rachakondaతెలంగాణలో వెలిసిన అలనాటి ఎన్నెన్నో అద్భుత చారిత్రక ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన పలు చారిత్రక కట్టడాల రూపంలో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలించినప్పుడు మన తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో, ఎన్నెన్ని వైభవాలని చవి చూసిందో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యతను కాకతీయులు ఇచ్చిన కోవలోనే రాచకొండ వెలమ రాజులు కూడా ఇచ్చారు.

వెలమరాజుల ఏలుబడిలో వైభవంగా పాలింపబడి, శత్రుదుర్భేధ్యంగా తీర్చిదిద్దబడిన కోట రాచకొండ కోట. ఈ కోటలో నైపుణ్యతకు, సాంకేతిక నిర్మాణానికి కొదవే లేదు. శత్రువు రాకలను పసిగట్టి ఎక్కడికక్కడ వారిని మట్టుబెట్టే విధంగా వైవిధ్యంగా నిర్మించబడిన ఈ కోట నిర్మాణ తీరు అద్భుతం. ఎత్తయిన కొండలపై ఎంతో పటిష్టంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ 40 కి.మీ. పొడవైన ఎత్తయిన రాతి గోడ, భారీ గ్రానైట్‌ రాళ్ళతో, పలు మలుపులతో ‘ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ను తలపించే విధంగా నిర్మించారు. 12వ శతాబ్ధం నుండి కాకతీయ రాజులకు సామంతులుగా ఉన్న రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు 14వ శతాబ్ధంలో ఈ కోట నిర్మాణానికి పునాది వేసాడు. ముస్లిం రాజులైన బహుమనీసుల్తానులకు, హిందూ రాజులైన విజయనగర రాజులకు మధ్య రాచకొండ రాజ్యం కొంతకాలం పాటు ఇరు మతస్తులకు వారధిగా నిలిచి మత సమైక్యతకు, సామరస్యతకు కృషి చేసింది.

1433లో ఈ కోటను బహుమనీ సుల్తానులు అత్యంత పాశవికంగా జరిగిన ఘోర యుద్ధంలో స్వాధీనం చేసుకున్నారు. 1480 నుండి బహుమనీ గవర్నరుగా వ్యవహరించిన శితాబ్‌ఖాన్‌ 1503లో బహుమనీలను ధిక్కరించి స్వాతంత్య్రం ప్రకటించుకొని రాచకొండ కేంద్రంగా తన పాలన కొనసాగించాడు. వరంగల్‌, ఖమ్మం కోటలను కూడా జయించిన శితాబ్‌ఖాన్‌ పాలనలో 1503 నుండి 1512 వరకు కోటలోని పలు ఆలయాలు ధ్వసం చేయబడ్డాయి. చారిత్రక వారసత్వంగా నిర్మించబడిన అనేక అద్భుతాలు నేల మట్టం చేయబడ్డాయి. అయినా నేటికీ కొన్ని గొప్ప ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయంటే అవి నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం.

రాజు వుండే అంతఃపురం సంకెళ్ళభావి చుట్టూ గోడను పఠిష్టంగా నిర్మించారు. దీన్ని ‘రాజుగారి గుట్ట’ అని కూడా పిలుస్తారు. సుమారు 10 గుట్టల నడుమ శత్రుదుర్భేధ్యంగా పకడ్బంధీగా రాజుగారి కోటను నిర్మించారు. దుర్భేద్యమైన ఈ కోటలో నిర్మించిన నాలుగు ప్రధాన ద్వారాలలో 24 గంటల పాటు పహారా ఉండేది. శత్రువులు ఎవరు ఈ గోడలను దాటుకుని కోటలోకి వచ్చే వీలు లేకుండా నిర్మాణం ఉంది. వెయ్యేళ్ళ క్రితం నిర్మించిన ఈ కోటలోని రాళ్ళ వరుస మాత్రం నేటికీ చెక్కు చెదరలేదు, చరిత్రలో కలిసిపోలేదు. కోట గోడకు పేర్చిన బండరాళ్ళు జారిపోకుండా వుండేందుకు ఒక చిన్న కొచ్చటి రాయిని వీటి క్రింది భాగంలోని రాతి వరుసలకు ఆధారంగా అమర్చిన తీరు ఆనాటి శిల్పుల అద్భుత సాంకేతిక ప్రతిభను మన కళ్ళ ముందు వుంచుతుంది.

