tsmagazine

గడచిన 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజాన్ని వణికిస్తున్న నిజం, చదువు ఎందుకు విదార్థులను వత్తిడికి గురిచేస్తుంది. నిజానికి చదువు వికాసాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, విచక్షణను ఇవ్వాలి కానీ, నేటి విద్యార్థులకు బాధను, కష్టాన్ని, తీరని వ్యథను ఇస్తున్నట్టు అన్పిస్తుంది. దీనిని మరింత లోతులోకి చూస్తే… చదువు కాదు వ్యథను ఇచ్చేది… చదువును నేర్పుతున్న పద్ధతులని అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ చావులన్నీ ‘డబ్బు’ బాగా ఫీజుల రూపంలో తీసుకుంటున్న విద్యాసంస్థల్లో, ఖరీదైన విద్యను అందిస్తున్న సంస్థల్లోనే జరుగడం గమనించాలి.

గత నెల డిసెంబర్‌మాసంలో మేము ‘హైదరాబాద్‌నుంచి అమరావతి’ వరకు ఈ విద్యార్థుల ఆత్మహత్యలపై ‘సైకిల్‌ ర్యాలీ’ద్వారా 10వేలకుపైగా విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్న ఈ సమావేశాల్లో ఎక్కువ భాగం విద్యాసంస్థల పనితీరు, తల్లిదండ్రుల ఆలోచనా విధానం ఈ రెండు అంశాలు ఎక్కువగా చర్చించారు. నిజంగా విద్యార్థులు చనిపోవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు.

కారణాలు:-
(1) గొప్పగొప్ప కళాశాలల్లో చదివితేనే గొప్పగా జీవించవచ్చుననే విలువ, చిన్నప్పటినుండి పదేపదే అందరూ మాట్లాడడం.
(2) గొప్ప కళాశాల్లో చేరడమే లక్ష్యంగా, చదవడం.
(3) అందుకోసమే జీవితం అని పదేపదే చెప్పడం.
(4) సక్సెస్‌ గురించి చదువుకున్న వాళ్ళు, చదువుకోని, ఏ విధమైన శ్రమనుపెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించని వ్యక్తులు, అశాస్త్రీయమైన పద్ధతులగురించి చెప్పడం.
(5) చదివే కోర్సుకోసం తల్లిదండ్రులు తమ శక్తికిమించి డబ్బులు ఖర్చు చేయడం. ఇష్టంలేని కోర్సును చదవడం.
(6) కుటుంబ పరువు. తను సాధించే ర్యాంకు, సీటు మీదనే ఉందన్న విషయం పదేపదే కుటుంబంలో చర్చించడం.
(7) పొద్దున్నుండి సాయంత్రం వరకు ఊపిరాడని గదుల్లో, ఆక్సిజన్‌లేని గదుల్లో నిరంతరం కూర్చుని.. చదవడం.
(8) నిద్రలేక, సరియైన విశ్రాంతి లేకపోవడం.
(9) కష్టం, బాధ, అశాంతి, శారీరక, మానసిక శ్రమను అస్సలు ఎవ్వరు గుర్తించకపోవడం, కనీసం దానిని ఎవరితోనైనా చెప్పుకోవడానికి అవకాశం లేకపోవడం.
(10) తను ఎక్కడ, ఎందుకు సరిగ్గా నేర్చుకోలేకపోతోంది, దానిని శాస్త్రీయంగా ఎలా నేర్చుకోవాలో, ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని ఒంటరి పోరులో అలసిపోవడం.
(11) ప్రతిరోజూ పరీక్షా, ప్రతిరోజు మూల్యాంకనం, ప్రతిరోజు నువ్వు సరిగ్గా చదవడం లేదు, ప్రతిరోజు తాను తక్కువ, తాను తక్కువ అనే మాటలు గుది బండలాగా మనస్సుపడే విపరీతమైన బాధ, బరువు.
(12) నిద్ర పోతే… సీటురానట్టు అమ్మా నాన్నలు బాధపడుతున్నట్టు అందరూ కుటుంబాన్ని విమర్శిస్తున్నట్టు కలలు.
(13) ఉపాధ్యాయుల హేళన మాటలు కోపంగా చూపులు హూంకరింపులు, పోలికలు..
(14) భరించలేని అసహాయత… ‘ఎందుకు నేను.. అందరిలాగా మంచి మార్కులు తెచ్చుకోలేక పోతున్నాను’ అని ప్రతిరోజు చదివిందీ, చదివి చదివి పూర్తిగా మర్చిపోయే స్థితి.
(15) ప్రక్కనే కూర్చున్న తన తోటి విద్యార్థి… తానేదో నేరం చేసినట్టు మాట్లాడకపోవడం, కనీసం పలకరించక పోవడం..
(16) ఎన్నో రోజులనుండి ఉన్న మిత్రులు మాట్లాడడానికి సమయంలేదని చెప్పడం.
(17) అవాస్తవ లక్ష్యాల ఛేదన గురించి శ్రమించడం.
(18) పోటీ పరీక్షకు, తరగతుల పరీక్షకు సంబంధంలేని ప్రిపరేషన్‌.
(19) 1200 రోజులపాటు ఈ శ్రమ ఫలితం అనుమానం అయినప్పుడు.
పైన పేర్కొన్న ప్రతీది విద్యార్థుల పాటిల ఉరితాళ్ళుగా మారుతున్నాయి.

