silpi

తండ్రి లోహశిల్పాలు చేయడంలో చేయి తిరిగిన శిల్పి. కొడుకేమో ఆయన భుజాలపై నిలబడి సమకాలీన, ఆధునిక శిల్పకళా ప్రపంచాన్ని తిలకించి, అధ్యయనం చేసి, అభ్యసించి, అపురూపమైన ‘ఆహా.. ఓహో” అనిపించే శిల్పాలను తనదైన శైలిలో రూపొందిస్తున్న ప్రవర్థమాన శిల్పి.

మహబూబ్‌నగర్‌ జిల్లా తెల్కపల్లికి చెందిన సంప్రదాయ శిల్పి – యర్రగిన్నిల జగదీశ్వరాచారి. జంగమ్మల పుత్రుడు. ఈ ప్రవర్థమాన శిల్పి – శివరామాచారి. ఆయన బాల్యమంతా తన తండ్రి రూపొందించే దేవుడి శిల్పాలు చూసి ప్రభావితుడైనాడు. తండ్రి దగ్గరే విగ్రహాలను నిగ్రహంగా రూపొందించే కిటుకులు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మైనపు నమూనాలు చేయడం, రేకు తలంపై ఉబ్బెత్తుగా రూపాలను సృష్టించే ఉత్సేద (Embosing) ప్రక్రియ లాంటివి నేర్చుకుని సృజనాత్మక శిల్పాలు తయారుచేశాడు.

ఇంటిపట్టున ఉండి ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాక, ఇక ఆధునిక శిల్పి కావాలనే కాంక్షతో హైదరాబాద్‌ వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి బి.ఎఫ్‌.ఏ. చదివాడు. అనంతరం హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం తాలూకు సరోజినీనాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఎం.ఎఫ్‌.ఏ. పూర్తి చేశాడు. అక్కడ తన గురువు – డి.ఎల్‌.ఎన్‌. రెడ్డి పనితీరుకు ఎంతో ప్రభావితుడైనాడు. ఈ ప్రభావం ఆయన రూపొందించే తరహా శిల్పాలు చేయడంలోకాదు, ఆయనలాగా ఒక పద్ధతి ప్రకారం కళాధ్యయనం చేయడంలో, ఒక సిద్ధాంతానికి కట్టుబడి నిరంతరం శిల్ప నిర్మాణంలో మునిగిపోవడంలో మాత్రమే. డిఎల్‌ఎన్‌ దేశికత్వంలో శివరామాచారి స్వంత శైలిగల శిల్పిగా పరిణామం చెందాడు.

ఇవ్వాళ శివరామాచారి అంటే స్త్రీ, పురుషుడు, ప్రకృతి, ప్రయాణానికి సంబంధించిన శిల్పాలు మలిచే మరుపురాని శిల్పి. స్త్రీ, పురుషులను ప్రకృతిలో ఎలా విలీనం చేయవచ్చనేది తన శిల్ప రచన వెనుక భావమని శివరామాచారి అంటారు. వాస్తవ రూపాలైతే ఆ శిల్పాలు ఫొటోల మాదిరిగానే ఉంటాయి. బాహ్య ప్రపంచంలో కనిపించే వస్తువును ఉన్నదిఉన్నట్టుగా, ఏ మాత్రం భేదం లేకుండా మలిచేది, అనుకరుణే తప్ప సృజన కాదంటారు. భౌతికరూపంకన్నా మనో చిత్రం ముఖ్యం.. అంటాడు శివరామాచారి. ఉత్తమ శిల్పం ప్రకృతికి ప్రతికృతి కూడా కాదు. అట్లా అని ప్రకృతిని పూర్తిగా విస్మరించడంవల్ల కూడా శిల్పం కలకాలం నిలవదంటారు. నిజమైన శిల్పి తనదైన మనో సంబంధ ప్రపంచంతోపాటు బాహ్య జగత్తుపైన ఆధారపడి రచన చేస్తేనే అది సృజనాత్మకమవుతుంది అని శివరామాచారి చెబుతారు.

ఇట్లా రూపుదిద్దిన శిల్పాలతో, తొలుదొలుత ఆయన ‘అనంతయాత్ర’ శీర్షికన 2007లో వ్యష్టి శిల్ప కళా ప్రదర్శన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశాడు. దీని పూర్వ ప్రదర్శన హైదరాబాదులో నిర్వహించాడు. ఆ తర్వాత 2010లో ‘మాధ్యమం – సందేశం’ అనే అంశంపై హైదరాబాద్‌లో రెండో వ్యష్ఠి శిల్పకళా ప్రదర్శన చేశాడు. మూడో వ్యష్ఠి శిల్పకళా ప్రదర్శన ‘ద్రవీభూతమైన విశ్వం’ అనే అంశంపై 2013లో హైదరాబాద్‌లో నిర్వహించాడు. ఈ మధ్యనే తన మిత్రుడు, వర్ధమాన చిత్రకారుడు ఆనంద్‌ గడపతో కలిసి హైదరాబాద్‌లో సంయుక్తంగా ‘చిత్ర-శిల్ప కళా ప్రదర్శన’ చేశాడు. ఇందులో శివరామాచారి రూపొందించిన వింతైన శిల్పాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కఠినమైన లోహంతో చేసిన మృదువైన ఆకులో తొడిమ స్థానంలో పొదిగిన విచిత్ర రూపాలు శిల్పి హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. శివరామాచారి శిల్పాలు విచిత్రమైనవే కాకుండా విలక్షణమైనవి కూడా.