కోట ప్రహరీ గోడ నుండి కోట అంతఃపురానికి చేరుకోవడానికి కనీసం మూడు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వుంటుంది. ఆ 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఎన్నెన్నో అద్భుత నిర్మాణాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంతఃపురానికి వెళ్ళేందుకు ప్రధానంగా రెండు రహదారులున్నాయి. నడిచి వెళ్ళే వారికి మెట్ల మార్గం, నిర్మించారు. అలాగే రాజులు, ఆయన వెంట వుండే పరివారం మంత్రి వర్గం వారు గుర్రాలపై వెళ్ళడానికి అనువుగా చదునుగా వుండే మరో మార్గం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. కోటలోనికి ప్రవేశించిన కొత్తవారికి మరియు శత్రువులకు ఏమాత్రం అర్థం కాని రీతిలో గజిబిజిగా ఆ మార్గాలను నిర్మించారు. ఇందు వల్ల వెళ్ళాల్సిన మార్గం తెలియక వారు తికమక పడుతున్న సమయంలో రాచకొండ సైనికులు వాళ్ళపై దాడి చేసి మట్టుబెట్టేవారు. మర ఫిరంగులతో దాడి చేయడానికి నిర్మించిన బురుజుల వంటి అనేక నిర్మాణాలు కోట చుట్టూ అనేకంగా మనకు కనిపిస్తాయి.

ఈ దారులన్నీ కూడా తికమకగా, జిగ్‌జాగ్‌గా వుండి, నాలుగు వరుసల గోడలతో వుంటాయి. నాలుగు మలుపులు తిరిగిన తరువాత మనకు మొదటి ప్రధాన ద్వారం ఎదురవుతుంది. ఈ విధంగానే మిగతా రెండు ప్రధాన ద్వారాలు కూడా జిగ్‌జాగ్‌ మలుపులతో వుంటాయి. ఈ మూడు ప్రధాన ద్వారాలు దాటిన తర్వాత రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళలేడు. ఇలాంటి తికమక మార్గాలు కోటలో అనేకంగా మనకు కనిపిస్తాయి. సంకెళ్ళ బావి ప్రాంతంలో సహజంగా వున్న రాళ్ళను ఏమాత్రం కదిలించకుండా నిర్మించిన రాతికోట నిర్మాణం శిల్పుల అద్భుత ప్రతిభకు నిదర్శనం. ప్రతి సెక్యురిటీ పాయింట్‌ వద్ద ఒక రాతి రోలు మనకు కనిపిస్తుంది. అంటే ఇది సైనికుడి పహారా ప్రాంతమని సూచిక 7, 8 శతాబ్ధాల కాలంలో రాచకొండను ‘రాజాచలం’గా పిలిచేవారని చరిత్రకారులు అంటారు. ‘చలం’ అంటే ‘కొండ’. ‘రాజా చలం’ అంటే ‘రాజు పాలించిన కొండ’ అని అర్థం. ఇదే కాలక్రమంలో ‘రాచకొండ’గా మారింది. ‘భద్రాచలం, సింహాచలం, శేషాచలం, అరుణాచలం’ ఏ విధంగా అయితే పుణ్యక్షేత్రాలయ్యాయో ‘రాజాచలం’ కూడా అలనాడు పుణ్యక్షేత్రాల కేంద్రంగా విలసిల్లిందని చరిత్రకారులు భావిస్తారు.