 • ఏం చెయ్యాలి చదువు నేర్పే పద్ధతులపై పరిశోధనలు మొదలు పెట్టాలి. ప్రపంచంలో అన్నీ మారాయికానీ, చదువు నేర్చుకొనే తరగతి గదిఇప్పటికి 1940 మోడల్‌గానే వుంది.
 • విద్యార్థులకు ఆసక్తి కోల్పోవడాన్ని గుర్తించి, కారణాలు వెతికి దానికి సరైన పద్ధతులను నేర్పించాలి. లేదా, ఆసక్తి ఉన్న రంగానికి మార్చాలి.
 • జీవితంకన్నా చదువు ముఖ్యమైనదికాదు, ఉన్నతమైనది కాదు అనేది గుర్తించాలి. ముఖ్యంగా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు గుర్తించాలి.
 • పదవ తరగతిలోనే ‘కెరీర్‌ గైడెన్స్‌’ ప్రభుత్వపరంగా నిర్వహించాలి. ఆ తర్వాతనే 10వ తరగతి ‘పాస్‌’ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.
 • ఆత్మహత్యలు ఎందుకు జరుగుతన్నాయో విశ్వవిద్యాలయాలు పరిశోధన ప్రాజెక్ట్‌లు చేపట్టి, కారణాలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. వాటిని తప్పకుండా పాటించాలి.
 • ప్రాణానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.
 • విద్య గురించి, మనిషి జీవితం గురించి, జీవన విధానం గురించిన అవగాహన, తల్లిదండ్రులకూ విద్యాసంస్థలో పనిచేసే అధ్యాపకులకు, సిబ్బందికి, యాజమాన్యాలకు నిరంతరం కల్పించాలి
 • నిరంతరం కోచింగ్‌, కాలేజీ నిర్వహిస్తున్న సంస్థలకు ప్రభుత్వం తరఫున ‘నిఘా’ సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ఉల్లంఘన పట్ల కఠినంగా ఉండడం అవసరం.
 • చదువు తనను తను అర్థం చేసుకొనటానికి సమాజంలో భాగస్వామ్యం అయ్యి తనతోపాటు సమాజం ఎదుగుదలకు ఉపయోగపడడానికి అనే విలువను చిన్నప్పటినుండే పాఠశాలలో చెప్పడం.
 • సమాజంలో మమేకం అయ్యే విధంగా స్కూలు విధానాలను సవరించడం, పాటించని పాఠశాలలను శిక్షించడం.
 • దేశంలో కొన్ని ‘కళాశాలలు ప్రత్యేకం’ అనే ఆలోచన ధోరణి నుండి ప్రభుత్వం బయటకు వచ్చి అందరూ సమానం.. అందరికీ సమాన అవకాశం అనే ఆలోచనకు రావాలి.
 • ఏ కోర్సుకు ఎలాంటివారు వెళ్ళాలి అనేది శాస్త్రీయ పద్ధతుల్లో విద్యార్థి ఆసక్తినిబట్టి నిర్ణయించేశక్తి ప్రభుత్వానికి ఉండాలి.
 • అన్ని కోర్సుల్లో సమాన ఉద్యోగ అవకాశాలు సమకూరేట్టు ప్రభుత్వాలు ఆలోచన, కార్యాచరణ చెయ్యాలి.
 • ఒక వ్యక్తి చేతులూ, సంస్థ చేతిలో, ఎక్కువ సంస్థలు ఉండకుండా ఉండేవిధంగా చట్టం తేవాలి, దానిని తప్పకుండా అమలు చేయాలి
 • నేటి విద్యార్థులే రేపటి పౌరులన్న సంగతిని మళ్ళీ జ్ఞాపకంలోకి తేవాల్సిన బాధ్యతలకు ప్రజలందరూ గుర్తు చేయాలి.
 • ప్రభుత్వం తరఫున ప్రతి మండలంలో కౌన్సిలింగ్‌ సెంటర్లు పెట్టి, సీక్రెట్‌ నిర్వహణలో ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ సెంటర్‌ ద్వారానే తనకు ఏది తగిన ‘కోర్సు’ను నిర్ధారణ చెయ్యాలి. అది 10వ తరగతి సర్టిఫికెట్‌లో పొందుపరచాలి.
 • ప్రభుత్వ అధీనంలో, ప్రైవేటు సంస్థలలో కౌన్సిలింగ్‌ ‘టోల్‌ ఫ్రీ’ నంబరును నిర్వహించి, విద్యార్థుల కష్టాలకు, బాధలకు, నివారణకు అవకాశం ఇవ్వాలి.
 • నేర్చుకోవడం ఒక సంతోషకరమైన అనుభూతినిచ్చే విధంగా పద్ధతులను పాటించే విధంగా కార్యాచరణను కనుగొనాలి.
 • అప్పుడు తప్పకుండా విద్యార్థి భయంతో, ఆందోళనతో కాకుండా సంతోషంతో, ఉత్సాహంగా చదువుకుంటారు. అప్పుడే మనకు బంగారు తెలంగాణ, బంగారు భవిష్యతు మన సమాజానికి, మన దేశానికి వస్తుంది.

డా. వీరేందర్‌

Other Updates