magaమన రాష్ట్రం మనం సాధించుకున్నాక, ముఖ్యమైన మన పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తూ వుండడం చూస్తుంటే, తెలంగాణలో గంగా, జమునా తెహజీబ్‌ వర్థిల్లుతున్నదనే విషయం స్పష్టమవుతుంది. బోనాలు, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించుకోవడం సాంప్రదాయంగా మారింది. రంజాన్‌ పండుగ వాతావరణం నెల రోజులుగా దినదిన ప్రవర్థమానవుతున్న తరుణంలో ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందునిచ్చింది. పండుగకు వారం, పది రోజులు వుందనగా ప్రభుత్వపరంగా ఇఫ్తార్‌ విందునివ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉర్దూలో ప్రసంగించారు. ముస్లిం మైనారిటీల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ ఎందుకు అని ఎందరెందరో ప్రశ్నించారు. వారందరికీ సమాధానంగా అన్నిరకాలుగా అన్యాయానికి గురైన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చెప్పేవాడినని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్నాం, మనవైన సరికొత్త ఆలోచనలతో 17.18 శాతం అభివృద్ధితో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని కేసీఆర్‌ అన్నారు. ముస్లిం మైనారిటీలందరికీ వారికి అవసరమైన రంగాలలో సమాన హక్కులను, భాగస్వామ్యాన్ని కల్పిస్తే వారందరూ అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్నట్టుగా, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలుచేసి తీరుతామని కేసీఆర్‌ అన్నారు. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి శాసనసభలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి మోదీతో చర్చించిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని, ఒకవేళ సహకరించని పక్షంలో కేంద్రంతో పోరాడి సాధించుకుందామని కేసీఆర్‌ అన్నారు.

ప్రభుత్వంలోకూడా ముస్లిం ప్రతినిధులకు సముచిత స్థానాలను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ వారికి 10 శాతం వాటా కల్పించడం జరిగింది. ఢిల్లీలో వున్నట్టుగా అంతర్జాతీయస్థాయిలో ఇస్లామిక్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామని, దీనికోసం స్థల సేకరణకూడా పూర్తయిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 204 రెసిడెన్షియల్‌ స్కూళ్ళను ప్రారంభించుకున్నాం అని తెలిపారు. ఈ స్కూళ్ళల్లో, కాన్వెంట్లలో బోధించే తీరు బోధన వుంటది అని వివరించారు. కొత్త ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించేందుకు ప్రయత్నం చేస్తున్నానని కేసీఆర్‌ అన్నారు. ప్రముఖులు, విద్యావేత్తలు, మేధావులు, వృద్ధులనుంచి రాష్ట్ర ప్రగతికోసం సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి అని ముఖ్యమంత్రి అన్నారు.

మునుపు తెలంగాణలో వెలసిల్లిన గంగా, జమునా సంస్కృతి, సంప్రదాయం కొనసాగేవిధంగా సలహాలు వస్తే, ప్రపంచంలోనే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం అని కేసీఆర్‌ అన్నారు. చివరగా ముస్లింలందరికీ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు అసదుద్దీన్‌ ఓవైసీ, కే కేశవరావు, డీ శ్రీనివాస్‌, ముస్లిం మత ప్రముఖులు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారులు ఏకే ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates