palukubadi

‘తెలుగు భాషలోని ‘ముఖము’ అనే పదానికి ‘మొగము, మోము, మొహం, మొకం, మకం’ మొదలైన పదాలు వాడుకలో ఉన్నాయి. అయితే ఆధునిక ప్రమాణ భాషలో ఇందులో విరివిగా ప్రచారంలో ఉన్న పదం ‘మొహం’. ఇక తెలంగాణ అంతటా ‘మొకం’ అనే పదమే బహుళ వ్యాప్తిలో వుంది. ‘మకం’వంటి పదాలు అనంతపురం జిల్లాలోని జానపదుల తిట్లలో కనిపిస్తాయి.

ఇప్పుడు ప్రధానంగా మన దృష్టి ‘మొకం’ మీదే పెట్టి ఆలోచిద్దాం. తెలంగాణ వ్యవహారంలో ఉన్న ఈ ‘మొకం’ ‘ముఖం’లోంచి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ‘మొకం’తో ముడిపడివున్న కొన్ని పదాలూ, పదబంధాలూ, సామెతలూ, నుడికారాలూ ప్రత్యేకించి పరిశీలించవలసి వుంది.

సాధారణంగా తెల్లవారున లేవగానే మనం దంతధావనం చేసుకుంటాం. దీన్నే పళ్ళు తోమడం అంటారు. అయితే తెలంగాణలో ఈ అర్థంలో ‘మొకం కడ్గుడు’ అని వ్యవహరిస్తారు. మొకం కడ్గుడు అనేదాంట్లో విస్తృతార్థం వుంది. అయినా ఆ మాటని పళ్ళు తోమడానికి వ్యవహరిస్తారు తెలంగాణీయులు. ‘మొహం మొత్తింది’ అనే మాటకు అర్థం-ఏదైనా ఒక విషయమ్మీద, వస్తువుమీద, అలవాటుమీద అయిష్టం ఏర్పడటం. తెలంగాణ ప్రాంతంలో ‘మొకం గొట్టింది’ అంటరు. (గ్యారలు తినీతినీ నాకు మొకం గొట్టినట్లయింది. ఇగ నాకు వద్దు). ‘మొత్తడం’ అనేది కొంత నిందార్థంలో వుంది. కానీ తెలంగాణలో ‘కొట్టుడు’లో ఆ నింద లేక హుందాగా వుంది. అవమాన భారంతో ‘తలదించుకొనే’ పరిస్థితుల్లో ‘వాడు మొకం నాలెకు ఏసిండు’ అంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని ‘తల’-తెలంగాణలో ‘మొకం’ అయ్యింది. ‘దించుకునటం’-‘నాలెకు ఏసుడుగా మారింది. ‘నాలె’ అంటే ‘నేల’.

ఈ మధ్య మరీ నల్లపూసవు అయ్యావు ఏందీ? అనే వాక్యం తెలంగాణలో ‘నెరీ నీ మొకం బంగారం అయ్యిందేమయ్యా?’ రూపంలో దాదాపుగా వుంది. నల్లపూస కావడమైనా, మొకం బంగారం అవడం అయినా తరచుగా ఈ మధ్య కనిపించడం లేదని అర్థం. మొకం బంగారం కావడం కాస్త మెరుగైన జాతీయం. కారణం.. నల్లపూసైనా కన్పించే అవకాశముందేమోకానీ బంగారం అరుదైన లోహం కదా! పైగా భద్రాచల రామదాసు కూడా ఓ చోట రాముణ్ణి ఉద్దేశించి ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’ అంటూ కీర్తన రాశాడు. ‘వాడు వాని మొహమ్మీదే ఎడాపెడా అనేశాడు’ అనే వాక్యంలో ‘మొహమ్మీద’ అనే దానికి సమానార్థకంగా తెలంగాణలో ‘మొకం పట్కొని’ అని వుంది. ‘వాడు వాన్ని, మొకం బట్కొని ఇయ్యరమయ్యర తిట్టిండు’ అనేది తెలంగాణ వ్యవహారం. ‘మొహమ్మీద తిట్టటం’కన్నా ‘మొకం బట్కొని తిట్టుడు’ మరింత ప్రభావాన్ని చూపుతుంది. అదెట్లా? మొహమ్మీద అన్నప్పుడు ఎదుటివాడు తన మొహాన్ని అటో యిటో తిప్పవచ్చు. మొకం పట్టుకోని తిట్టేటప్పుడు తిట్లుపడేవానికి ఆ అవకాశమే లేదు. ఇంకా ఈ ‘మొహమ్మీద అనడం’ అనేది తెలంగాణలో ‘మొకమ్మీదే’ కొట్టినట్లుగా మారింది. అంటే చెంప ఛెళ్ళుమనిపించేలా అనే!

