cm-3సీఎం ప్రకటన

దేశ రక్షణకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలపట్ల యావత్‌ సమాజం సానుభూతితో ఉండాలని, ఆ కుటుంబ పోషణ బాధ్యత దేశం స్వీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. సైనికులు, మాజీ సైనికులు, వీర సైనికుల కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర పరిధిలోని అంశాల విషయంలో ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉండి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపట్ల, వారి సమస్యలపట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని సీఎం అన్నారు. సర్వీసులో ఉన్నప్పుడే కాకుండా, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారిపట్ల గౌరవం చూపించాలని అన్నారు. మిలటరీ ఉద్యోగులు, వీర సైనికుల కుటంబ సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై డిసెంబర్‌ 23న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పోలీసు ఉన్నతాధికారులు నవీన్‌చంద్‌, ఎంకే సింగ్‌, టీఎన్జీవో సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మిలటరీలో పనిచేసి రిటైర్‌ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్‌ పెన్షన్‌ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మిలటరీలో పనిచేసి రిటైర్‌ అయి, మరో ఉద్యోగం చేసి విరమణ పొందిన వారికి కేవలం ఒకే పెన్షన్‌ పొందే అవకాశం ఇప్పటి వరకున్నది. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనికోద్యోగులు పనిచేస్తే, మిలటరీ ఇచ్చే పెన్షన్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర సర్వీసు నిబంధనలను అనుసరించి పెన్షన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీని ప్రకారం సదరు మాజీ సైనికోద్యోగి మిలటరీ నుంచి వచ్చే పెన్షన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌కూడా పొందే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు.

సైనికులు నిర్మించుకున్న నివాసాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సదరు నివాస గృహం సైనికుడి పేరుమీద ఉన్నా, సైనికుడి భార్య పేరు మీదున్నా, ఎన్ని అంతస్తులున్నా సరే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అధికారులు దీని ప్రకారం నడుచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వీర సైనికుల భార్యలకు (యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు-వార్‌ విడోస్‌) రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే పెన్షన్‌ రూ. 3వేలనుంచి రూ. 6వేలకు పెంచినట్లుకూడా సీఎం వెల్లడించారు. సైనికులు, మాజీ సైనికులు, వీర సైనికుల కుటుంబాల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు.

ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఎంతో బాధతో, కష్టంతో ఉంటుందని, ఉద్యోగ నియామకం కోసం వారిని రోజులు, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం భావ్యంకాదని సీఎం అభిప్రాయపడ్డారు. వయస్సు, విద్యార్హతల విషయంలో మినహాయింపులు ఇచ్చే విషయంలో అవసరమైతే కలెక్టర్లకు అధికారులు బదలా యించాలని సీఎం చెప్పారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చివరి రోజున పూర్తి పెన్షన్‌ అందించాలని సీఎం చెప్పారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగిని చివరి రోజు ప్రభుత్వ వాహనంలో ఇంటిదాకా పంపించి రావాలని, ఈ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని సీఎం చెప్పారు. మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు సేవలందించిన ఉద్యోగులపట్ల అత్యంత మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఇతర ఉద్యోగులకుందని సీఎం చెప్పారు.

భార్యా భర్తలకు ఒకే చోట పోస్టింగ్‌

భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా అవసరమైన బదిలీలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అన్నిశాఖల్లో ఈ విధానం వెంటనే అమలు చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జోనల్‌ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఇక రాష్ట్ర, జిల్లాస్థాయి క్యాడర్లు మాత్రమే ఉంటాయని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో అవసరమైన సర్వీసు నిబంధనలు, విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు సమావేశమై ఈ విషయంలో స్పష్టతకు రావాలని ఆదేశించారు.

ఏపీతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీ

హైదరాబాద్‌ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాసగృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రభుత్వ సలహాదారుడు జి. వివేకానంద, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జి. జగదీశ్‌ రెడ్డిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఏపీ ప్రభుత్వం కూడా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తుంది. గవర్నర్‌ సమన్వయ కర్తగా రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతారు. ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18మంది అడ్‌హాక్‌ టీచర్లను రెగ్యులరైజ్‌ చేయాలసి సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Other Updates