”సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్థనద్వయం,

ఏకమాపాత మధురమన్యదాలోచనామృతం” అన్న పెద్దలమాట నిత్యసత్యం. అయితే సాహిత్యం ప్రజలందరికీ చేరుతున్నదా అనేది ప్రశ్న. వృత్తాలు, అలంకారాలు, చిత్ర కవిత్వాలు, బంధ కవిత్వాలు పండితజనాన్ని రంజింపచేశాయి. సామాన్య పాఠకజనానికి ఇవి అంతగా అర్థంకాకపోవడం అందరికీ తెలిసిన విషయమే.

సామాన్య ప్రజాబాహుళ్యంలో సాహిత్యం బుర్రకథలు, హరికథలు, ఒగ్గుకథలు వంటి ప్రదర్శనారీతుల మాధ్యమంగా నిలిచిపోయింది. విద్యావంతులైన పండితవర్గం ఈ పామర జనరంజకాలైన ప్రదర్శనా కళలని, జానపద సాహిత్యాన్ని చిన్నచూపు చూశారనేది కూడా వాస్తవం. ఎక్కడో పాల్కురికి సోమన లాంటివారు జానపద ధోరణిని ఆచరించారు తప్ప పండిత వర్గం ఈ తరహా సాహిత్యాన్ని ఆదరించలేదనేది కాదనలేని సత్యం. అందరిని అలరించే జానపద సాహిత్యానికి శిష్టసాహిత్య రూపం ఇవ్వడానికి ఆ సాహిత్యానికి వికాసం కల్పించడానికి కృషి చేసిన మహనీయులు సిద్ధిపేట జిల్లాకు చెందిన రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి. తందనాన రామాయణ ప్రవచనాన్ని, కేవలం రచనగానే కాకుండా తమ ప్రవచన విధానానికి భక్తితత్వ ప్రచారానికి అనుగుణంగా మలుచుకొని ప్రదర్శించారు. తెలంగాణ జిల్లాల్లో ”రామనామాన్ని” ఊరూరా వాడవాడలా ప్రచారం చేసిన ప్రజాకవి, వాగ్గేయకారులు, తెలంగాణా వైతాళికులు విధుమౌళి శాస్త్రి.

జీవిత వ్యక్తిత్వం:
విధుమౌళి శాస్త్రి సిద్ధిపేట జిల్లా గజవెల్లి గ్రామంలో ఆనందనామ సంవత్సరం చైత్ర శుద్ధ ద్వాదశి 1914 ఏప్రిల్‌ 7న జన్మించారు. తల్లిదండ్రులు విఠాల రాజయ్య శాస్త్రి వెంకమ్మలు. భార్య పద్మావతి. రుక్మాభట్ల నర్సయ్యగారికి దత్త పుత్రుడైనందున వీరి ఇంటి పేరు రుక్మాభట్లగా మారింది. ?వ ఏటనే తండ్రిని కోల్పోయిన వీరి ప్రారంభ విద్యాభ్యాసం సోదరులు చంద్ర మౌళి శాస్త్రి, రాజమౌళి శాస్త్రిల వద్ద ప్రారంభమైంది. విధుమౌళి శాస్త్రిలోని రామభక్తిని గమనించిన సోదరుడు చంద్రమౌళి శాస్త్రి రామతారక మంత్రోపదేశం చేశారు. శ్రీశ్రీశ్రీ యతివర భావానందస్వామివారి నుండి ఆధ్యాత్మరామాయణం పారాయణం చేయుమని పొందిన ఉపదేశం తర్వాతకాలంలో తందనాన రామాయణాది గేయకావ్య రచనకు ప్రేరణయైంది.

