chandraఆర్ట్‌ సినిమాల్లో హీరోలాగా ఉంటాడు. పాంటు-చొక్కా ఎక్కువగా ఎర్రని లేదా ఊదా కాదంటే నీలం రంగు టీషర్ట్‌ వేసుకుంటాడు. అంత తెల్లనివాడుకాదు; అట్లాగని నల్లనివాడు కాదు. పొట్టివాడు కాదు, పొడగరికాదు. మధ్యతరహా మందహాసంతో వెలగిపోతుంటాడు. మీసాలు లేవు కాని మాలావు రోషం. కోపమెక్కువే అంటారుగాని ఆయన కోటేరువంటి ముక్కుపై సులోచనాలెప్పుడూ నాకంట్లో ఆ విషయం పడనీయలేదు.ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా గలగలా విషయమే చెప్పేతత్వం ఆయనది. సున్నితమైన మనిషి, పసిపిల్లవాడి మనస్తత్వం, నిక్కచ్చి అభిప్రాయాలు. కొన్ని అంశాల్లో జగమొండి కూడా.

టి. ఉడయవర్లు

దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక యేడాది ముందు-పున్నమినాడు పుట్టినందుకు తల్లిదండ్రులు మైదం సోమలక్ష్మి-రంగయ్యలు చంద్రుడు అని పేరు పెట్టారు. అది కాస్తా స్కూల్లో చేరేనాటికి చంద్రేశ్వర్‌ అయింది. మెట్రిక్‌ పరీక్ష వ్రాసి సర్టిఫికెట్‌ చేతికందేసరికి ఆ పేరు – చంద్రశేఖర్‌గా మారింది. పీయూసీలో చేరి బీపీసీ ఐచ్ఛికంగా తీసుకుని డాక్టర్‌ కావాలని కష్టపడి చదువుతున్న కాలంలో జరిగిన సంఘటనతో ఆయనలో పట్టుదల పెరిగిపోయి ఆయన జీవితగమనమే మారిపోయింది. ‘చంద్ర’గా చిత్రకళా ప్రపంచంలో రసప్లావితమైన వెన్నెలలు కురిపించాడు. అంతలోనే రుధిరవర్ణపు నిండు చంద్రుడై-తెలుగువారెవ్వరూ ఏనాటికైనా మరచిపోలేని చూడచక్కని చిత్రాలు గీసి చరితార్థుడైనాడు.

మిధునాల చిత్రణలో చంద్ర మేటి. ఆడవాళ్ళను ‘ఆడతనం’తో అందంగా, మగవారిని మగ’వాడి’గా చిత్రించడం-శరీర సౌష్ఠవ శాస్త్రాన్ని ‘అస్త్రం’గా వాడే కళానైపుణ్యం చంద్రలో ఉన్నందునే సాధ్యమైంది. ఈ అస్త్రానికే సమస్త తెలుగు పత్రికల, పాఠకలోకం పడిపోయింది.

యువతీయువకులు మరీ ముఖ్యంగా విద్యార్థులు ఆయా బొమ్మల్లోని భామలు, వారి మగతోడులు కూర్చున్న తీరుతెన్నులు, పడుకున్న ఫక్కీ, నిలుచున్న పద్ధతి, ఇతర ఎన్నెన్నో వైవిధ్యమైన వందలాది విన్యాసాలు చంద్రనుంచి నకళ్ళుతీసి నేర్చుకున్నారు. పలు పత్రికల్లో ఇవాళ్ళ పనిచేస్తున్న ఎందరో వర్ధమాన చిత్రకారులకు ప్రత్యక్షంగా చంద్ర గురువు కాకపోయినా, పరోక్షంగా వారంతా ఆయనకు ఏకలవ్య శిష్యులు.

ఒకప్పుడు-సెవెన్‌స్టార్‌ సిండికేట్‌ వారు తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బాపు చిత్రాల ప్రదర్శనచూసి, చంద్ర కూడా బాపుకు ఏకలవ్య శిష్యుడయ్యాడు.తొలి రోజులలో ఆయనలాగా తీయడం సాధనచేసి, ఆ తర్వాత కుంచె నడపడంలో తనకంటూ ఒక శైలిని హస్తగతం చేసుకున్నాడు.

‘బాపు’ కథమీద కొత్త సంగతి వేయడానికి మధనపడీ వేస్తే, చంద్రనేమో చడీచప్పుడు లేకుండా కథలో ఉన్న విషయాన్ని-కథ ఆత్మను హైలైట్‌ చేస్తూ చకచకా చక్కని బొమ్మలు గీస్తాడు. నిజానికి చంద్ర గీతకు అందని అందంలేదు. ఒదగని భావంలేదు. ఆయన ఏది గీసినా సంతకం లేకుండానే చంద్ర ముద్ర కనిపిస్తుంది. ఇట్లా వేలాది కథలకు బొమ్మలేశాడు, వందలాది గ్రంథాలకు ముఖచిత్రాలు వేశాడు.

