gangadevipalliతెలంగాణ రాష్ట్రంలోని గంగదేవిపల్లి గ్రామం మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడంతోపాటు అనేక అవార్డులు, ప్రత్యేకతలతో ఆదర్శ గ్రామంగా నిలచిన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని ఈ గంగదేవిపల్లి గ్రామం ఇప్పుడు మరో చరిత్రకు నాంది పలికింది. నిర్మల్‌ జాతీయ అవార్డు అందుకున్న ఈ గ్రామం ఇప్పుడు పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా, మానవ విసర్జితాలను సేంద్రియ ఎరువుగా మార్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల కేంద్రబృందం కూడా ఈ గ్రామంలో పర్యటించి ఈ గ్రామం సాధించిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ గ్రామం సాధించిన విజయం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడింది.

మానవ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయవచ్చని తెలంగాణలోని గంగదేవిపల్లి గ్రామం నిరూపించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సయితం ప్రశంసించారు. ఫిబ్రవరి 27న ప్రధాని తన మన్‌ కీ బాత్‌ లో ఈ ప్రస్థావన తెస్తూ, ఇటీవల కేంద్ర నీటి, పారిశుధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారని, అధికారులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. గంగదేవి పల్లిలో నిర్మించిన కొత్త తరహా మరుగుదొడ్లు ఎంత ఉపయోగకరంగా వున్నాయో వీరు దేశానికి తెలియజేశారని ప్రధాని తెలిపారు.

ఎరువుగా మారిన మానవ వ్యర్థాలను వారు స్వయంగా తొలగించి, గుంతను శుభ్రం చేసినప్పుడు వారు ఇబ్బంది పడలేదని, గంగదేవిపల్లి ప్రయోగం సత్ఫలితాలనిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యర్థాలను సంపదగా ఎలా మార్చవచ్చో గంగదేవిపల్లి గ్రామం నిరూపించిందని ప్రధాని ప్రశంసించారు.

క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన

రెండు గుంతల టెక్నాలజీ ద్వారా నిర్మించిన మరుగుదొడ్లు అత్యంత సురక్షితమైనవని కేంద్ర నీటి, పారిశుధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వర్‌ అయ్యర్‌ తెలిపారు. ఫిబ్రవరి 18న వరంగల్‌ రూరల్‌ మండలం గంగదేవిపల్లిలో రెండు గుంతల పద్దతిలో నిర్మించిన మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వ ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. శానిటేషన్‌ సెక్రటరి పరమేశ్వర్‌ అయ్యర్‌, జాయింట్‌ సెక్రటరి అరుణ్‌ భరోఖా, డైరెక్టర్‌ నిపుణ్‌ వినాయక్‌లతో పాటు 26 రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, స్వచ్‌ భారత్‌ మిషన్‌ డైరెక్టర్లు సుమారు 49 మంది గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారికి గ్రామస్థులు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహరతులతో తిలకం దిద్ది గ్రామంలోకి ఆహ్వానించారు. అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి గ్రామంలో ఎంపిక చేసిన ఏడుగురి ఇండ్లలో నిర్మాణం చేసిన మరుగుదొడ్లను పరిశీలించి, నిండిన గుంతలలో మలం ద్వారా ఏర్పడిన ఎరువును వారందరూ స్వయంగా తమ చేతులతో గుంతలో నుండి ఎరువును కవర్‌లో నింపారు. గుంతలోని ఎరువును మొత్తం వారు తొలగించారు.

అనంతరం గ్రామపంచాయతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వర్‌ అయ్యర్‌ మాట్లాడుతూ రెండు గుంతల టెక్నాలజీ ద్వారా మరుగుదొడ్లు నిర్మించాలని, తద్వారా పారిశుధ్య నిర్వహణతో పాటు విలువైన ఆర్గానిక్‌ ఎరువులు తయారుచేసుకోగలమన్నారు. రెండు గుంతల టెక్నాలజీ సురక్షితమైనది, శ్రేయస్కరమైనదని, శుద్ధి చేసేప్లాంట్‌ అని ప్రజలందరికీ తెలిపేందుకు తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ టెక్నాలజీ పట్ల ప్రజలలో కొంత అపోహ ఉందని, దీనివల్ల ఎటువంటి హానీ లేదని, ఈ మేరకు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 49 మంది ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, డైరెక్టర్లు, యునిసెఫ్‌ బృందంతో గంగదేవిపల్లిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఎరువుగా మారిన మలాన్ని చూడడం జరిగిందని తెలిపారు. రెండు గుంతల పద్దతిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఒక గుంతలో ఎరువుగా మారిన మలాన్ని చూడడం దేశంలోనే ఇదేె మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం లేని ఈ సేంద్రియ ఎరువులో విలువైన పోషకాలు ఉన్నాయని, దేశంలోనే కాదు ప్రపంచస్థాయిలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు. సీసాలో వేసిన ఎరువు శాంపిల్‌ కాఫి పౌడర్‌లా ఉందని ఎలాంటి దుర్వాసన లేదని పేర్కొన్నారు.

స్వచ్చ్‌ భారత్‌ నినాదాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పిస్తున్నామనీ, కాని 15 సంవత్సరాల కిందటే గంగదేవిపల్లిలో ఈ టెక్నాలజిలో మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, గ్రామం గురించి ఎంతో విన్నామని, నేడు స్వయంగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఈ గ్రామం ప్రపంచానికే ఆదర్శమని గ్రామ సర్పంచ్‌, గ్రామస్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామానికి వచ్చిన బృందం ఇక్కడి పద్దతులను చూసి సంతృప్తి చెందారని, ఇక్కడ రైతులు దీనిని ఎరువుగా వాడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2018 నాటికి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ తెలంగాణ అంటే మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే కాదని, కట్టిన మరుగుదొడ్లను వినియోగించడమని ఆమె అన్నారు. మరుగుదొడ్లను రెండు గుంతల టెక్నాలజి ద్వారా నే నిర్మించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్త్తూ ఆ మేరకే నిర్మాణాలు చేస్తున్నామన్నారు.

ఎన్‌ఐఆర్‌డి నుంచి వచ్చిన బృందం గంగదేవిపల్లిలో మరుగుదొడ్ల నిర్మాణం, మల విసర్జన నుంచి ఎరువుగా మారిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తెలిపారు. రైతులు రసాయనిక ఎరువులకు ఎంతో ఖర్చు చేస్తున్నారని, ఇట్టి ఎరువుద్వారా ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి అధికంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, డైరెక్టర్లు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.హరిత, డిఆర్‌ఓ శేఖర్‌రెడ్డి, డిఎస్‌ఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Other Updates