‘మొహం అదోలా పెట్టుకోవడం, మొహం గంటు పెట్టుకోవడం’వంటి వాక్యాలు తెలంగాణలో ‘మొకమంత యింత దొడ్డు పెట్టుకొనుడు రూపంలో ఉన్నాయి. అలిగినప్పుడూ, అయిష్టంగా ఉన్నప్పుడూ, అసహనం ప్రదర్శించేటప్పుడూ సాధా రణంగా జనాలు వాళ్ళది ఏదో పోయినట్లు ‘మొకమంత యింత దొడ్డు పెట్టుకుంటరు’, తెలుగులోని ‘మొహం గంటు పెట్టుకో వడంలో ‘గంటు’ అనేది హిందీ గాంఠ్‌. అంటే మడి అని అర్థం. మొహం ముడుచుకోవడం అన్నమాట. ‘ముఖమంత చేసుకొను’ అనే తెలుగు మాటకి సంతోషంతో ముఖం వికసించడం’ అని అర్థం అయితే దీనికి సమానార్థకం తెలంగాణ తెలుగులో లేదు. తెలంగాణలో ‘మొకం తెలివి’ అనే పదబంధం వుంది. దీనికి అర్థం ‘తల ఎత్తుకొని తిరగడం. గౌరవంగా తిరగడం’ మా పెద్దోడు బాగా సంపాయించి బాకీలన్ని కట్టిండు నాకు నలుగుట్లె జెర్ర మకం తెలివి అయింది’వంటి వాక్యాల్లోని ‘మొకం’ తెలివికి గౌరవం, విలువ, ఆదరణ అనే అర్థాలున్నాయి. మొహం ఏ కారణంగానో వాచినట్లు ఉన్నప్పుడు ‘మొకం ఒదులకిచ్చింది. మొకం మీదికి వచ్చింది’ అనే అభివ్యక్తులు ఉన్నాయి. ‘ఒదులకివ్వడం’అంటే వదులొదులు అయ్యి ముఖం మునపటికన్నా ఉబ్బు కావడం. ‘మీదికి రావడం’ కూడా యిలాంటిదే! మొఖం ఉబ్బినప్పుడు అది ఎలాగూ కొంతపైకి వస్తుంది కదా!

తెలంగాణలో ‘మొకం లేకుంట అవుడు’ అనే నుడికారం వున్నది. దీనికి అర్థం ‘తల ఎత్తుకొని నలుగురిలో తిరుగలేక పోవడం. ఈ తలెత్తుకొని తిరగలేని స్థితి అవమానాన్ని, దీన, హీన స్థితిని సూచిస్తుంది. ఉన్న తలను పైకి ఎత్తుకొని తిరగలేని, అసహాయ పరిస్థితి, తెలంగాణ పలుకుబడిలోని ‘మొకమే లేకుంట అయ్యింది ‘మరింత ప్రభావోత్పాదకం, ఉన్న మొకం లేకుండా కావడం అంటే మామూలు పరాభవం కాదు.

ఇక ముఖానికి సంబంధించి తెలంగాణలో ఉన్న మరికొన్ని పదాలు చూద్దాం: ‘వాడు తెల్లమొకం ఏసిండు’ అంటే తెల్లబో యాడు, ముఖం వివర్ణమైపోయింది, మొహం పాలిపోయింది. కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు అనేవి సమానార్థకాలు. ‘నాకు నలుగుట్లె నల్లమొకం అయ్యింది’ అంటే అవమానం జరిగింది, గౌరవం పోయింది… మొదలైన అర్థాలు. ఈ తెల్లమొకం, నల్ల మొకాలు శిష్టవ్యావహారికంలో లేవు. తెలంగాణలో ‘నల్లమొకం పిల్లి ఎలుకపక్కల పన్నదట’ అని సామెత. పిల్లి ఎలుకలను పట్టాలి. అది పిల్లి జాతి గుణం. కానీ ఒక పిల్లి నల్లమొకం పిల్లి. అది సహజ స్వభావానికి విరుద్ధంగా ఎలుక పక్కలో పడుకున్నది. ఎంత దిగజారుడు తనం! ఎంత దివాళాకోరు గుణం!! ఎంత అసహ్యమైన స్థితి!! తెలంగాణలో ‘నీ మొకాన మొద్దులు పెట్ట’ అనే తిట్టుకు’ నీ మొహం తగలెయ్య. నీ ‘మొహం మండా’వంటి తిట్లు పశ్చిమగోదావరిలో వున్నై. అనంతపురంలో ‘నీ మొకాన అగ్గిపెట్ట’ నీ మొకానికి కొరివిపెట్ట’వంటి చీవాట్లు వున్నై. తెలంగాణలో యింకా ‘నవ్వు మొకం, కోల మొకం, చిలుక మకం, ఎడ్డి మొకం, కడగల్ల మొకం’వంటి అనేక పదబంధాలున్నాయి. ఇట్లా ముఖానికి సంబంధించిన పదబంధాలు తెలంగాణలో బహుముఖాలుగా పలురకాలుగా వుండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

డా|| నలిమెల భాస్కర్‌

Other Updates