magaరోటీ, కపడా ఔర్‌ మకాన్‌ ఇవి ప్రజలకు కావలసిన ప్రధాన అవసరాలు. వీటి పైనే మన ముఖ్యమంత్రి దృష్టి కూడా వుంది. తొలుత రోటీ, మకాన్లను ఓ గాడిన పెట్టి, ఇపుడు వస్త్ర వ్యవస్థను సమూలంగా సరిదిద్దే సంకల్పానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో దేశంలోనే మన తెలంగాణది మూడోస్థానం. దాదాపు ఏటా 50లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతున్నది. ఇందులో మనం ఉపయోగించుకుంటున్నది ఐదవవంతు కూడా లేదు.ప్రాసెసింగ్‌లో భాగంగా దాదాపు 40లక్షల బేళ్ల పత్తి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నది. అక్కడి నుంచి చైనా, బంగ్లాదేశ్‌లోని భారీ టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఎగుమతి అవుతున్నది.అటు పత్తి రైతుకు లాభం లేకపోగా, ఇటు నేత కార్మికులు వలసలు పోతున్నారు.మధ్యవర్తులు, విదేశాలకు తరలిస్తున్న వ్యాపారులు మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నారు. పనికొచ్చే పరిశ్రమలు లేక ఆదాయాన్ని ఆర్జించలేకపోతున్నాం. ఈ పరిస్థితులను సమూలంగా మార్చే ఉద్దేశంతోనే సీఎం మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో, అలనాటి ఆజంజాహికన్నా అధిక విస్తీర్ణంలో. దాదాపు రెండు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా, రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు రూపకల్పన జరిగింది. వరంగల్‌ గ్రామీణ జిల్లాలోని గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో,దేశంలోనే అతిపెద్ద వస్త్ర నగరిగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు అయిన తన కలల ప్రాజెక్టుకు సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్షలాదిగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఓరుగల్లు వాకిలిగా,కాకతీయ ముఖద్వారం లోగిలిగా ‘బంగారు తెలంగాణ’ బాహ్య ప్రపంచానికి పరిచయమౌతుందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. ఒకప్పటి ఓరుగల్లుకు పూర్వ వైభవం మళ్లీ వస్తుంది. వేలాది మందికి సగం శతాబ్ద కాలం ఉపాధిని అందించి,ఈ కాకతీయ నగరానికి కరెంటును కూడా సరఫరాచేసిన ఆజంజాహి మిల్లును మరిపించే విధంగా ఈ మెగా జౌళి పార్కును రూపొందించుకుందాం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాకతీయుల పేరుతోనే మన ప్రాంతానికి బర్కతి ఉంటుందని ఈ పార్కుకు వాళ్ల పేరు పెట్టుకున్నం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్న ఈ టెక్స్‌టైల్‌ పార్కు నూటికి నూరు శాతం ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నప్పుడే పరకాల, సంగెం, వర్ధన్నపేట గ్రామాల చేనేత కార్మికులు, భివండీ, సూరత్‌,షోలాపూర్‌ వంటి ప్రాంతాల్లో వున్నా కూడా అక్కడినుండే ఉద్యమాన్ని నడిపి ఆదర్శంగా నిలిచారు.వాళ్ళతో ఒకసారి మాట్లాడినప్పుడు, ఆజంజాహి మిల్లు మూతపడడంవల్ల మరో మార్గం లేక వలస వెళ్లామని, పొట్టకూటి కోసం అక్కడ తిప్పలు పడుతున్నామని చెప్పడం నన్ను కలచివేసింది. ఆరోజే నిర్ణయించుకున్నా, రాష్ట్రంలో ఆజంజాహి మిల్లును తలదన్నేటటువంటి ఒక జౌళి పార్కును ఏర్పాటు చేయాలని. ఆ కల ఇప్పుడు నెరవేరింది. దేశంలో వస్త్ర పరిశ్రమలు చాలా చోట్ల వున్నయి. ఒక్కో చోట ఒక్కో రకమైన ఉత్పత్తులు జరుగుతయి. కానీ, ఇక్కడ మన కాకతీయ మెగా జౌళిపార్కులో అన్ని రకాల వస్త్రోత్పత్తులు జరుగుతాయి. ఈ పార్కుతో వలసలు వెళ్లినవారు వాపస్‌ రావాలి.వలసలు వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ట్రానికినికి తిరిగి రావాలె. మీకు మన గడప దగ్గరనే ఉపాధి దొరుకుతుంది. పరాయి రాష్ట్రంలో ఇక కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డగా చెప్తున్న.. వలసలు వెళ్లిన నేతన్నలంతా సొంతూరులోనే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలె.

