్సాహం, సహకారం అందిస్తే, ఆయా వర్గాల ప్రజలతోపాటు గ్రామాలు, తద్వారా రాష్ట్రం కూడా మరింత ఆర్థికాభివృద్ధి సాధించగలదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, పేదరిక నిర్మూలనకు, భవిష్యత్‌ అవసరాలకు తగిన విధంగా వివిధ కులవృత్తులకు చేయూతనందించే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. ఆయా కుల వృత్తులను పరిశ్రమలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది.

రాష్ట్ర అవతరణ జరిగిన కొద్ది రోజులకే రాష్ట్రప్రభుత్వం జరిపించిన సమగ్ర సర్వే ఏ వృత్తివారు ఎక్కడెక్కడ ఎంతమంది వున్నారు, వారి స్థితిగతులు తెలుసుకోవడానికి ఎంతో దోహద పడింది. దీని ఆధారంగానే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పనచేసి అమలుపరుస్తోంది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి వివిధ ప్రాజెక్టులు చేపట్టి సాగునీటి వ్యవస్థను అభివృద్ధి పరుస్తోంది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో వినియోగానికి అవసరమైన చేపలు, గొర్రెలను ప్రతిరోజూ ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. కానీ, వాస్తవానికి ఇతర ప్రాంతాలకు వీటిని ఎగుమతిచేయగల శక్తిసంపన్నమైన మానవ వనరులు మనదగ్గరే వున్నాయి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మత్స్య కార్మికులు 40 లక్షల మంది వరకూ వున్నారు. వారితో చేపల పరిశ్రమను అభివృద్ధిచేసి, చేపల ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మిషన్‌ కాకతీయతో అభివృద్ధిచేసుకుంటున్న చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయి. వీటితోపాటు, జలాశయాలు, బ్యారేజీలలో చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవలే కోట్లాది రూపాయల విలువైన చేపపిల్లలను వీటిలో పెంచడం ప్రారంభించింది. ఇవి పెరిగి పెద్దవై మత్స్యకారులకు పెద్దమొత్తంలో ఆదాయ వనరుగా మారబోతున్నాయి.

అలాగే, రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా యాదవులు వున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా, మన రాష్ట్రంలో నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై 88 లక్షల గొర్రెలను సరఫరాచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇప్పుడున్న 50 లక్షల గొర్రెలతో కలుపుకొని రెండేళ్ళలో వీటి సంఖ్య 4 కోట్లకు చేరుతుందని అంచనా. ఒక్కో గొర్రె ధర 5 వేల రూపాయలుగా భావించినా, అనతి కాలంలోనే సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువైన సంపద వీరివద్ద సమకూరుతుంది. అలాగే చేనేత కార్మికుల కోసం ఒక సమగ్ర నూతన విధానాన్ని రూపొందించే దిశగా కసరత్తు సాగుతోంది.

ప్రభుత్వ ఆశయాలు ఫలించి కులవృత్తులవారు కూడా ఆర్థికంగా బలపడే రోజు ఎంతో దూరంలో లేదు.

Other Updates