tsmagazine

డా||అయాచితం నటేశ్వరశర్మ
ప్రతి యేడాది సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినాన ‘మకర సంక్రాంతి’ పర్వదినం సంభవిస్తుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మాసానికొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. మేషరాశి మొదలుకొని మీన రాశి వరకు పన్నెండు రాశులలోనికి క్రమంగా ప్రవేశించే పుణ్యదినాలను సంక్రాంతులని పిలుస్తారు. కనుక ప్రతినెలా ఒక సంక్రాంతి ఏర్పడుతుంది. కానీ ఇతర సంక్రాంతులకులేని విశిష్టత ఒక్క మకర సంక్రాంతికే ఎందుకు ఉంది? అని సందేహం కలుగక మానదు. సూర్యుడు కర్కాటకరాశి మొదలుకొని మకర సంక్రాంతి వరకు దక్షిణాభిముఖంగా సంచరిస్తాడు. అందువల్ల దీనిని దక్షిణాయనం అని పిలుస్తారు. తిరిగి మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తాడు. కనుక ఇది ఉత్తరాయణంగా ప్రసిద్ధి చెందింది.

అయితే దేవతలు దక్షిణాయనంలో నిద్రిస్తారనీ, ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారనీ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగా దేవతలు నిద్రించే ఆరు మాసాలు పుణ్య కార్యాలకూ, శుభ కార్యాలకూ అనువైన సమయాలు కావని శాస్త్రవాక్యం. అందువల్ల ఉత్తరాయణానికి ముఖద్వారమైన మకర సంక్రాంతి పవిత్రదినంగా, శుభకార్యాలకు ఆరంభదినంగా లోకం భావిస్తోంది. అందుకే మకర సంక్రాంతి మహాపర్వదినంగా మారింది.

మకర సంక్రాంతి మూడు దినాల పండుగగా కనబడుతుంది. సంక్రాంతికి ముందురోజు భోగి. సంక్రాంతికి మరుసటిరోజు కనుమ. ఇలా సంక్రాంతి మూడు దినాలు జరుపుకొనే సంప్రదాయం వ్యాప్తి చెందింది.

భోగం కలిగింది భోగి. భోగం అంటే దేవతలకు నివేదించే మధురాన్నం. దానిని దేవతల ప్రీతికొరకు మానవులు సమర్పించడం పరిపాటిగా మారింది. కొన్ని ప్రాంతాలలో భోగినాడు భోగిమంటలు మండిస్తారు. అలా మండించడం వలన పితృలోకాలలో ఉండే పితృ దేవతలకు చీకటినుండి విముక్తి కలుగుతుందని, వారికి వెలుగులు కనబడుతాయని ఒక నమ్మకం. అంతేగాక చలి బాధతో శరీరం ముడుచుకొనిపోతుంది కనుక రక్త ప్రసరణ సరిగా ఉండక శరీరంలో అనారోగ్యాలు పేరుకొనిపోకుండా ఉష్ణతాపం చక్కగా శరీరాన్ని రక్షిస్తుందనీ, రక్త ప్రసరణ బాగా జరుగుతుందనీ ఆరోగ్యపరంగా భోగి మంటలు విశేషంగా కనబడుతాయి. కనుక భోగి పండుగ ప్రకృతి నుండి రక్షణకొరకు చేసేదిగా కూడా కనబడుతుంది. భోగినాడు దేవాలయాలను సందర్శించి దేవతలకు విశేష భోగాలను (పూజలనూ, నివేదనలనూ) సమర్పించడం సంప్రదాయం. చిన్నపిల్లల శిరస్సులపై రేగుపళ్ళు, బియ్యం కలిపి భోగిపండ్లు (బోడపండ్లు) పోయడం పరిపాటి.

మకర సంక్రాంతి విశేష పర్వదినం. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పుణ్యదినాన సూర్యునికి అర్ఘ్యాలు (జలాంజలులు) ఇవ్వడం, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం పరిపాటి. దక్షిణా యనం నుండి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తున్నందున శరీరం కూడా సమతౌల్యాన్ని కలిగి ఉండేందుకు నువ్వులు కలిపిన చక్కెరను తినడం, బెల్లంతో కలగలిపి చేసిన నువ్వుల లడ్డూలను తినడం కనబడుతుంది. ఈ దినాన నెయ్యిని, కంబళ్లనూ, బెల్లాన్నీ, దానం ఇవ్వడం, ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులను వేయడం సంప్రదాయం. సూర్యుని రథాన్ని ముగ్గుగా వేసి, దానిపై పేడతో చేసిన గొబ్బెమ్మలను, నువ్వులు, బియ్యం, చెరుకు గడలను ఉంచడం ప్రతి ఇంటిలో కనబడే దృశ్యం.