ఒక విధంగా చెప్పాలంటే ఇది రాచకొండ కాదు ‘రతనాల కొండ’. ఎందుకంటే ఈ కొండలోని ప్రతి రాయికి ఒక చరిత్ర వుంది. భూమికి 600 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఒక అద్భుత కోట నిర్మాణం మన తెలంగాణ ప్రాంతంలో రాజధానికి అతి దగ్గరలో కొలువుదీరి వుంది. రాజు నివసించే అంతఃపురంలోకి అడుగుపెట్టేముందు మూడు సెక్యురిటీ (గస్తీ) పాయింట్లను దాటవలసి వుంటుంది. వీటిని దాటడం అంటే దాదాపు ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెప్పవచ్చు. అశ్వశాలలు, గజశాలలు, సైనికుల విశ్రాంతి గదులు కూడా ఇదే ప్రాంతంలో కనిపిస్తాయి. నాటి కాలంలో తరచుగా రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. రాజ్య విస్తరణ కాంక్ష రాజుల్లో ఎక్కువగా ఉండేది. కాబట్టి ఆయా రాజులు తమ రాజ్య రక్షణ కోసం అనేక రక్షణ చర్యలు చేపడుతూ శత్రు దుర్భేధ్యంగా తమ కోటలను నిర్మించుకునేవారు. దానికి తార్కాణం ఈ రాచకొండ కోట. రాచకొండ కోట నిర్మాణ కాలం నుండి తన ప్రత్యేకతను నింపుకుంది. ఇతర రాజ్యాలకన్నా ఇది చిన్న రాజ్యమే అయినా సాహిత్య, కళా పోషణలలో ఆ పెద్ద రాజ్యాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అటు కళలని, ఇటు సాహిత్యాన్ని పోషించటంతో బాగా ప్రసిద్ధిగాంచింది. రాచకొండ చివరి రేచర్ల ప్రభువు 3వ సర్వజన సింగ భూపాలుడి పాలనలో ఇక్కడి సాహిత్య కళా పోషణలు శిఖరాయమానమై తెలుగు వైభవానికి, శోభకు కారణమయ్యాయి.

ఇక్కడి దేవాలయాలు, వాటి నిర్మాణ తీరు తెన్నులను చూస్తే ‘రాజాచలం’ ప్రాంతమంతా ఆనాడు భక్తి కేంద్రంగా వర్ధిల్లినట్టు భావించవచ్చు. కోటలో ఎటు చూసినా మనకు శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ప్రతి ఆలయంలోనూ శివలింగం, వీరభద్రుడు, గణపతి విగ్రహాలున్నాయి. కానీ అవన్నీ నేడు శిథిలావస్థ కుచేరుకున్నాయి. ఆలయ నిర్మాణ శైలి తీరుతెన్నులు చాలా అద్భుతంగా కళాత్మకంగా వుంటుంది. ఈ నిర్మాణాలను చూస్తే ఆనాటి రాచకొండ రాజులు శైవులని, ఆలయాల నిర్మాణాలపై వారు ప్రత్యేక దృష్టిని సారించారని అనేది అర్థమవుతోంది. 15వ శతాబ్ధానికి చెందిన వినుకొండ వల్ల భాచార్యుల వారి ‘క్రీఢాభిరామం’లో ఓరుగల్లు మరియు రాచకొండల వైభవాన్ని చక్కగా వర్ణించారు.

గర్భగుడి నుండి మండపం వరకు ఇక్కడ నిర్మించిన ప్రతి శిలపైన శిల్పులు చెక్కిన అద్భుతమైన కళాఖండాలున్నాయి. ఆలయాల వెనుక రాతి శిలలపై చెక్కిన ప్రకృతికి సంబంధించిన అనేక చిహ్నాలు కనిపిస్తాయి. వాస్తు రీత్యా ఆలయాన్ని చాలా విభిన్నంగా నిర్మించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయాలకి ఎలాంటి ఆదరణ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో మాత్రం ‘రాచకొండ రక్షణ సమితి’ ఇక్కడ దీపారాధన ప్రారంభించింది. ఇక్కడి శివాలయాల్లో మహా శివరాత్రి సందర్భంగా స్థానిక భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

