magaబాలలకంటూ ఓ చిత్ర ప్రపంచం ఉంది. అందులో రాజులు, మారాజులు వాళ్ళే! కుట్రలులేని, కుటిలంలేని నవ్వు వాళ్ళ సహజ ఆభరణం-అమాయకంగా మెరిసే కళ్ళతో అన్నింటా అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించే సంపూర్ణ మానవులు పిల్లలు. వాళ్ళ కలలకు, అలకలకు, అభీష్టాలకు ఓ రూపాన్నిస్తే అది మరో ప్రపంచమవుతుంది. నవ్వులు-పువ్వులు, కేరింతలు, ఉత్సవ వేదికలో కట్టిన తోరణాలవుతాయి.

అలాంటి ఓ అందమైన, అరుదైన స్వప్నం నవంబర్‌ 8వ తేదీనుంచి 14వ తేదీ వరకు తెలంగాణ రాజధాని నగరంలో కళ్ళకు కట్టనున్నది. ఇరవయ్యవ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర చలనచిత్ర, టి.వి. రంగస్థల అభివృద్ధి సంస్థ చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నది.

ఈ బాలల చలనచిత్రోత్సవం 8వ తేదీ సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ప్రారంభిస్తారు. మళ్ళీ 14వ తేదీన అక్కడే ముగింపు ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించడానికి దేశవిదేశాలకు చెందిన రెండువందల తొంభై ఒక్క చిత్రాలను ఎంపిక చేశారు. నాలుగు విభాగాల్లో ఈ చిత్రాలన్నిటిని ఉత్సవ ప్రధాన థియేటర్లు ప్రసాద్స్‌ ఐమాక్స్‌లో ప్రదర్శిస్తారు. ప్రధాన థియేటర్లు కాకుండా హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంట నగరాల్లోని ఈశ్వర్‌ (అత్తాపూర్‌), శివపార్వతి (కూకట్‌పల్లి), హైటెక్‌ (మాదాపూర్‌), రంగ (జీడిమెట్ల), మహాలక్ష్మి (కొత్తపేట్‌), సినీ పోలీస్‌ స్క్రీన్‌-3 (మల్కాజ్‌గిరి), ప్రశాంత్‌ (సికిందరాబాద్‌), కుమార్‌ (కాచిగూడ), గోకుల్‌ (ఎర్రగడ్డ) థియే టర్లలో ప్రేక్షకులు, బాలల సౌకర్యార్థం ప్రదర్శిస్తారు.

ప్రపంచ దేశాలలోనుంచి 360మంది బాల ప్రతినిధులు ఈ చలన చిత్రోత్సవంలో పాల్గొనడానికి వస్తున్నారు. ముప్పైరెండుమంది బాల దర్శకులు సైతం ఈ చిత్రో త్సవంలో పాలుపంచుకోవడానికి రానున్నారు.

ఈ సందర్భంగా బాలల నిమిత్తమై చలనచిత్ర నిర్మా ణంపైన, యానిమేషన్‌పైన, చిత్ర రచనపైన, కార్యగోష్ఠులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు బాలల చలన చిత్రాలకు సంబంధించిన పలు సమస్యలు చర్చించడానికి వీలుగా ‘ఓపెన్‌ ఫోరమ్‌’ కూడా నిర్వహిస్తారు.

దాదాపు ఇంతవరకు ఎప్పుడూ లేనివిధంగా ఈ ఇరవయ్యవ భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో తెలుగు చిత్రాలు ప్రదర్శించడం విశేషం. రెండేండ్లక్రితం జరిగిన చలన చిత్రోత్సవంలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. 2013లో మాత్రం కేవలం ఒక తెలుగు చిత్రం వేశారు. ఈసారి మట్టిలో మాణిక్యం, ఎగిసే తారాజువ్వలు, డూడూ డిడి, ఇందీవరం, పూర్ణ ప్రదర్శించనున్నారు.ఈ బాలల చలన చిత్రోత్సవాలను సజావుగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్పీ సింగ్‌ అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీ ఏర్పడింది. అట్లాగే ఆహ్వాన, ఆతిథ్య కమిటీ, పర్యాటకశాఖ డైరెక్టర్‌ అధ్యక్షతన, రవాణా కమిటీ రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి అధ్యక్షతన, పాఠశాల కమిటీ, పాఠశాల విద్య కమిషనర్‌ అధ్యక్షతన, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ అధ్యక్షతన, మీడియా కమిటీ-సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

ఏ శుభ ముహూర్తాన 1995 నవంబర్‌ మాసంలో తొమ్మిదవ భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం దోహదం చేసిందోగాని, ఆ తర్వాత 1997లో పదవ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన పడింది. ఆ తర్వాత అప్పటి అంతర్జాతీయ బాలలు, యువజనుల చలనచిత్ర సంస్థ అధ్యక్షులుగా ఉన్న, ప్రసిద్ధ నటి జయా బచ్చన్‌ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌ ఈ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల నిర్వహించే శాశ్వత వేదికైంది.