అందుకే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ప్రత్యేక అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. అంతకుముందు 2011లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. 2003లో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీవారి ప్రత్యేక ప్రశంసా సర్టిఫికెట్‌ లభించింది. 2002లో, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కళా ప్రదర్శనలో నగదు బహుమతులను వారు రూపు దిద్దిన శిల్పాలు గెలుచుకున్నాయి. 2002-2004లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్‌ లభించింది.

వీరి శిల్పాలలో వైవిధ్యం, సృజన ఉట్టిపడుతుంది కాబట్టి న్యూయార్క్‌, దుబాయ్‌ దేశాల్లో కళాప్రియులు సేకరించారు. హైదరాబాద్‌, న్యూఢిల్లీ, చెన్నైలలో, కొన్ని ఆస్పత్రులు, పలు హోటళ్ళలోనూ వీరి శిల్పాలు సేకరించి అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర బాల కుటీర స్వర్ణోత్సవ ప్రతిమను, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, హైటెక్‌ సిటీ, అపోలో ఆస్పత్రికి, జైస్‌ మేయర్‌ మినిస్ట్రీకి కావలసిన శిల్పాలు చేసిచ్చారు.

‘అచల సంచార శిల్ప స్టూడియో పక్షాన హైదరాబాద్‌ నుంచి కన్యాకుమారి దాకా టెంపోలో 3800 కిలో మీటర్లు ఆరుగురు కళాకారులతో కలిసి ప్రయాణిస్తూ రూపొందించిన శిల్పాలు-దారి ప్రక్కన దొరికిన దారువుతో అప్పటికప్పుడు మదిలో మెదిలిన అంశాన్ని వ్యక్తం చేస్తూ ఆయన రూపొందించిన ఆరడుగుల ‘ప్రయాణం’ శిల్పం చెప్పుకోదగింది. ఆ తర్వాత మరో రెండు శిబిరాలకు కూడా ఆయన సమన్వయకర్తగా ఉండి శిల్పాలు రూపొందించాడు.

ఇంతేకాకుండా 2002 నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, న్యూఢిల్లీ, కాకినాడలో ఏర్పాటు చేసిన డజను కళా శిబిరాలలో శివరామాచారి పాల్గొని శిల్పాలు మలిచాడు. శిల్పాలకు సంబంధించి రెండు వర్క్‌ షాప్‌లలోనూ పాల్గొన్నాడు.

2003 నుంచి పదహారు పర్యాయాలు హైదరాబాద్‌, ముంబై, చెన్నై, ఢిల్లీలలో నిర్వహించిన సమష్టి కళా ప్రదర్శనలలో తన శిల్పాలతో పాల్గొన్నాడు. 2000 సంవత్సరం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వార్షిక కళాప్రదర్శనలలో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ కళా ప్రదర్శనలలో, ఎఐఎఫ్‌ఏసియస్‌ కళా ప్రదర్శనలలో తన ఉనికిని ప్రదర్శించాడు.

తాను ఒకసారి రూపొందించిన శిల్పం ఛాయలు మళ్ళీ రాకూడదనే ఉద్దేశ్యంతో ఒకేసారి అనేక మాధ్యమాలలో వేర్వేరు శిల్పాలు వైవిధ్యంగా రూపొందిస్తున్నానంటాడు శివరామాచారి. ఆయన ఇనుము, కంచు, స్టీల్‌, రేకు, కలప, ఫైబర్‌గ్లాస్‌, టెర్రకోటా దేనితో శిల్పం చేసినా ఇది శివరామాచారి చేసిన శిల్పం అని చెప్పొచ్చు.

అయితే ఆయన ఎవ్వరికీ పోటీ కాదు అంటాడు. తన బాణీ తనది; తన పద్ధతి తనది అంటాడు. రోజురోజుకు హైదరాబాద్‌ నగర సౌందర్యాన్ని పాడు చేస్తున్నారని ఆయన కళా హృదయం ఆక్రోసిస్తుంది. కళా ప్రదర్శనలు గదులకు పరిమితం కాకుండా వీధులలో ఏర్పాటు చేస్తే – వాడ కళా ప్రదర్శనలు వాడుకైపోతే – జన సామాన్యంలో కళపట్ల చైతన్యం కలుగుతుందనేది ఆయన అభిప్రాయం.

ఇంకా ఆయనలో కళా నిర్మాణం విషయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటికి అంతులేదు, సంతృప్తి లేదు. ఒకవేళ ఉంటే ఇక శిల్పిగా జీవితం చాలించినట్టే కదా? అంటారాయన.

ముచ్చటగా మూడేండ్లపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని శిల్ప-చిత్ర లేఖన శాఖలో శిల్పం బోధించిన శివరామాచారి ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ శిల్పిగా స్థిరపడ్డాడు.

టి. ఉడయవర్లు

Other Updates