vileenamప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని కోరుతున్న శాసనసభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’గా శాసనసభలో ఫ్రంట్‌గా ఏర్పడ్డారు. ఈ ఫ్రంట్‌కు అధ్యక్షులుగా వి.బి. రాజు, శాసనసభలో ఎన్‌. రామచంద్రారెడ్డి, శాసనమండలిలో కె. రామచంద్రారెడ్డి ఫ్రంట్‌ నేతలుగా ఎన్నికైనారు. వి.బి. రాజు పత్రికలకు విడుదల చేసే ప్రకటన చదువుతూ ‘ప్రజా ఉద్యమ వెల్లువను అణచివేయడానికై ప్రభుత్వం అన్నిరకాల నిర్బంధ చర్యలను అమలు జరిపింది. పి.డి. చట్టం, తదితర చట్టాలలోని నిబంధనలను దుర్వినియోగపర్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారాన్ని నిరంకుశంగా ఉపయోగిస్తూ తన పార్టీకీ చెందినవారిని, సహచరులను జైళ్ళలో పెట్టిన తొలి ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డిని భావి చరిత్రకారులు వర్ణిస్తారు. గత ఐదు నెలలుగా ప్రశాంతత నెలకొన్నా నిర్బంధకాండ, రాజకీయ బెదిరింపులు కూడా విశృంఖలంగా కొనసాగుతున్నాయి. ప్రశాంత పరిస్థితిని అవకాశంగా తీసుకొని శాశ్వత పరిష్కారాన్ని రూపొందించడానికి మారుగా పరిష్కారానికై జరిగే ప్రతియత్నానికి ముఖ్యమంత్రి అవరోధాలు కల్పిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం మినహా మరోమార్గం లేద’ని అన్నారు.

గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం

రాష్ట్ర అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ఖండూభాయ్‌ దేశాయ్‌ ప్రసంగిస్తుండగా, తెలంగాణ ఐక్య సంఘటన సభ్యులు ‘జై తెలంగాణ’ నినాదాలతో చాలాసేపు అంతరాయం కలిగించారు. గవర్నర్‌ పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో ఈ సభ్యులు సభనుండి వాకౌట్‌ చేశారు.

తెలంగాణ మిగులు నిధుల విషయంలో, తెలంగాణ ప్రాంతీయ సంఘం (టీఆర్సీ)కు విస్తృత అధికారాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకై ఎదురుచూస్తున్నట్లు గవర్నర్‌ తమ ప్రసంగంలో వివరించారు.

పాత కాంగ్రెస్‌ ‘తెలంగాణ విభాగం’ ఏర్పాటు

తెలంగాణ ప్రదేశ్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌ అడ్‌హాక్‌ కమిటీ సమావేశం ఫిబ్రవరి 8న బషీర్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశాన్ని పాత కాంగ్రెస్‌ అగ్రనేత నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎనిమిదిమంది నగర కార్పొరేషన్‌ సభ్యులు, కాంగ్రెస్‌వాదులు వందమందిదాకా హాజరైనారు. ఎం.పి. రాజారామేశ్వరరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. కొత్తూరు సీతయ్యగుప్త, శాసనసభ్యులు సత్యనారాయణరావులను జంటనగరాల అడ్‌హాక్‌ కమిటీ కార్యదర్శులుగా నీలం సంజీవరెడ్డి నియమించారు. 31మంది సభ్యులతో కొత్తగా ఏర్పాటైన తెలంగాణా ఐక్య సంఘటనను రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా సభాపతి బి.వి. సుబ్బారెడ్డి గుర్తించారు. మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి శాసనసభలో ఈ ఐక్య సంఘటన నాయకుడు. ప్రతిపక్ష నాయకునికి లభించే అన్ని సౌకర్యాలు, హక్కులు ఆయనకు లభించాయి. ఆ సమయంలో గౌతు లచ్చన్న ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆ స్థానం నూకల రామచంద్రారెడ్డి ఆక్రమిస్తారని స్పీకర్‌ ప్రకటించారు.

తెలంగాణ ఐక్య సంఘటన సభ్యుల పేర్లు

1. ఎన్‌. రామచంద్రారెడ్డి, 2. వి.బి. రాజు, 3. సుమిత్రాదేవి, 4. ఎన్‌. విమలాదేవి, 5. రెడ్డిగారి రత్నమ్మ, 6. సంతోష్‌ చక్రవర్తి, 7. ఆర్‌. నరసింహరామయ్య, 8. కె.ఎస్‌. నారాయణ, 9. కె. అచ్యుతరెడ్డి, 10. కె. రాజమల్లు, 11. డా|| కె. నాగన్న, 12. కె. లక్ష్మీనరసింహారావు, 13. ఎం.ఎం.హషీం, 14. కొండా లక్ష్మణ్‌ బాపూజీ, 15. లక్ష్మీ నరసింహారెడ్డి, 16. రామ్‌భూపాల్‌, 17. సి. జగన్నాధరావు, 18. చిన్న మల్లారెడ్డి, 19. టి. అంజయ్య, 20. ఎం. మాణిక్‌రావు, 21. ఆర్‌. భూమారావు, 22. పోల్సాని నరసింగారావు, 23. జి. రాజారాం, 24. ఎం. బాగారెడ్డి, 25. శివరావు షెట్కార్‌, 26. జి. సైదయ్య, 27. టి.సి. కృష్ణారెడ్డి, 28. కుముదినీదేవి, 29. ఎం. శ్రీనివాసరావు, 30. వి. మధుసూదనరెడ్డి, 31. బి. లక్ష్మీకాంతరావు.

వీరిలో కొందరు ప్రత్యేక తెలంగాణ కోరే వారుండగా మరికొందరు తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలనే వారూ ఉన్నారు. పాల్వాయి గోవర్థన్‌రెడ్డిపేరు స్పీకర్‌కు సమర్పించిన జాబితాలో వున్నా ఆ తర్వాత ఆయన ఐక్య సంఘటనలో వుండబోవడంలేదని సభలో ప్రకటించారు.

కమాలొద్దీన్‌ తెలంగాణ వ్యతిరేక వైఖరి

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడ్తూ కాంగ్రెస్‌ సభ్యుడు కమాలొద్దీన్‌ తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మారు. తెలంగాణ ఉద్యమం అభివృద్ధి, వెనుకబాటుతనం, నిరుద్యోగం తదితర సమస్యలతో సంబంధం కలిగివున్న ఉద్యమంకాదని, ఇతర ప్రయోజనాలకోసం, బ్రహ్మానందరెడ్డిపట్ల కొందరికిగల వ్యతిరేకతవల్ల ఈ

ఉద్యమం ప్రారంభమైందని కమాలొద్దీన్‌ సభలో అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు గణాంకాలను కమాలొద్దీన్‌ సభలో వివరించారు.

ఫిబ్రవరి 10న జరిగిన చర్చలో పాల్గొన్న తెలంగాణ ఐక్య సంఘటన నాయకుడు నూకల రామచంద్రారెడ్డి ‘ప్రజాభిమతానుసారం వ్యవహరించకుండా అతుకులబొంతవంటి ఏదో ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదు. వాయిదావేస్తూ తప్పించుకుంటే సమస్య పరిష్కారం కాదు. ప్రాంతీయ సంఘానికి మరిన్ని అధికారాలు ఇచ్చినంత మాత్రానకూడా ఈ సమస్య పరిష్కారం కాదు. ఆందోళనను అణచివేసినంత మాత్రానకూడా ప్రయోజనం వుండదు. ప్రజల అభిమతమేమిటో నిర్దారించుకొని శాశ్వతంగా పనికివచ్చే మార్గాన్ని అన్వేషించాలి’ అని అన్నారు. కొత్తగా ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని కూడా రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

ప్రతిపక్ష (పాత) కాంగ్రెస్‌ నేత ప్రగడ కోటయ్య ప్రసంగిస్తూ ‘తెలంగాణ ప్రజల అభిమతానికనుగుణంగానే తెలంగాణ సమస్య పరిష్కరించాల’న్నారు.

ఆంధ్రకు చెందిన మరో శాసనసభ్యుడు పి. చెంగయ్య ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించాల’ని మరోసారి సూచించారు. గత సమావేశాల్లో కూడా ‘ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాల’ని తాను సూచించిన విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు.

ప్రజాభిప్రాయ సేకరణ అభ్యర్థన విధాన పరిషత్‌లో త్రోసివేత

తెలంగాణ సమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతూ గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో తెలంగాణ ఐక్య సంఘటన నేత కె. రామచంద్రారెడ్డి ప్రతిపాదించగా సవరణకు అధిక సంఖ్యాక సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేయడంతో వీగిపోయింది. సవరణకు అనుకూలంగా కేవలం 6 ఓట్లు రాగా వ్యతిరేకంగా 51 ఓట్లు వచ్చాయి. నలుగురు సభ్యులు తటస్థంగా ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదన చాలా ప్రమాదకరమైనద’న్నారు. ప్రతిపక్షాల సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం తనకు సంతోషం కలిగించిందని ముఖ్యమంత్రి సభలో తెలిపారు.

(స్మారక చిహ్నాల ఏర్పాటు అడ్డుకున్న ప్రభుత్వం… వచ్చే సంచికలో)

Other Updates