ఫలితంగా స్థానిక బాలలకు పెద్ద సంఖ్యలో దేశవిదేశాల్లో తీసే చిత్రాలు చూసే అవకాశం ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ చిత్రోత్సవంవల్ల పెరిగింది.

నిజానికి 1936 నాటికే ‘భక్త ధృవ-అనసూయ’లాంటి చిత్రం ఆ తర్వాత అందరూ బాలలతో ‘బూరెల మూకుడు’, ‘బాల భారతం’లాంటి చిత్రాలు తెలుగులో వచ్చాయి. అయితే వాటికి ఇప్పటిలాగా బాలల కోసం నిర్మించిన బాలల చిత్రాలుగా ముద్రపడలేదు. అలాగే ‘బంగారు పాప’, ‘రాము’, ‘లేత మనసులు’లాంటి చిత్రాల్లో బాలలు ప్రధాన భూమికలను పోషించారు.. బాపు ‘బాలరాజు కథ’, మల్లెమాల ‘బాల రామాయణం’ పిన్నలను, పెద్దలను అలరించాయి. అక్కినేని-ఆదుర్తి కలిసి ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ ప్రయోగాత్మకంగా తీశారు. ‘లిటిల్‌ సోల్జర్స్‌’లాంటి బాలల సాహస చిత్రం ‘ఆదిత్య 365’ లాంటి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు పెద్దలతో పాటుగా బాలలను ఆకట్టుకున్నాయి.

అక్కినేని కుటుంబరావు బాల కార్మిక వ్యవస్థను ‘భద్రం కొడుకో’లో చిత్రీకరించి పేరు గడించారు. ఆ తర్వాత ‘పాత నగరంలో పసివాడు’ తీశారు. అయితే బాలల కోసమని భారతీయ చలనచిత్ర సంస్థ ఇప్పటికి నిర్మించిన ఏకైక తెలుగు చిత్రం ‘గంగాభవాని’. చిట్టిపొట్టి బాలలలో సృజన పెంచడానికి మెదడుకు మేతవేయడానికి, వారిని ప్రతిస్పందింపజేయడానికి అవసరమైన ప్రత్యేకమైన చలనచిత్రాలు నిర్మించడానికి, పంపిణీ చేయడానికి, ప్రదర్శించడానికి ఆవిర్భవించిన సంస్థ బాలల చిత్రాల భారతీయ సంస్థ. దీన్ని సొసైటీగా 1955 ఆగస్టు 30న రిజిస్టర్‌ చేశారు.

1956 నుంచి ఈ సంస్థ బాలల చలనచిత్రాల నిర్మాణం ప్రారంభించింది. బాలల చిత్ర నిర్మాణంలో చేయి తిరిగిన ప్రసిద్ధ దర్శకుడు కేదార్‌శర్మను విదేశాలకు పంపించి అధ్యయనం చేయించి ఆయనతోనే తొలిచిత్రం ‘జలదీప్‌’ను ఈ సంస్థ నిర్మించింది.

నిర్మాణరంగంతోపాటుగా పంపిణీ, ప్రదర్శన రంగాల్లోకి సైతం విస్తరించాలని భావించింది.

1970 నుంచి భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. ఈ శ్రేణిలో తొలి చిత్రోత్సవం ముంబైలో ఏర్పాటు చేశారు.

అనంతరం వరుసగా 1981లో చెన్నైలో, 1983లో కలకత్తాలో, 1985లో బెంగుళూరులో, 1987లో భువనేశ్వర్‌లో, 1989లో ఢిల్లీలో, 1991లో తిరువనంతపురంలో, 1993లో ఉదయపూర్‌లో, 1995లో హైదరాబాద్‌లో నిర్వహించారు.

1997లోనూ హైదరాబాద్‌లోనే చిత్రోత్సవం జరిగిన తర్వాత ఈ భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రతి రెండేండ్ల కొకసారి నిర్వహించే శాశ్వత వేదికగా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ భారత అంతర్జాతీయ బాలల చలనచి త్రోత్సవం జరుపడం ఇది పన్నెండో పర్యాయం.

టి. ఉషాదేవి

Other Updates