kotaluతెలంగాణ ప్రాంతానికి నదీమతల్లుల అనుగ్రహం పుష్కలంగా ఉంది. నలువైపులా నదులతో కళ కళలాడే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉత్తరాన పెన్‌గంగా, ప్రాణహిత నదులు, తూర్పున వేగంగా ప్రవహించే గోదావరి నది, దక్షిణాన కృష్ణా, తుంగభద్రా నదులు, పడమట దిశలో మంజీరా నది, సహజసరిహద్దులుగా గల సురక్షిత, సువిశాలమైన రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి మూడువేల సంవత్సరాలనాటి చరిత్ర ఉంది. తొలి కాలపు నాగరికత సంస్కృతులకు నిలయం తెలంగాణ. కోటిలింగాల, ధూళికట్ట, కొండాపురం లాంటి ప్రాంతాలలో బయటబడ్డ ప్రాచీన అవశేషాలు దీనిని ధ్రువపరుస్తున్నాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన శాతవాహన చక్రవర్తులు ధర్మపురికి సమీపంలో ఉన్న కోటిలింగాలను కేంద్రంగా చేసుకుని చాలాకాలంపాటు పాలన సాగించారు. అలాగే ఓరుగల్లును కేంద్రంగా చేసుకుని కాకతీయ రాజులు గిరిజన జాతులను ఏకం చేసి వారిని ఏకతాటిపై తెచ్చిన గోండు రాజులు కూడా ఈ ప్రాంతంలోగల ఆదిలాబాద్‌లోని సిర్పూర్‌ని కేంద్రంగా చేసుకుని చాలా సంవత్సరాలపాటు పాలన సాగించినవారే.

ఎన్నో వందల ఏళ్ళ (సుమారు 400 ఏళ్ళు) క్రితం వైఢూర్యపురంగా విరాజిల్లిన నేటి ఈ వడూర్‌కిగల చారిత్రక నేపథ్యం అంతా ఇంతా కాదు. లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం వైఢూర్యపురాన్ని వెంకటరాయుడు అనే రాజు పాలించేవారు. కానీ అంతకుముందునుండే వైఢూర్యపురానికి చారిత్రక నేపథ్యం ఉంది. నిమ్మలపట్టణ నిర్మాణానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చింది ఈ వైఢూర్యపురం. అంతటి ధనధన్యాలకు నిలయం ఈ వడూర్‌కోటకి అంతటి సంపదకు నిలయమైన వైఢూర్యపురం, నిమ్మల (ప్రస్తుత నిర్మల్‌) పట్టణానికి సుమారు 35 కి.మీ. దూరంలో నిర్మల్‌ నుండి ఆదిలాబాద్‌ వెళ్ళే మార్గమధ్యలో బోధ్‌, నేరడికొండ మండల కేంద్రాలకు సమీపాన ఉన్నది. అప్పట్లో వైఢూర్యపురాన్ని అందులోని ఖజనాను కేంద్రంగా చేసుకుని వెంకట్రాయుడు నిమ్మల, బొందిడి రాజ్యాలను పాలించేవాడు. ఆ కాలంలోనే 35 కులాలు, అనేక కులవృత్తులకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. ఓరుగల్లును పాలించిన కాకతీయ వంశానికి చెందిన చివరి ప్రభువు ప్రతాపరుద్రుని కాలంలో వెంకట్రాయుని పూర్వులు నాగ్‌పూర్‌ ప్రాంతం రాజప్రతినిధులుగా ఉండేవారు. వీరిది వెలమ కుటుంబం. 1650-1700 మధ్య కాలంలో మహారాష్ట్రులు తమ ప్రాబల్యం పెంచుకొని చిన్న చిన్న సంస్థానాలను, ప్రాంతాలను కైవసం చేసుకున్నారు. ఆ గందరగోళం ఆరాచకాలలో వెంకట్రాయుడు మహారాష్ట్రులతో జరిగిన యుద్ధంలో కాలు పోగొట్టుకున్నాడు. కుంటివాడైనందున యుద్ధం నుండి వెను తిరిగినట్లు చారిత్రక సమాచారం. ఆ తరువాత కాలంలో వెంకట్రాయుడు విశ్రాంతికొరకై తన భార్య దమ్మమ్మతో పాటు తమ్ముడు కనింగరాయుడ్ని వెంటబెట్టుకుని ఆసిఫాబాద్‌కు దగ్గరలోని వాంకిడికి చేరుకున్నాడు. అతని వెంట అప్పుడు కొందరు అనుయాయులతోపాటు వెలమ సంఘం మేధావి వర్గం వారు, కొందరు ముస్లిం మతానికి చెందిన విశ్వాసులైన సర్దార్‌లు కూడా ఉన్నారు. ఆ సమయంలో అతను స్థానిక గిరిజనులతో చెలిమి చేసుకుని అతని దగ్గరున్న ధనంతో అడవి సంపదను స్వాధీనపరచుకుని గిరిజనులకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత కాలంలో మళ్ళీ అతను అక్కడి గిరిజన మహిళ అయిన చంద్రమ్మను పెళ్ళి చేసుకున్నాడు. అతని భార్య చంద్రమ్మ నిమ్మల రాజ్యపు రాజప్రతినిధిగా వైఢూర్యపురం కోట నుండి ప్రజారంజక పరిపాలన సాగించినట్లు తెలుస్తోంది.

