sampadakeeyamకొత్త రాష్ట్రంలో సరికొత్త తరహాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు ప్రయోజనం కల్పించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిపాలనలో సమూల మార్పులు తేవడం ద్వారానే ఆశించిన లక్ష్యాలు సాధించగలమనే విశ్వాసంతో ఏకకాలంలో కొత్తగా ఇరవై ఒక్క జిల్లాలు ఏర్పాటయ్యాయి. అరవైయేళ్ళ సమైక్య పాలనలో కేవలం ఒక్కటంటే ఒక్క జిల్లా కొత్తగా ఏర్పాటైతే, ఇరవై ఎనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి ఇరవై ఒక్క జిల్లాలను ఏర్పాటు చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. వాస్తవానికి మారుమూల గ్రామాలకు దూరాభారమైన జిల్లా కేంద్రాలకు వెళ్ళి రావడంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న వ్యయ ప్రయాసలు వర్ణనాతీతం. అదేవిధంగా తడిసిమోపెడైన విధి నిర్వహణ తీరు కార్యభారంగా పరిణమించడం, నిర్దేశించిన విధంగా సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా తయారైంది. అరవై నాలుగు మండలాలు ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా ఇజ్రాయిల్‌ దేశంకంటే పెద్దది కావడం గమనిస్తే దశాబ్దాలుగా పేద, బడుగువర్గాల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో ఊహించుకోవచ్చు.

ఇన్నాళ్లుగా పేదలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను శాశ్వతంగా రూపుమాపే లక్ష్యంతో ఏడాదికాలం క్రితమే ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియపై దృష్టిసారించింది. ప్రజల మనోభావాలు, అధికారుల నివేదికలు క్షుణ్ణంగా సమీక్షించిన పిదప ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. సమగ్ర పరిశీలనల అనంతరం ‘దసరా’ పండుగనాడు ముఖ్యమంత్రి చేతులమీదుగా సిద్ధిపేట జిల్లా ప్రారంభంకాగా, మరో ఇరవై జిల్లాలకు మంత్రులు, సీనియర్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ, పరిపాలనారంగంలో వినూత్న అధ్యాయానికి ఇది శుభారంభం.

జిల్లాలు ప్రారంభమయ్యాక వారానికోసారి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ఆయా జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, కష్టసుఖాలు నేరుగా జిల్లా కలెక్టర్లకు వెళ్ళబోసుకున్నారు. తమ దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకు అందజేసి, ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరిపోయే తరుణం ఆసన్నమైందని మురిసిపోయారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అధికార యంత్రాంగం ఇప్పుడిప్పుడే కుదురుకొని పాలనా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి.. జిల్లా కలెక్టర్లకు కీలకమైన మార్గదర్శనం అందించారు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన కొనసాగించాలని, రాబోయే పదేళ్ళ కాలానికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతీ అంశంపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని సీఎం వారికి సూచించారు. పరిపాలనాదక్షుడైన ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపంగా కొత్త జిల్లాలు అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు తీస్తాయనడంలో సందేహంలేదు.

Other Updates