మకర సంక్రాంతి పితృదేవతలకు సైతం ప్రీతి పాత్రమైన పండుగ. ఈ దినాన జనులు పితృదేవతల ప్రీతికొరకు కూరగాయలనూ, ధాన్యాలనూ, దక్షిణలనూ దానాలు చేస్తారు. అలా చేస్తే ఆ పుణ్యఫలం పితృదేవతలకు చేరుతుందనీ, వారు పితృలోకాలలో ఆనందిస్తుంటారని అందరూ నమ్ముతారు. స్త్రీలుకూడా ఈ పుణ్యదినాన వస్త్రాలను దానం చేయాలని పురాణాలు ప్రబోధిస్తున్నాయి. మకర సంక్రాంతి సూర్యుణ్ణి ఉద్దేశించి చేసే మహా పర్వదినం. సూర్యుడు మానవ ప్రపంచానికి నేత్రం వంటివాడు. అతడు లేకుంటే ప్రపంచానికి వెలుగు ఉండదు. వెలుగులేకుంటే మనిషి భూమండలంపై జీవించలేడు. అంతేకాదు, సూర్యుడే మానవాళికి ఆరోగ్య ప్రదాత. అందుకే ఆదిత్య హృదయంవంటి స్తుతులు సూర్యుని ఆరాధనలో విశేషస్థానాన్ని అలంకరిస్తున్నాయి. సూర్యకాంతి వలననే ప్రకృతి వికసిస్తుంది. సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మేఘాలు ఏర్పడుతాయి. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. చెట్లు పెరుగుతాయి. మానవుల జఠరాగ్ని ఆరిపోకుండా ఉంటుంది. శరీరావయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. కనుక మకర సంక్రాంతి ఆరోగ్యకారకమైన పండుగగా కూడా విరాజిల్లుతున్నది.

సంక్రాంతినాడు పిల్లలు ఆకాశంలోకి పతంగులను ఎగురవేస్తారు. పతంగులను గాలిపటాలని పిలుస్తారు. ఇవి పక్షుల్లా ఆకాశంలో ఎగురుతూ ఉంటే పిల్లలకూ, పెద్దలకూ అమితానందం కలుగుతుంది. చిన్నాపెద్దా అనే భేదం లేకుండా అన్ని వయస్సులవాళ్లూ ఈ పతంగులను ఎగురవేస్తూ ఆనందిస్తారు. చక్కగా పిండివంటలు వండుకొని, విందులు జరుపుకొంటారు.

సంక్రాంతి మరుసటిదినం కనుము. ఇది రైతులకు ఎంతో ముఖ్యమైన పర్వదినం. వ్యవసాయమే ఆధారమైన మన దేశంలో ఈ కనుమనాడు వ్యవసాయ పరికరాలను చక్కగా అలంక రించడం, పశుసంపదకు పూజలు చేయడం, వ్యవసాయానికి ఉపయో గపడే ఎడ్లబండ్లను రంగురంగుల కాగితాలతో అలంకరించడం, పూజించ డం కనబడుతుంది. ఈ పర్వదినాన వ్యవసాయదారులందరూ తమ ఇండ్లలో చక్కగా పూజాదికాలు నిర్వహించుకొని, ఎడ్లబండ్లపై ఊరేగుతూ గ్రామవీధులలో తిరగడం, ప్రధానకూడళ్లలో ఎడ్లబళ్లను ప్రదర్శనగా ఉంచడం పరిపాటి.

ఇలా సంక్రాంతి పండుగ పూర్వాపరాలలోనూ ఎంతో పరమార్థాన్ని కలిగి, మానవాళికి క్షేమాన్నీ, అభివృద్ధినీ ప్రసాదిస్తోంది. పండుగలన్నీ ఒకవిధంగా ప్రకృతి ఆరాధనలే. ప్రకృతి లేనిదే మనిషి లేడు. మనిషి లేకుంటే ప్రకృతికీ అందంలేదు. ఇలా బ్రహ్మసృష్టిలో మానవాళికి సకల శుభాలూ కలిగేవిధంగా అనాదిగా ఈ పండుగలు ఏర్పడ్డాయి. పండుగ అనే భావన ముఖ్యంగా మనిషిలో అమితానందాన్నీ, మంగళాన్నీ ప్రసాదించడంవలన పండుగలు మానవ జీవితాలలో అవిభాజ్యాలై అలరిస్తున్నాయి. పండుగ గతానికీ, వర్తమా నానికీ, భవిష్యత్తుకూ శుభ సంకేతాలను అందిస్తుంద నడంలో ఎలాంటి సందేహం లేదు.

Other Updates