..అయితే ఒకసారి ప్రముఖ పాత్రికేయుడు, కీర్తిశేషుడు పరాంకుశం దామోదరస్వామి వ్యాస సంకలనం ‘ఈ నేల-ఈ గాలి’కి ముఖచిత్రంకోసం చంద్ర దగ్గరికి వెళితే, కూర్చోబెట్టి గంట సేపట్లో ముఖచిత్రం వేసి చేతిలో పెట్టాడు. మరో ప్రసిద్ధ పాత్రికేయుడు జి. కృష్ణ బొమ్మను నాకు కావలసిన తీరులో వేసిచ్చాడు. అట్లాగే పూర్వ ప్రధాని పీవీ నరసింహారావుపై వేసిన ప్రతిభామూర్తి బృహద్‌ సంచికకు ఫలానా భంగిమల్లో డజను చిత్రాలు కావాలని కోరితే వారం రోజుల్లో అపురూపమైన ముఖచిత్రంతోపాటు అన్ని చిత్రాలిచ్చాడు. ఇట్లా మరో ఇరువురు ముఖ్యమంత్రులపై వేసిన స్మారక సంపుటాలకు నేను సూచించిన మేరకు రెండు డజన్ల దాకా వివిధ భంగిమల్లో వారి చిత్రాలు గీసి సమయానికిచ్చాడు. దాంతో ఆత్రేయ ఉదాహరణం చంద్రకు చెల్లదంటాను.

ఎంతోవేగంగా బొమ్మలువేసే చంద్ర-‘ఆత్రేయ వ్రాసి ప్రేక్షకులకు, వ్రాయక నిర్మాతలను ఏడిపిస్తాడన్నట్టుగానే – బొమ్మలేసి కళాప్రియులను, బొమ్మలేయక రచయితలను, సంపాదకులను, పాఠకులను ఏడిపిస్తాడనేవారు. దానికి కారణం-విరామం లేకుండా బొమ్మలేసినా, సమయానికి పూర్తి చేయలేనన్ని ఎక్కువ బొమ్మలేస్తానని మొహమాటంతో చంద్ర అన్నింటికి తలూపడమే అయి ఉంటుంది. పైగా ఏది చేసినా మొక్కుబడి అనేది చంద్ర జీవితంలో లేనేలేదు. మనస్ఫూర్తిగా తాను అనుకున్నట్టుగా, కుదిరేదాకా బొమ్మను తీర్చిదిద్దుతాడు.

తొలి రోజుల్లో విరసంలో చంద్ర సభ్యుడు. చిత్రకారుడుగా ఈయన చేసిన దోహదం ఆ తర్వాత మరెవ్వరూ చేయలేదు. జననాట్యమండలి కార్యక్రమాల్లో భాగంగా చంద్ర బొమ్మల కొలువు ఏర్పాటు చేసేవారు. ఒకసారి ప్రదర్శన అనంతరం నగరానికి తిరిగి వస్తున్నప్పుడు వ్యాన్‌పై పెట్టి చంద్ర పెయింటింగ్స్‌ గాలికి ఎగిరి రోడ్డుకిరువైపుల పంట చేలలోపడి కొట్టుకుపోయాయి. అది గమనించిన విప్లవకవి చెరబండరాజు ప్రభృతులు వాహనం ఆపి అన్నీ ఏరుకుని తెచ్చారట. అయితే అప్పటికప్పుడు కలిగిన ఆలోచనలతో వ్యాన్‌చుట్టూ ఆ బొమ్మలు అమర్చి పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులను పిలిచి, ఈ బొమ్మలేమైనా అర్థమవుతున్నాయా? అని అడిగారట. దానికి రైతులనుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇక తాను పెయింటింగ్స్‌ వేయనని చంద్ర మొండికేశాడు.

వాస్తవానికి జీవికకోసమని ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గొప్ప హోదా లేకపోయినా, భారీ వేతనం లేకపోయినా చిత్రకారుడుగా చేరిపోయి పదహారేండ్లు గడిపి ఉండకపోతే ఇంకా ఎన్నో అపురూపమైన పెయింటింగ్స్‌ చంద్ర కుంచెనుంచి వచ్చి ఉండేవనే ఆశ ఇప్పటికీ మినుకుమినుకుమంటోంది.