కోటలో భోలే సాహెబ్‌ అనే వీరయోధుడి సమాధి మనకు కనిపిస్తుంది. రాచకొండను శత్రువుల నుండి కాపాడేందుకు తన ప్రాణాలు తృణప్రాయంగా త్యజించిన వీరయోధుడి సమాధి ఇది. ఈ సమాధి ప్రాంగణ ప్రాంతంలో దీపం ఎప్పుడూ వెలుగుతూనే వుంటుంది. రాజ ప్రసాదాల్లో నిర్మించిన అనేక నిర్మాణాల్లో ఒక పడక గది, దానికి ఆనుకుని స్నానాల గది, ముందు భాగంలో ఒక పెద్ద దర్బారు హాలు వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. అతిథుల కోసం నిర్మించిన పలు నివాసాలు కూడా మనకు కనిపిస్తాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అద్భుత నిర్మాణాలు చూస్తే అవి చాలా బలిష్ఠంగా అత్యంత పటిష్టంగా నిర్మించారని మనం ఊహించవచ్చు. రాజుగారి గుట్టపై ఇప్పటికీ 5 రాతి ఇంటి నిర్మాణాలు వున్నాయి. వీటికి ఎదురుగా ఒక ఈత కొలను కూడా వుంది. సహజంగా వున్న నీటి ఒంపును ఇలా నీటి కొలనుగా మార్చారు ఆనాటి నిపుణులు. ఏ కాలంలోనైనా ఈ కొలనులో నీరు ఉంటుంది. ఇది రాజ కుటుంబీకుల త్రాగునీటి అవసరాలను తీర్చిన మంచినీటి భావిగా చెబుతారు చరిత్ర కారులు. దీనికి కూతవేటు దూరంలో రాజ ప్రసాదం వుంది. ఈ గృహ సముదాయంలో జామపండ్ల చెట్లను ఇప్పటికీ మనం గమనించవచ్చు. కోటలో నాటి రాజులు పండ్ల తోటలను, పుష్ప వనాలను పెంచి కళాత్మకంగా తీర్చిదిద్దారని కోటలోని ప్రజలకు ఎటు చూసినా ఆహ్లాదంగా ఉండేదని అంటారు చరిత్రకారులు. అలాగే ఈ ప్రాంతంలో వారు పెంచిన అరుదైన పళ్ళజాతి వృక్షాలున్నాయి. ఈ పండ్లను రాజు కుటుంబీకులు తమ భోజన అనంతరం ఆరగించేవారని కథనం. ఈ పండ్లు రాచకొండలో తప్ప ఇంకెక్కడా మనకు దొరకవు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ చెట్లు పళ్ళను అందిస్తూనే వున్నాయి. అలాగే ఈ ప్రాంత సమీపంలో రాజ గృహ సముదాయాలు అనేకం కనిపిస్తాయి. అయితే అవన్నీ శిథిలమై మనకు కనిపిస్తాయి. వీటి సమీప ప్రాంతంలో మరుగుదొడ్ల వంటి నిర్మాణ ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. గుప్త నిధుల కోసం దుండగులు రాజగృహాన్ని కోటలోని అనేక గొప్ప కట్టడాలను మొత్తంంగా ధ్వసం చేశారు. రాజనివాసం నుండి నేరుగా గుడివైపుకు మెట్ల మార్గం వుంది. ఈ రాజగృహానికి సంబంధించిన రహస్యాలు, వీటికి సంబంధించిన ఇతర విషయాలు ఇక్కడివారికి తప్ప ఇతరులకు వీటి గురించి అంత అవగాహన కూడా లేదు. రాజుగారి గుట్టకు ఎదురుగా వున్న మరో గుట్టపై మంత్రులకు సంబంధించిన నివాస మందిరాలు మనం చూడవచ్చు. ఆరోజుల్లోనే ఇక్కడ సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పరుకున్నారు. ఇప్పటికీ ఇవి కాలానికి ఎదురొడ్డి నేటికీ తమ వునికిని చాటుతున్నాయి.

