telugu-sirగా దినాలు మల్ల రావు. గవి అయిసు గడ్డ తీర్గ కర్గిపోయినయి. గని మా మనసుల మీద మోర్‌ గొట్టి పోయినయి. యాది అర్వై తొమ్మిది తెలంగాణ మూమెంట్‌ బ్యాచ్‌. మా తోనే మా కాలేజి షురువైంది. మషిరబాడ్ల పద్మారావు నగర్‌ల సర్దార్‌ పటేల్‌ కాలేజి ఉన్నది. గా కాలేజిలనే మేము సదువుకొన్నం. తోట ఆనందరావు మా ప్రిన్సిపాలె. మా కాలేజిల మచ్చుకు ఒక్క ఆడపిల్ల గూడ లేకుండె.

సికింద్రబాద్‌ రేల్‌ టేషన్కు మా కాలేజి దగ్గర్ల ఉండేది. ఇగ దాంతోని మా బొన్గిరొల్లల్ల శానమంది పోరగాల్లు మా కాలేజీల షరీకయ్యిండ్రు గాల్లు. దినాం మద్రాస్‌ ఎక్స్‌ప్రెస్ల వచ్చెటోల్లు. మల్ల గదే గాడిల బోన్గిరికి బోయెటోలు. మాకు తిరుమల శ్రీనివాసాచారి తెలుగు జెప్పెటోడు. గాయిన పొడ్గ ఉండెటోడు. గాయినది నవ్వు మొకం. మిత్రమా! అన్కుంట మా బుజాల మీద చెయ్యేసి పల్కరిచ్చెటోడు. గాయిన క్లాసు గినుంటె కొత్త సిన్మవొచ్చినా కాలేజికి డుమ్మగొట్టెటోల్లం గాదు.

ఒకపారి మా తెలుగు సార్‌ రాస్తుంటె జూసి

‘మీ రాత బాగున్నది సార్‌’ అని మా ప్రమోద్‌ గాడన్నడు.

‘నా రాత బాగుండ బట్కె మీకు లెక్చరర్‌ నైన’ అని గాయిన అన్నడు.

పాటాలే గాకుంట అష్ట్టావదానం సమస్యలు గూడ మా తెలుగు సార్‌’ ఇచ్చెటోడు.

‘ఒకపారి కన్నులలో చన్నులమరె కాంతామణికిన్‌’ అనే సమస్య ఇచ్చి పూరించు మన్నాడు. ఎంత తడ్లాండిన మా తోని గాలేడు. ఆ కర్కి సారే-

‘వల కన్నులలో చన్నులమరె కాంతామణికిన’్‌ అని పూరించిండు.

ఒక బెస్తామె చాపలు బట్టెటందుకు బోయింది. గప్పుడు గామె పెయ్యిమీద వల ఏస్కుంటె గా వల కన్నులల్ల గామె చన్నులున్నయి. అని మా తెలుగు సార్‌ జెప్పిండు. ఇంకోపారి కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌ అనేటి సమస్య ఇచ్చిండు. పాండవులు విరాట రాజు కొల్వుకు బోయినప్పుడు. ఏన్గలు దోమ కుత్కెలకు బోయిన తీర్గ ఉన్నది అని మా తెలుగు సార్‌ తిరుమల శ్రీనివాసాచారి జెప్పిండు.

ఒక పారి మా కాలేజిల గేయాలు రాసుట్ల పోటి పెట్టిండ్రు. ‘పునరాహ్వానం’ అనే పేరు తోని నేను ఒక గేయం రాసిన. బికాం సద్వేటి తాళ్లపల్లి మురళీధర్‌ గౌడ్‌ మా తెలుగు సార్‌కు దగ్గరోడు. గాడు గూడ పోటికి ఒక గేయం రాసిండు. గని మా తెలుగు సార్‌ నా ఫస్టు ఫ్రైజ్‌ ఇచ్చిండు. గా ఫ్రైజ్‌ను దివాకర్ల వెంకటావధానితోని ఇప్పిచ్చిండు. ఫ్రైజ్‌ కింద ‘ఈ జంట నగరాలు’ – హేమంత శిశిరాలు వయ్యి నాకిచ్చిండు.