విధుమౌళి శాస్త్రి తమజీవితంలో ఏ కార్యాన్ని జీవితంలో యశస్సునుగాని, అర్థాన్నిగాని కోరి ప్రారంభించింది లేదు. తన భక్తిప్రచారోద్యమంపైననే అచంచలవిశ్వాసం కలిగిఉండేవారు. నిరాడంబరంగా, నిస్వార్థంగా జీవనం గడిపారు. ఏదైనా కార్యనిర్వహణం చేసినా, ఏదేవాలయ పునరుద్ధరణ గావించినా, ఏకొత్త దేవాలయం నిర్మించినా ఎవరికో ఒకరికి లేదా కొందరికి జీవనోపాధి కలగాలన్నదే లక్ష్యం తప్ప స్వీయ ప్రయోజన కాంక్ష వీరిలో ఉండేది కాదు.

గజవెల్లి గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న అనేక గ్రామాలు పర్యటించి, ఆయా గ్రామాలలోని భక్తులచే భజనలు చేయిస్తూ భక్తిప్రచారం కావించేవారు. మహారాష్ట్ర సంప్రదాయకళయైన ”చక్రిభజన” విధానంనుంచి స్ఫూర్తినిపొంది, తాముకొన్నిభజనలను రచించి వాటిని రాగతాళబద్ధం గావించి, భక్తులకు నేర్పి చక్రిభజన చేసే విధానానికి వన్నె తెచ్చారు. విధుమౌళి శాస్త్రి సహజకవులు, పండితులు. అందుకే సంగీతశైలి జానపదంలోను, సాహిత్యశైలి పాండిత్యంలోనూ తోణికిసలాడుతుంటుంది.

తెలంగాణా ప్రాంతంలో రజాకార్ల ఉద్యమం పతాకస్థాయిలో సాగుతున్న దశలో 108 భజన సంఘాలను స్థాపించి, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించారు. జీర్ణదేవాలయాల పునరుద్ధరణకు కృషి చేశారు. ఆధ్యాత్మికరంగంలో నిష్ణాతులైన మహాత్ములతో ఆత్మీయ భావాన్ని పొందారు. పండితులలో మహాపండితుడిగా గౌరవింపబడి, సామాన్యు లలో భక్తిభావ బీజాలను నాటి వారి హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొని రామభక్తుడిగా జీవితాన్ని గడిపారు. కారణాంతరాల వల్ల గజవెల్లి నుంచి వార్ధక్యదశ ప్రారంభంలో కరీంనగర్‌ జిల్లా రామాజీపేట శ్రీరామక్షేత్రంలో నివాసంచేసి క్షయనామ సంవత్సరం కార్తీక బహుళ అష్టమి రోజున?1986 నవంబర్‌ 24న ”శ్రీరామునిలో ఐక్యమయ్యారు.”

తందనాన రామాయణం:
విధుమౌళి శాస్త్రి తెలుగు సాహిత్యానికి అందించిన చక్కని ప్రక్రియ తందనాన ప్రక్రియ. జానపద సాహిత్యంలో సహజత్వానికి కావ్యగౌరవం కలిగించి శాస్త్రిగారు అనేక తందనాన గేయకావ్యాలను రచించారు. రచనలో, ప్రక్రియా ప్రదర్శనలలో బహుళప్రాచుర్యం పొందినది తందనాన రామాయణం.

వాల్మీకి రామాయణంతో పాటు ఆధ్యాత్మరామాయణం, ఆనంద రామాయణం, రామచరితమానస్‌, రాధేశ్యామ్‌ రామాయణం, యదార్ధ రామాయణం, రంగనాధరామాయణం, విచిత్ర రామాయణం, మోక్షగుండ రామాయణాలను, మహాభాగవత పద్మపురాణాది గ్రంథాలను ఆధారంగా చేసుకొని తందనాన రామాయణాన్ని రచించారు. అంతే కాకుండా ప్రక్షిప్తము లేదా కథాక్షేపము పేరుతో జానపదులలో ప్రచారం లో ఉన్న శ్రీరామ కథా వృ త్తాంతాలతో కథా రచన సాగింది.