రాజ ప్రసాదం వెనుక భాగంలో అంతుబట్టని ఒక నిర్మాణం వుంది. దీనిని సంకెళ్ళబావి అని కూడా అంటారు. ఇరుకైన ఈ సంధుబావి లోతు గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు. ఈ బావిలో గుప్తనిధుల యొక్క నిక్షేపాలు వున్నట్లు స్థానికుల కథనం. దీంట్లో దిగడానికి ప్రయత్నించి చాలామంది చావును కొని తెచ్చుకున్నారని స్థానికుల కథనం. అలాగే ఆరోజుల్లో శత్రు సైనికులను వారు చేసిన తప్పులకు శిక్షగా ఈ బావిలో సంకెళ్ళతో బంధించి పడేసేవారని కథనం. రాచకొండ గుట్టల్లో ఈ బావిది ప్రత్యేక చరిత్ర. రాజుగారి గుట్ట ప్రాంతంలో వసంతోత్సవ కళా భవనం వుంది. యేటా గ్రీష్మ ఋతువులో ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వసంత ఉత్సవాలను సంబురాలను నిర్వహించేవారు. రాచకొండ రాజులు వ్యవసాయానికి పెద్దపీట వేసారని కథనం.

ఈ ప్రాంగణంలో మహిళలు, పురుషులు విందు వినోదాలతో ఆనందించేవారని కథనం. ఈ వేడుకల్లో అలనాడు రాజపరివారంతోబాటు మంత్రులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకునేవారు. సాధారణ ప్రజానీకం కోసం మరో కళాభవనాన్ని నిర్మించారు. ఈ కట్టడాల స్తంభాల నిర్మాణాలపై కాకతీయ వంశస్తుల రాజముద్రలు కనిపిస్తాయి. కొండపై వున్న అంతఃపురానికి నేరుగా నీరు వచ్చేవిధంగా కిందినుండి నీటి మార్గాలను సృష్ఠించారు. దీన్నిబట్టి చూస్తే వారి సాంకేతిక నైపుణ్యం ఎంత ప్రతిభావంతమైందో ఊహించవచ్చు. ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో సామాన్య, భౌతిక సూత్రాలను అమలు చేసి నాటి శిల్పులు విజయవంతమయ్యారు. ఇవన్నీ ఆనాటి మన తెలంగాణ ప్రాంత వైభవానికి ఘన సాక్ష్యాలుగా నేటికీ మన కళ్ళ ముందు నిలబడి వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాచకొండ నిండా అన్ని అద్భుతాలే. ఆ అద్భుతాలని, ఆ గొప్ప చరిత్రని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. హైదరాబాద్‌ నుండి నాగార్జున సాగర్‌కు వెళ్ళే ప్రధాన మార్గంలో ఇబ్రహీం పట్నం మండలంలోని మంచాల గ్రామానికి 7 కి.మీ. దూరంలోనూ, తిప్పాయి గూడ గ్రామానికి 4 కి.మీ. దూరంలోనూ ‘రాచకొండ కోట’ ఉంది. రాజధాని హైదరాబాద్‌కు కేవలం 30 కి.మీ. దూరంలో వున్న ‘రాచకొండ కోట’ ప్రాంతంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాలను కేటాయించింది. తద్వారా రాచకొండ కోట గొప్ప పర్యాటక కేంద్రంగా భాసిల్లడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కోటను సందర్శించే పర్యాటకుల కోసం కొన్ని వసతి సౌకర్యాలను తెలంగాణ పర్యాటక శాఖ కల్పిస్తే ‘రాచకొండ కోట’ పర్యాటకులతో కళ కళలాడటమేగాక ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది.

Other Updates