తెల్ల బంగారానికి (పత్తి పంట) నెలవైన వరంగల్‌ జిల్లాలో సూరత్‌, షోలాపూర్‌, తిర్పూర్‌ వస్త్రపరిశ్రమల కలబోతగా భారీ వస్త్రనగరికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నది. ప్రపంచ జనాభా 700 కోట్లు, అందరికీ బట్టలు అవసరం. ఆ అవసరాలకు తగ్గట్టుగా నూలుపోగు నుంచి రెడీమేడ్‌ వస్త్రాల వరకు అన్ని రకాల వస్త్రాలను తయారుచేసే కాకతీయ మెగా టెక్స్టైల్‌ పార్కు దేశంలోనే పెద్దది. దీనికి శంకుస్థాపనచేసిన రోజే రాష్ట్రప్రభుత్వంతో 22 సంస్థలు రూ.3,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నయి. వీటివల్ల 25 వేలమందికి ప్రత్యక్షంగాను, మరో 50వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. వలసలు వాపసు రావాలనే సంకల్పంతో చేపట్టిన ఈ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు సహకరించి భూములిచ్చిన రైతుల కుటుంబాలకు పార్కులోనే ఒక్కో ఉద్యోగం తప్పక ఇస్తం. నూటికి నూరుశాతం ఆత్మవిశ్వాసంతో చెప్తున్న.. ఈరోజు శంకుస్థాపన చేసుకున్న టెక్స్‌టైల్‌ పార్కు తప్పక ప్రపంచస్థాయి గుర్తింపు సాధిస్తుందన్న నమ్మకం నాకున్నది. వస్త్రాలకు డిమాండ్‌ తగ్గడం అనేది ఉండదు. వరంగల్‌ జౌళి పార్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఇందుకోసం మామునూరు విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తెస్తాం.

ఉమ్మడి రాష్ట్రంలో వున్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఉన్నదంతా చిత్తశుద్ధి, పట్టుదల. అందుకే జౌళిపార్కు ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. టీఎస్‌ఐపాస్‌ ప్రారంభించినపుడు అనేక మంది విమర్శించారు. కానీ, దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే 57 రకాల అనుమతులు వస్తున్నయి. ఇప్పటికి ఆన్‌లైన్‌ విధానం ద్వారా 5017 పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం. రూ.లక్షా 7 వేల కోట్ల పెట్టుబడులు సమకూరాయి. అత్యంత సులభతర పారిశ్రామిక విధానం మన వద్ద అమలు చేస్తున్నాం. జయశంకర్‌ సార్కు ఆనాడే చెప్పిన.. తెలంగాణ ధనిక రాష్ట్రమని. సార్కు చెప్పినట్టే ఆదాయ వృద్ధిలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది.. వరంగల్లో టెక్స్‌టైల్‌ పార్కు, మహబూబ్‌నగర్‌లో ఫార్మాసిటీ వచ్చినయి. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు జరుగుతయి.

వచ్చే జూలైలో కాళేశ్వరం నుంచి వరంగల్‌కు నీళ్లను పారించి బంగారు తెలంగాణ కంటే ముందు బంగారు వరంగల్‌ స్వప్నం నిజం చేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించి ఓరుగల్లునుంచి అత్యంత కీలకమైన ప్రకటనను ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 8684 గ్రామ పంచాయతీలకు అదనంగా నాలుగు నుంచి అయిదువేల కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తామన్నారు.600 జనాభా ఉన్న తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ ప్రతి గ్రామానికి రూ.10-30 లక్షలు అభివృద్ధి నిధులను ఇచ్చేవిధంగా బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని సీఎం పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టానికి సమూల మార్పులు చేసి, గ్రామ స్వరాజ్యానికి కొత్త అర్థం ఇచ్చే రీతిలో రాష్ట్రంలోని గ్రామాలను స్వర్గసీమలుగా మారుస్తా న్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు చట్టబద్ధత కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తాం. అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

వరంగల్‌ ఇప్పటికే విద్యాహబ్‌గా మారింది. ఇకపై వచ్చే విద్యాసంస్థలన్నీ సాధ్యమైనంతవరకూ వరంగల్లోనే నెలకొల్పుతాం.గిరిజన విద్యాసంస్థలతో సహా ఇప్పటికే మంజూరైన మరిన్ని విద్యాసంస్థలను వరంగల్లోనే ఏర్పాటు చేస్తం. పర్కాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎప్పట్నుంచో అడుగుతున్న పరకాల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తం. పరకాల అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రత్యేకంగా మంజూరుచేస్తున్న అని తెలిపారు.

