హైదరాబాద్‌కు ప్రస్తుతమున్న ఔటర్‌ రింగు రోడ్డుకు అవతల నిర్మించతలపెట్టిన రీజనల్‌ రింగు రోడ్డు మామూలు రహదారిగా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరల్డ్‌ క్లాస్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా తీర్చిదిద్దే విధంగా డిపిఆర్‌ తయారు చేయాలని, దీనికి నిధులు మంజూరు చేసే విషయంలో తాను కేంద్ర ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడతానని సీఎం ప్రకటించారు. ప్రగతిభవన్‌లో సిఎస్‌ ఎస్‌. కె.జోషి, ఆర్‌ అండ్‌ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణంపై చర్చించారు.

”హైదరాబాద్‌ నగరం దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్‌ నగరం. ఇక్కడి వాతావరణం, సామరస్య జీవనం కారణంగా ఇంకా ఈ నగరం అభివద్ధి చెందుతుంది. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్‌ రింగు రోడ్డు భవిష్యత్‌ అవసరాలు తీర్చలేదు. కాబట్టి మరో రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి-గజ్వేల్‌-చౌటుప్పల్‌-మాల్‌-కడ్తాల్‌-షాద్‌ నగర్‌- చేవెళ్ల-కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరగాలి. ముంబై-పూణే, అహ్మదాబాద్‌-వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ ప్రెస్‌ వేల కన్నా మన ఆర్‌ఆర్‌ఆర్‌ గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగులూరు, నాగపూర్‌ నగరాలకు వెళ్లే వద్ద వచ్చే జంక్షన్లను బాగా అభివద్ధి చేయాలి. ఈ నాలుగు జంక్షన్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్‌, ఫుడ్‌ కోర్టులు, రెస్టురూమ్‌లు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్‌ మాల్స్‌, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయాలి. దేశంలోనే ఈ రహదారి అతి గొప్ప రహదారిగా ఉండాలి. మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి, అధ్యయనం చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
tsmagazine

Other Updates