agricultureవ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించి చూపిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కొందరు ఆర్థిక వేత్తలు ఇప్పుడు వ్యవసాయం దండగ అంటున్నారన్నారు. అతి తప్పని మనం నిరూపించాలన్నారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఏప్రిల్‌ 25న రాజధాని నగరమైన హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల రాష్ట్రస్థాయి అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. అన్నం పెట్టే రైతును చిరునవ్వుతో చూడాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే వ్యవసాయం చేస్తున్న యువకులకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు.

ఇకపై ఆ పరిస్థితి మారిపోయే విధంగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేద్దామన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాచేవారని, ఎరువుల బస్తాల కోసం కొట్లాడుకునేవారని అన్నారు. అలాంటి పరిస్థితులు రానివ్వకుండా అన్నదాతలకు పెట్టుబడుల కోసం పంటకు ఎకరాకు రూ. 4వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇది దేశానికే తలమానికంగా తయారవుతుందన్నారు. తాను నీతీఆయోగ్‌ సమావేశానికి వెళ్ళినపుడు ఎరువుల పథకం గురించి 11మంది సీఎంలు, ప్రధానమంత్రి కూడా అడిగి తెలుసుకున్నారని అన్నారు.

మనం ప్రవేశపెట్టే పథకాల వల్ల ఐటీ ఉద్యోగులు కూడా వ్యవసాయానికి మళ్ళాలన్నారు. ఇప్పటికే కొందరు ఐటీ ఉద్యోగులు కూడా పాలీ హౌజ్‌లలో సేద్యానికి వచ్చారన్నారు. రైతులకు ముఖ్యమైన సమస్య కరెంటు అని దాన్ని మనం పూర్తిగా తొలగించి తొమ్మిది గంటలు ఉచితంగా, నాణ్యమైన త్రీఫేస్‌ కరెంటు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిరేటు 21శాతం ఉంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. అందువల్ల వ్యవసాయానికి మరింత వెసులుబాటు కల్పించాలన్నారు.

వ్యవసాయాధికారులకు వడ్డీలేని రుణమిస్తామని, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి రైతుల వద్దకే వెళ్ళి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

వ్యవసాయాధికారుల పోస్టులు మరో 500 ఏఈవోలను మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఏఈవోకు లాప్‌టాప్‌లు సమకూరుస్తామన్నారు. వ్యవసాయశాఖ అధికారులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా వ్యవసాయ శాఖ పద్ధతులు మార్చి వ్యవసాయాన్ని లాభాలబాటలో పయనింపచేయండని సీఎం ఉద్వేగంతో అన్నారు. ప్రతి రైతు సమాచారాన్ని సేకరించాలి. పేరు, ఇంటిపేరు, సెల్‌ నంబర్‌తో సహా తీసుకోవాలి. రైతులు ఏ సీజన్‌లో ఏ పంట వేశారు. ఏ పంటలు వేయాలనే దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

భూములు, రైతుల వివరాలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాల లెక్కలు జూన్‌ 10 కల్లా తీసుకోవాలన్నారు. అధికారులను వ్యవసాయ శాస్త్రవేత్తలుగా మార్చాలన్నారు. ఏటా 100-200 మందిని అధ్యయనానికి ఇజ్రాయెల్‌ పంపాలన్నారు. గ్రామాలలో రైతు సమాఖ్యలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లాలు, జిల్లాల నుంచి రాష్ట్రం ఇలా రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలు ఏర్పడాలన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం కంటే కూడా శక్తిమంతుడు కావాలన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ. 500 కోట్లు ఇస్తామన్నారు. రైతులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటి ద్వారా ఆర్థిక సహాయం చేస్తామన్నారు.

వ్యవసాయాధికారులకు భార్య, భర్తలు ఒకేచోట ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే హెడ్‌ క్వార్టర్‌లోనే ఉండాలనే నిబంధన ఏమీలేదని, ఎక్కడ ఉన్నా తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఇక అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒక శాఖ నివేదికకూ, మరోశాఖ నివేదికకూ పొంతన లేకుండా పోతుందన్నారు. ధాన్యం నిల్వకు కూడా ప్రతి గ్రామంలో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పైరవీకారులను దరిచేరనీయకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.4వేల ఆర్థిక సహాయం చేరేవిధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తెలంగాణ బాషలో రైతులతో ముచ్చటించి స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Other Updates