rajeevsarmaపదవీ విరమణ వీడ్కోలు సభలో సి.ఎం కె.సి.ఆర్‌

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌ శర్మ ఎంతో కృషిచేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రశంసించారు. రాజీవ్‌ శర్మ పదవీ విరమణ సందర్భంగా నవంబరు 30న సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, రాజీవ్‌ శర్మ సేవలను కొనియాడారు. ” విడిపోయామనే దుగ్దతో ఏ.పి నుంచి వింత పేచీలు. ఉదయం ఒకటి.. సాయంత్రం ఒకటి వస్తున్న వింత సమస్యలతో విపత్కర పరిస్థితి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం… ఏమీ లేని తరుణం. అంచనాలు అసలే లేవు. రెండు రోజుల ముందు ఢిల్లీలో రాజీవ్‌ శర్మను కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వుండాలని కోరాను. హుటాహుటిన హైదరాబాద్‌ వచ్చారు. జూన్‌ ఒకటోతేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మరుసటి రోజు అధికారికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రారంభ దశ. ఉదయం 8 గంటలకు నేను, మంత్రివర్గం, ప్రమాణ స్వీకారం చేశాం. అతి తక్కువ సమయంలో రాజీవ్‌ శర్మ ఈ కార్యక్రమాలకు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ” అని ఆనాటి విషయాలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు,

”రాష్ట్ర ఆవిర్భావం నుంచి అన్ని సమస్యలను ఆయన ఓపికగా అధిగమించారు. మన అనుభవాలు, విధానాలను ఇతరులు అమలుచేసేలా.. రెండున్నరేళ్ళలో 10, 12 అవార్డులు వచ్చేలా అయన అనితర కృషిచేశారు” అని ముఖ్యమంత్రి అన్నారు. విడిపోయామనే దుగ్దతో అవశేష ఆంధ్రప్రదేశ్‌ నుంచి అధికారుల పంపిణీ, కరెంటు ఇచ్చే విషయంలో అనేక పేచీలు, సవాళ్ళు వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల లోనూ రాజీవ్‌ శర్మ ఏ.పి సి.ఎస్‌ తోను, ఢిల్లీలోని హోమ్‌ సెక్రటరీతోనూ మాట్లాడుతూ, ఎంతో ఓపికగా సమస్యలను పరిష్కరించారని, పాలనను గాడిలో పెట్టేందుకు మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.

”కొన్ని ఘట్టాలు తల్చుకుంటే ఆనందం వేస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులో చేద్దామంటే, ఎలా సాధ్యమని కొందరు అన్నారు. రాజీవ్‌ శర్మకు చెప్పి, ఈ పద్ధతిలో చేస్తే విజయం సాధిస్తామని అంటే అంగీకరించారు. ఆయన నాయకత్వంలో అది ఎంత విజయం సాధించిందో మనందరకూ తెలుసు. ఇటీవల హర్యాణా అధికారులు సమగ్ర కుటుంబ సర్వే ఏలాచేయాలనే వివరాలను తెలుసుకొనేందుకు రాజీవ్‌ శర్మను కలిసివెళ్ళారు. కొత్తజిల్లాలు, డివిజన్ల ఏర్పాటులోనూ ఆయన ఎంతో ఓపికగా పనిచేశారు ” అని సి.ఎం అన్నారు.

ప్రధాన సలహాదారుగా నియామకం

పరిపాలనలో అపార అనుభవంగల రాజీవ్‌ శర్మ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, అందుకే ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సభా ముఖంగా ప్రకటించారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు, మంత్రి వర్గ సహచరులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రదీప్‌ చంద్ర, పలువురు సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌లు, ఐ.పి.ఎస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరపురాని గౌరవం: రాజీవ్‌ శర్మ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించడం ప్రభుత్వ అధికారిగా గొప్పవిషయంగా భావిస్తున్నానని రాజీవ్‌ శర్మ అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తనను గుర్తుంచుకొని, ఇంతటి సముచిత గౌరవం అందించడం అదృష్టమని, ఇది సివిల్‌ సర్వీసెస్‌కే గొప్పగుర్తింపు అని అన్నారు.

తనకు జరిగిన ఘన వీడ్కోలుకు ఆయన కృత జ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ అభివృద్ధికి ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు నిరంతరం పాటుపడు తున్నారని, ఇలాటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు అప్పగించడం మరపురాని గౌరవంగా భావిస్తున్నాని రాజీవ్‌ శర్మ తెలిపారు. ప్రభుత్వ అధికారిగా తన ప్రయాణం ప్రారంభమైంది తెలంగాణలోనేనని, తిరిగి ఇక్కడే పదవీ విరమణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు.

తెలంగాణ సిద్ధించాక ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ అనేక అద్భుత పథకాలకు శ్రీకారం చుట్టారని, అన్ని పథకాలు విజయవంతం అయ్యాయంటే వాటి వెనుక అందరికృషి ఉన్నదని అన్నారు. సరైన సమయంలో సముచిత సహకారం, సలహాలు ఇచ్చిన అందరికీ రుణపడి వుంటానని రాజీవ్‌ శర్మ చెప్పారు. కలెక్టర్లు ఉత్సాహంగా పనిచేశారని, కొత్త జిల్లాల ఏర్పాటు సంతృప్తినిచ్చిందని , కొత్త జోష్‌ తో పనిచేశాం. తెలంగాణకు సాలిడ్‌ ఫౌండేషన్‌ వేశాం అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా నియమితులైన రాజీవ్‌ శర్మ డిసెంబరు 6వ తేదీన సచివాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరిం చారు.

Other Updates