వెంకట్రాయుడు తరువాత కాలంలో, తనకు నచ్చిన రీతిలో ఎత్తయిన కొండల మధ్య కోటను, రక్షణగా బురుజులను నిర్మించాడు. కోట సింహ ద్వారానికి రెండువైపులా కాకతీయ ముఖద్వారాలకు ఉన్నట్లే రెండు రాజసింహాల చిహ్నాలను చెక్కించాడు. ఆ చిహ్నాల చిత్రాలు ఇప్పటికీ మనం చూడొచ్చు. కొండలకు ఇరువైపులా వాటిని మనం చూడొచ్చు. ఒకనాటి అద్భుత చారిత్రక నేపథ్యం కలిగిన వడూర్‌కోట, ఆనాటి పట్టణం ఆనాటి రాచరిక వైభవాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూపరులను ఎక్కువగా ఆహ్లాదపరిచే కట్టడాలలో ముఖ్యమయినవి. సగరేశ్వరుని ఆలయం, రాజేశ్వర స్వామి గుడి, నగరం చుట్టూగల కందకం, నగరానికి నలువైపులా ఆంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ట, తటకాలు, కోనేరు బావి, శ్రీకృష్ణ మందిరం, జైలాని బాబా శివలింగయ్య స్వామి మందిరాలు, మహాలక్ష్మీ, పోచమ్మ, సరగమ్మ, కిల్లా మైసమ్మ, కిల్లా పోచమ్మల మందిరాలు నెలకొల్పబడి నేటికీ పూజలందుకుంటున్నాయి.

ఒకప్పుడు వైఢూర్యపురంగా పిలువబడ్డ వడూర్‌ పట్టణం అద్భుత చారిత్రక సంపదకేగాక ఆధ్యాత్మికపరమైన మందిరాలకు, సిద్ధపురుషులకు నిలయంగా నిలిచింది. దీనిలో భాగంగా శివలింగయ్య, జైలాని బాబా, అగ్గి మల్లయ్య, అజీజ్‌బాబాల వంటి తాపసులు, సిద్ధపురుషుల మహిమలు వెల్లివిరిసేవి. అలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలకు నెలవైన ఈ వడూర్‌ కోటను తెలంగాణ ప్రభుత్వం కొంతమేర పునరుద్ధరిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారటమేగాక గత చారిత్రకవైభవాన్ని వేలాదిమందికి తెలియజేసినట్లు అవుతుంది. అలాంటి స్థితి ఈ వైఢూర్యపురపు కోటకు త్వరలో కలగాలని ఆకాంక్షిద్దాం.

నాగబాల సురేష్‌ కుమార్‌

Other Updates