”రామరామ సీతారామా జయరామరామ
బాలా నగరాజునందనా జయరామరామ”

అనే పల్లవితో గజవెల్లి గ్రామంలో ప్రారంభమైన తందనానరా మాయణ రచనకు దీకొండ బాలనర్సు లేఖకుడు కాగా, సోదరుడు చంద్రమౌళిశాస్త్రులు గ్రంథపరిష్కర్తలు. తందనాన రామాయణంను 1950లో శ్రీ వెంకటేశ్వర పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ వారు ముద్రించారు.

యక్షగానాది వివిధ ప్రక్రియల నుండి శారదగాళ్ళ పాటలు మొదలగు గేయాల నుండి రకరకాల రూపాలను గ్రహించి పటిష్టమైన విశేష ప్రక్రియా రూపంగా తందనానరామాయణం విరాజిల్లినది. ముత్యాల సరాలవలె మాత్రాఛందస్సులో సాగుతుంది. ఒక విభాగం పూర్తికాగానే విరుపువస్తుంది. ఆ విరుపులో వంత వస్తుంది. ఒక పాత్ర యొక్క వచనాలు పూర్తికాగానే పల్లవి పునరావృతం అవుతుంది. మాతృవిభజన నియమితంగా ఉండక 13,14,15మాత్రలుగా పాదాలవిభజన ఉంటుంది. అక్కడక్కడ ప్రాసయతిని వాడారు.

ఎనమిది రకాల గతులు, లయలు, వంతలు ప్రత్యేక రీతులలో వాడారు. ఈ గతులవల్లనే కథాగమనానికి పుష్ఠిచేకూరి రసావిష్కరణ జరిగి ప్రేక్షకశ్రోతలు ఆనందించేవారు. గురువుగారి సూచనచే ”తందాన తాన” అనే వంత పదాన్ని ”జయరామ రామ” గా మార్చారు. భక్తితత్వ ప్రచారానికి సాధనంగా భక్తిభావ బోధనలచే ప్రవర్తనలో పరివర్తనను పొందేలా తందనాన రామాయాణాన్ని మలుచుకున్నారు.

పామరజనులకు హస్యరసస్ఫోరకంగా సాగిన వీరి రచనల్లో జనసామాన్యంలో వాడుకలో ఉన్న సామెతలను, పలుకుబళ్ళను ప్రయోగించి చక్కని నీతిని, ధర్మమును ప్రభోదించుట వీరి కావ్యాలలో ప్రధానాంశంగా చెప్పవచ్చు.

తందనానరామాయణంలో పోగాలము వచ్చెర, కొరవితో తలగోక్కునుట, కూటిలో మన్నుబడు, నల్లివలె వాని నలిపేతు, చేటుకాలము వచ్చెర, స్త్రీబుద్ధి ప్రళయాంతకం, కండ్లకావరము వంటి పద ప్రయోగాలు కనబడతాయి.

ఉర్దూ భాషాప్రభావం రచనలో కనిపిస్తుంది బిరాన, సరకు, హంగామా, శభాసు వంటి పదాలను వాడారు. వేసిండు, ఏడనుండెనో, పిరికిబంటు, శుంఠ, పాతకి, ఇకిలించుట, మొదలైన తెలంగాణా మాండలిక పదాలు కన్పిస్తాయి. సందర్భానుసారంగా నీతినియమాలను, లోకోక్తులను ప్రబోధించటంలో శాస్త్రిగారి నేర్పు అనితర సాధ్యం. నవరసాల సమ్మేళనంతో ప్రేక్షకులను, శ్రోతలను తన్మయులను గావించు నేర్పును ప్రదర్శించుచు, సులభశైలిలో సాగిన తందనానరామాయణం ”వాక్యం రసాత్మకం కావ్యమ్‌” అన్న విశ్వనాథుని సూత్రానికి అనుగుణంగా ప్రతి వాక్యం రసాత్మకమై తెలంగాణా ప్రజాహృదయాలలో చిరస్థాయిగా నిలిచింది.

డా. పార్నంది రాంకుమార్‌
tsmagazine

Other Updates