కాలేజ్‌ దినాలు యాదికొస్తె- ‘జానే కహా గయో వొ దిన్‌’ పాట యాదికొస్తది. మాకు నటరాజన్‌ సార్‌ లెక్కలు జెప్పెటోడు. గాయిన ముస్లాయిన. లెక్కలను గాయిన పాడు కుంట జెప్పెటోడు. డాన్సు గూడ జేసెటోడు. మిెస్ట్రీ జెప్పేటి వెంకటేశ్వర్రావు మిెకల్‌ బాండింగ్‌ గురించి పాటం జెప్తె గాయినకు బాండ్‌ అని మేము పేరు బెట్టినం.

స్వామి సార్‌ మాకు మోడ్రన్‌ ఆల్జీబ్రా జెప్పెటోడు. ఒకపారి మేము ఆనంద్‌ సిన్మా గురించి ముచ్చట బెడుతుంటె గాయిన ఇన్నడు.

‘రాజేశ్‌ఖన్నా ఫోజులను సూడకుండ్రి. అమితాబ్‌ బచ్చన్‌ సీరియస్‌ యాక్షన్‌ జూడుండ్రి’ అని గాయన అన్నడు.

మీటింగ్ల గిన అయితె కొంతమంది పాటలు, పద్యాలు బాడెటోల్లు. ఒకపారి ఒకడు బావా ఎప్పుడు వచ్చితీవు అన్కుంట పద్దెం షురువు జెయ్యంగనే-

‘గిప్పుడే బామ్మర్దీ’ అని ఎన్కల్లిె ఒకడు లాసిగ వల్లిండు.

‘ఎచ్చటనుండి రాక ఇటకు’ అని గాడు పద్దెం అందుకోంగనె,

‘మషిరబాద్‌ల్లిె అని ఎన్కల్లిె ఒక కొంటెె పోరడు అన్నడు.

‘సార్‌’ మీరు ఒక నామం గాకుంట పంగ నామాలు బెడ్తె బాగుండేది సార్‌’ అని మా తెలుగుసార్‌ తిరుమల శ్రీనివాసాచారితోని నర్సిమ్మారెడ్డి అంటే-

‘ఎందుకు మిత్రమా’ అని సార్‌అడిగిండు.

గప్పుడు మిమ్ములను ఏక్‌ సౌ గ్యారా అని అనెటోల్లం సార్‌ అని గాడన్నడు.

‘గిప్పుడేం కొంప మున్గింది’. రొండు తక్వ మూడు అనుండ్రి అని మా సార్‌ అన్నడు.

అందరి తాన అప్పులు జేసేటి మా శ్రీమన్నారాయణగాడు తెలుగు సార్‌ను గూడ ఇడ్వలేడు.

మా తెలుగుసార్‌ మన ముక్యమంత్రికి గూడ సద్వు జెప్పిండ్రు.

తెలంగాణ వొచ్చినంక మా తెలుగుసార్‌ తిరుమల శ్రీనివాసా చారికి మన ముక్యమంత్రి . చంద్రశేఖరరావు మొక్కుతున్న ఫోట్వ పేపర్ల గండ్లబడ్డది. గప్పుడు మా తెలుగుసార్‌ అంటే ఏందో నార్కౖెెంది.

గీనడ్మ తెలుగుసార్‌కు ఫోన్‌ గొట్టి-

‘మీకు యాదికున్న మన కాలేజి ముచ్చట్లు జెప్పుండ్రిసార్‌’ అని అడిగితె-‘నాన్నా! నా పెయిల బాగలేదు. నీకు యాదికున్న కాడ్కి రాయి అని మా తెలుగుసార్‌ అన్నడు.

గాయిన మాట ఎట్ల గాదాంట్‌’.

(గీ దానితోని యాదికున్న కాడ్కి కతమైతున్నది. గీ ముచ్చట్లు జెప్పెతందుకు మోక ఇచ్చిన

తెలంగాణ ప్రధాన సంపాదకుడు

అష్టకాల రామ్మోహన్‌కు కృతజ్ఞతలు)

Other Updates