rajbhavanసోమాజీగూడలోని రాజ్‌భవన్‌ ఆవరణలో రాజ్‌భవన్‌ సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన గృహాల సముదాయాన్ని గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావులు మార్చి 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాస్తు, శాంతి, సుదర్శన హోమాలు నిర్వహించారు.

రాజ్‌ భవన్‌ సిబ్బంది కోసం ఈగృహ సముదాయానికి గత ఏడాది ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన పుట్టినరోజు నాడు శంకుస్థాపన చేశారు. కేవలం 13 నెలలలో ఈ గృహనిర్మాణ సముదాయ నిర్మాణం పూర్తిచేశారు. ఆరు దశాబ్దాల క్రితం, 1956లో నిర్మించిన రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకోవడంతో ఈ నూతన గృహ సముదాయాన్ని నిర్మించారు. 2.70 ఎకరాల విస్తీర్ణంలో 152 ప్లాట్లు నిర్మించారు. ఇక్కడే ఓ పాఠశాల, కమ్యూనిటీ హాలు కూడా నిర్మిస్తున్నారు. విశిష్ట వసతులతో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ గృహ సముదాయానికి పూర్తిగా సోలార్‌ విద్యుత్‌ సరఫరా చేయడం విశేషం. సమృద్ధి పేరుతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కలియదిరిగి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం శాఖామంత్రి నాయిని నరసింహా రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ. సింగ్‌, రాజ్‌ భవన్‌ సెక్రటరీ హర్‌ ప్రీత్‌ సింగ్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, తదితరులకు గవర్నర్‌, ముఖ్యమంత్రి శాలువాలతో సత్కరించి, మెమొంటోలు బహూకరించారు.

Other Updates