అధికారంలోకి రాకమునుపు ఇచ్చిన వాగ్దానాలను వంతులవారీగా నెరవేరుస్తూ వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతులు తీసుకున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను రద్దు చేస్తామన్న హామీ మేరకు మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రంలో లక్ష రూపాయలలోపు పంట రుణాలను తీసుకున్న రైతులు 35.50 లక్షల మంది వున్నట్టు గుర్తించింది ప్రభుత్వం. వీరందరి పేరిటవున్న మొత్తం రుణం 16,999.18 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. అయితే ఇప్పటికే తొలివిడతగా 2014 సెప్టెంబర్‌లో 4250 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రెండో విడతగా 2015 జూన్‌లో 2043 కోట్ల రూపాయలను, తర్వాత జూలైలో 2043 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా మూడో విడతగా ఈ యేడాది జూలైలో 2019.99 కోట్ల రూపాయలు, తాజాగా నవంబర్‌ 8న 2019.19 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 12,375.18 కోట్ల రూపాయలను విడుదల చేయడంద్వారా, దాదాపు 75% పంట రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లయింది. అయితే మిగిలిన 25% వాటా నిధులయిన 4,624 కోట్ల రూపాయలను రానున్న బడ్జెట్‌ అనంతరం ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Other Updates