విద్యావేత్తలు,విదేశీ వ్యాపారవేత్తలు, వచ్చేందుకు పారి శ్రామికవేత్తలకు, ప్రముఖుల రవాణాకు అనువైన సౌకర్యం కల్పిస్తం. ఇందుకు వీలుగా పక్కనే ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పునరుద్ధరిస్తం. పూర్తిస్థాయి విమానాశ్రయంగా కాకపోయినా, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు వచ్చిపోయే విధంగా తీర్చి దిద్దు తాము.రైల్వేమార్గంలో ఉత్తర, దక్షిణ భారత దేశాలకు కేంద్రమైన కాజీపేట రైల్వే జంక్షన్‌ ఉండటం టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ఉన్న సౌకర్యాలకు తోడు మరిన్ని కొత్త మార్గాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకొస్తున్నది. ఔటర్‌ రింగురోడ్డుతో వరంగల్‌ రూపురేఖలే మారిపోతయి.

వచ్చేఏడాది జూన్‌, జూలై నాటికి వరంగల్‌ ప్రాంతానికి కాళేశ్వరంద్వారా సాగునీళ్లు ఇస్తాం. పాత వరంగల్‌ జిల్లాలోని 10 గ్రామీణ నియోజకవర్గాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. దమ్మున్న రైతులెవరైనా ఉంటే మూడుపంటలు పండించుకోవచ్చు. రైతాంగం వద్దనేదాకా నీళ్లు ఇవ్వ బోతున్నం. దేవాదుల ద్వారా కరువు ప్రాంతమైన జనగామకు నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపినం. అక్కడి రైతాంగం రెండుపంటల్ని సంబురంగా పండించుకుంటున్నది. బంగారు పంటలతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. బంగారు తెలంగాణ కంటే ముందు బంగారు వరంగల్‌లో ఆ స్వప్నం సాకారం కాబోతున్నది.

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కాజీపేట ఆర్వోబీ, ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రం రెండోదశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా భూమి పూజచేశారు. అక్కడ పక్కనే ఉన్న టెక్స్‌టైల్‌ పార్కు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. వేర్వేరు శిలాఫలకాలను నాలుగింటిని,ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌, పసునూరి దయాకర్‌, సీతారాంనాయక్‌, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్‌, శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, దాస్యం వినయాభాస్కర్‌, వొడితెల సతీశ్‌, కొండా సురేఖ, రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కొండా మురళి, శంభీపూర్‌ రాజు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పేర్వారం రాములు, గాంధీనాయక్‌, కిషన్‌రావు, గుండు సుధారాణి, బొల్లం సంపత్‌కుమార్‌, రాజయ్యయాదవ్‌, వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితర పార్టీ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వరంగల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయడానికి ముందు.. రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండలోని హరితహోటల్లో 22 కంపెనీల ప్రతినిధులతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొన్నది. మంత్రి కే తారకరామారావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, కంపెనీల ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ వారిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం టెక్స్‌టైల్‌ రంగంలో ఫ్యాషన్‌ డిజైన్‌కు సంబంధించి వస్తున్న మార్పులు, పరిణామాలపై సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే వరంగల్లో అతిపెద్ద వస్త్రనగరికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులు, దేశ, విదేశాల్లో వివిధ ప్రాంతాల్లోని కంపెనీల ప్రతినిధులతో చర్చించి.. తొలిరోజే రూ.3400 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ ఒక్కరోజు జరిగిన ఒప్పందాలతో ప్రత్యక్షంగా 25వేల ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా సుమారు 50వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. వన్‌స్టాప్‌ విజన్‌ అన్న నినాదంతో నూలుపోగు నుంచి వస్త్రం వరకు అన్నీ ఒకేచోట తయారయ్యే విధంగా వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎన్నడూలేనివిధంగా టెక్స్‌టైల్‌ రంగానికి బడ్జెట్‌లో రూ.1280కోట్లు కేటాయించారని వివరించారు. రాష్ట్రం లోని గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల, వరంగల్‌లో చేనేత పరిశ్రమలకు ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా నూలు, రసాయనాలపై 50శాతం.. పవర్‌లూమ్స్‌పై 10శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు చేయూ తనివ్వాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పేద ప్రజలకు పంపిణీ చేసే దుస్తులను చేనేత పరిశ్రమల నుంచి కొనుగోలుచేసి, వారికి ఆర్థికసహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్‌ లోతైన ఆలోచనతో చారిత్రక వరంగల్‌ నగరంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు రావడం ఒక అద్భుతమని అన్నారు. దేశంలోనే మహోన్నతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థపదార్థాలను బయటికి పంపించేందుకు కంపెనీల ప్రతినిధులు జాగ్రత్తగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. టెక్స్‌టైల్‌ పార్కు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మంత్రి కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్‌, అజ్మీరా సీతారాంనాయక్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, కొండా సురేఖ, ఆరూరి రమేశ్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, మేయర్‌ నన్నపునేని నరేందర్‌, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కొండా మురళి, శంభీపూర్‌ రాజు, హ్యాండ్లూమ్‌ సెక్రటరీ శైలజ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి, మున్సిపల్‌ కమిషనర్‌ శృతి ఓఝా పాల్గొన్నారు.

Other Updates