అసలు డాక్టర్‌ కావలసినవాడు చిత్రకారుడు ఎందుకైనాడంటే-చిన్నప్పటినుంచీ డ్రాయింగ్‌ టీచర్‌-రామానుజాచార్యులు ప్రభావం తనపై ఉండడంతో పీయూసీ-బీపీసీ ప్రాక్టికల్‌ నోట్‌బుక్స్‌లో చక్కని బొమ్మలు వేసేవాడు. ఒకసారి తను చదువుతున్న సైఫాబాద్‌ సైన్స్‌ కళాశాలలో విద్యార్థులకు చిత్రకళలో పోటీలు నిర్వహిస్తే, తాను ‘చీకట్లో నగరం’ అనే చిత్రం వేసిచ్చాడు. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావును కళాశాల యాజమాన్యం బహుమతి నిర్ణేతగా ఆహ్వానించారు. శేషగిరిరావు చంద్ర ప్రియమిత్రుడి తండ్రి కూడా. పైగా చాలాసార్లు శేషగిరిరావు బొమ్మలు వేస్తున్న సందర్భాల్లో వారి మిత్రుడికోసం వెళ్ళి చంద్ర ఆ బొమ్మల తీరుతెన్నులు పరిశీలించేవాడు. వారు వేసిన కొన్ని బొమ్మలు చూసి ప్రేరణ పొందేవాడు. అయితే శేషగిరిరావు పోటీ నిమిత్తమై ఇచ్చిన చిత్రం-తన చిత్రమని, అది చంద్ర వేసిందికాదని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుచేసి, పోటీనుంచి చంద్రను తొలగించారు. ఆ బొమ్మ తానే వేశానని, శేషగిరిరావు బొమ్మ వారింట్లోనే ఉంటుందనీ, అసలు విషయం చంద్ర ఎంతచెప్పినా వారు వినిపించుకోకపోవడంతో-ఇక తాను శేషగిరిరావు అంతటి చిత్రకారుడనై, ఆయనతోపాటు ఒకే వేదికపై సత్కారంపొంది తీరుతానని శపథం చేశాడు. ఇక కావాలని పీయూసీలో తప్పిపోయి, బాపును ఊతంగా చేసుకుని బొమ్మలు గీయడం సాధన చేశాడు. ఆ తర్వాత ఐదేండ్లపాటు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని లలిత కళాశాలలో బి.ఎఫ్‌.ఏ. చదివి సర్టిఫికెట్‌ పొందారు. ఒకరకంగా సాధారణ తెలుగు ప్రజానీకంలో శేషగిరిరావుకంటే చంద్ర ఎక్కువ ప్రజాదరణ పొందాడు. కిన్నెరలాంటి సాంస్కృతిక సంస్థలో శేషగిరిరావుతోపాటు చంద్రను ఒకే వేదికపై సత్కారం చేయడంతో చంద్రచేసిన శపథం కార్యరూపం దాల్చింది.

ఈ నేపథ్యంలో చూస్తే-చంద్ర కేవలం చిత్రకారుడు మాత్రమేకాదు, సకల కళావల్లభుడు. ఆయనకు తెలుగు సాహిత్యం చదవడం, చిత్ర లేఖనంపై వచ్చే పుస్తకాలు కొనడం, భాషతో నిమిత్తం లేకుండా కళాత్మక సినిమాలు చూడడం వ్యసనం. కథలు వ్రాయడం అలవాటు. నటించడం హాబీ. కళా దర్శకత్వం నెరపడం నల్లేరుపై నడక. ఊరుమ్మడి బతుకులు, చలిచీమలు, ఛాయ, మంచుపల్లకి, డిటెక్టివ్‌ నారద ఇత్యాది పదిహేను చలనచిత్రాలకు ఆయన కళాదర్శకుడంటే-ఆయన అభిరుచి ఏమిటో తేటతెల్లమవుతున్నది.

ఒక దశలో చలనచిత్ర దర్శకుడు కావాలనుకున్నాడు. తాను వ్రాసిన నలభై ఐదు కథల్లో-‘సూర్యుడు కూడా

ఉదయిస్తాడు’ను సినిమా తీయాలనుకున్నాడు. డబ్బులు పెట్టేందుకు స్నేహితుడు ముందుకొచ్చాడు. కానీ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులను నమ్ముకుని కళాత్మక చిత్రం నిర్మించే ధైర్యం చేయలేక తనకుతానే స్వచ్ఛందంగా చిత్ర నిర్మాణం ఆలోచనను విరమించుకున్నాడు.

కాని ముత్యాల్లాంటి అక్షరాలు వ్రాయడంలో, కాప్షన్‌లేని కార్టూనులు గీయడంలో, మూర్తి చిత్రణలో, ముఖపత్ర చిత్రణలో, డిజైనింగ్‌ చేయడంలో, గ్రీటింగ్‌ కార్డులు తయారు చేయడంలో, లోగోల రూపకల్పనలో, పోస్టర్ల కూర్పులో రుధిరవర్ణపు చిత్రాలు గీయడంలో మాత్రం ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదు. కంటికి, మనసుకు నచ్చిందే నిజమైన కళ అని నమ్మే చంద్ర ఏనాడూ అవార్డులకోసం అర్రులు చాచలేదు. మేము వయోధిక పాత్రికేయ సంఘం పక్షాన ఎంతో ఆత్మీయంగా సత్కరిస్తే తలవంచుకుని కొత్త పెళ్ళి కొడుకులాగా సిగ్గుపడిపోయాడు. వినమ్రంగా స్వీకరించాడు.

చంద్ర వ్యక్తిత్వం విహంగ వీక్షణం చేస్తే-ఆయన సగటు మనిషే. సంసార సంబంధమైన బాదరబందీ, కోపతాపాలు, అలకలు, ఇతర బలహీనతలు అన్నీ ఉన్నా అలుపెరుగని చిత్రకారుడాయన అన్నది సుస్పష్టమవుతుంది. చంద్రలోని ఆ త్రివిక్రముడైన చిత్రకారుడే ఆయనలోని ఇతర కళలను మింగేశాడు.

Other Updates