sunki-reddtఅల్లం నారాయణ


జర్నలిస్టులకు భరోసా

జనహిత జర్నలిస్టుల హితం అయిన సుదినం ఫిబ్రవరి 17. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు. వేలాదిమంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పోటెత్తిన రోజు. కానీ ఆ రోజు జర్నలిస్టులకు మొదటిసారి ఎనలేని గౌరవాభిమానాలు దక్కాయి. వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆ రోజున స్వయంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా భరోసా కల్పించి లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ ఎనభైమందికి తోడు, నిస్సహాయ స్థితిలో ఉన్న మరి పదహారుమంది జర్నలిస్టులకు యాభైవేల సహాయం అందించారు సీఎం.

అంతేకాదు జనహిత మొట్టమొదటి కార్యక్రమం కూడా ఈ జర్నలిస్టుల సంక్షేమంతోనే ప్రారంభం అయ్యింది. జర్నలిస్టు కుటుంబాలకు సంబంధించిన దరిదాపు అయిదు వందలమందికి ఆనాడు అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి, మిమ్మల్ని ఆదుకోవడానికి ‘నేనున్నాను’ అంటూ కేసీఆర్‌ సంక్షేమం అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టులకు, తెలంగాణ ఉద్యమపార్టీ నాయకుడి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం కల్పించిన అతిపెద్ద భరోసా ఈ కార్యక్రమం.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొట్టమొదట తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ అకాడమీకి అల్లం నారాయణను అధ్యక్షునిగా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి నియామకం. మన సీనియర్‌ సంపాదకులు, వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులతో ఈ అకాడమీ పరిపాలకమండలిని ఏర్పాటు చేశారు.

గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రెస్‌ అకాడమీకి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి, అకాడమీని ఆర్ట్‌ ఆఫ్‌ అకాడమీగా తీర్చిదిద్దాలని, ఒకవేపు సంక్షేమం, మరోవేపు జర్నలిస్టులకు ఉన్నత శిక్షణ ఇచ్చే ఒక సంస్థగా అకాడమీని అభివృద్ధి పరచాలని ఆయన నిర్దేశించారు. ఆ నిర్దేశం ప్రకారమే అకాడమీ ఇవ్వాళ్ల జర్నలిస్టుల సంక్షేమంకోసం ఒక కేంద్రంగా తయారయింది. జర్నలిస్టుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ఆధ్వర్యంలోనే జర్నలిస్టులకు సంక్షేమం ఇవ్వాలని ఆయన నిర్దేశించి, అప్పటికప్పుడు అయిదేళ్లపాటు ఏటా పది కోట్ల రూపాయల వంతున రూ. 50 కోట్లు, మొత్తంగా వంద కోట్లు నిధిని ఏర్పాటు చేయాలని ప్రకటించి, ఫిబ్రవరి, 17న జరిగిన సభలో ఏకమొత్తంగా రూ. 30 కోట్లు ప్రకటించారు. మూడేళ్లపాటు ఈ నిధికి వచ్చిన రూ. 30 కోట్లు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టుల భరోసా కార్యక్రమంలో ఇచ్చిన రూ. 30 కోట్లతో ఇప్పుడు జర్నలిస్టుల నిధికి రూ. 60 కోట్లు జమ అయ్యాయి. ఆ నిధి నుంచి వచ్చిన వడ్డీతోనే మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఇప్పుడు లక్ష రూపాయల ఏక మొత్త సహాయం, అనంతరం అయిదేళ్లపాటు నెలకు మూడువేల రూపాయలవంతున పెన్షన్‌ సాయం అందుతుంది. అట్లాగే ఆ కుటుంబాలలో టెన్త్‌లోపు చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి నెలకు వెయ్యి రూపాయల సహాయం ఈ నిధి ద్వారా అందుతుంది. వృత్తి చేయలేని స్థితిలో అనారోగ్యానికి గురైన కుటుంబాలకు ఏక మొత్తంగా 50వేల రూపాయల సహాయం అందజేస్తున్నాం. ఇది నిజంగానే జర్నలిస్టు కుటుంబాలకు ఒక భరోసాగా భావించవచ్చు.

తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం జరిగిన తర్వాత రాష్ట్రంలో అక్రెడిటేషన్‌ల విధానం, హెల్త్‌కార్డుల విధానాన్ని కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడకముందు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ‘జన జాతర’ సభలో ముఖ్యమంత్రి, డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్‌లు అని ఇచ్చిన హామీకి అనుగుణంగా రామచంద్రమూర్తి కమిటీని ఏర్పాటు చేసి కొత్త అక్రెడిటేషన్‌ విధానం రూపొందించింది ప్రభుత్వం. ఈ అక్రెడిటేషన్ల విధానంలో రిపోర్టర్లకు సమానంగా డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్‌లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 13000 అక్రెడిటేషన్లు ఉండగా, ఒక్క తెలంగాణలోనే ఇప్పుడు 16000 మందికి అక్రెడిటేషన్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే.

ఆరోగ్యానికి హామీ

హెల్త్‌కార్డులు ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్‌తో బీమా ఆధారితంగా ఉండేవి. అది కేవలం లక్ష రూపాయల కవరేజీతో నలభై, యాభైవేల వరకు వాడుకునే పరిమితి ఉండేది. ఒక్కొక్కసారి పెద్ద జబ్బులకు ఆ డబ్బులు దేనికీ సరిపోయేవికావు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, జర్నలిస్టులకు కూడా అవే కార్డులను వర్తింపజేసింది. ఎలాంటి అధికారిక, ప్రభుత్వ గుర్తింపు లేకున్నా, జర్నలిస్టులకు ఇలాంటి కార్డు కల్పించడం ఒక అద్భుతమే. ఒక్కపైసా కూడా చెల్లించకుండా కుటుంబం పరిధి విస్తరించి, (అమ్మానాన్నలకు కూడా కలుపుకొని) అపరిమిత కవరేజీలో ఇప్పుడు జర్నలిస్టుల హెల్త్‌కార్డు అమలులో వుంది. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సౌకర్యం లేదు. దానికితోడు ప్రభుత్వ వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటుచేసి, వాటిద్వారా కూడా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, చివరకు ఉచితంగా మందుల పంపిణీ కూడా అక్కడినుంచి జరుగుతున్నది. ఈ కార్డు క్రింద ఇప్పటికే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ కూడా జరిగింది. గుండె ఆపరేషన్‌ చేయించుకున్న జర్నలిస్టు ఒక్క పైసా చెల్లించకుండా ఆపరేషన్‌ చేయించుకోగలిగాడు. ఇప్పటికి సాంకేతిక సమస్యలు అధిగమించి పదివేలకుపైగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. మిగతావారికి కూడా హెల్త్‌కార్డుల జారీకి ఐ అండ్‌ పీఆర్‌, ఆరోగ్యశ్రీట్రస్ట్‌ కృషి చేస్తున్నాయి.

reddy254హెల్త్‌కార్డు అమలులోకి రావడంలో కొంత జాప్యం జరిగింది. కార్పొరేట్‌ ఆస్పత్రులు రేట్ల విషయంలో మొండికేయడంతో హెల్త్‌కార్డుకు చిక్కులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులతోనూ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందున ఇప్పుడీకార్డును అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులూ అంగీకరిస్తున్నాయి. హెల్త్‌కార్డులు పనిచేయని సమయంలో కూడా ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తరఫున దారిదాపు 180మంది జర్నలిస్టులకు, రెండుకోట్లకు పైచిలుకు రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధినుంచి సహాయం అందింది. కొప్పుల నాగరాజు ఇంగ్లీషులో పనిచేసిన మొట్టమొదటి దళిత జర్నలిస్టు. ఆయన క్యాన్సర్‌ చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి ఎనిమిది లక్షల రూపాయల సహాయం అందింది.అట్లాగే డి. హరికృష్ణారెడ్డి అనే జర్నలిస్టుకు గుండె జబ్బుకు ఒక ప్రత్యేక పరికరం అమర్చాల్సిన అగత్యం ఏర్పడింది. ఆయనకు ముఖ్యమంత్రి నిధినుంచి పది లక్షలు కేటాయించి ఆయనకు ‘సీ ఆర్‌ టీ-డీ ఇంప్లాంటేషన్‌’ చికిత్సకూడా చేయించాము. ఇట్లా హెల్త్‌కార్డులు లేనప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా, ఇప్పుడు హెల్త్‌కార్డు ద్వారా జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యానికి ఢోకాలేని విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

reddaaaఅంతేనా, మరణించిన జర్నలిస్టు కుటుంబాలలో పెళ్లి చేసుకునే ఆడ పిల్లలకు మూడు లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫిబ్రవరి 17న జనహితలో ఆ కార్యక్రమం ప్రకటించిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో మద్దిరాల ఉషారాణి కూతురుకు ఐటీమంత్రి కేటీర్‌ చేతులమీదుగా మూడు లక్షల చెక్కును కూడా అందించారు.

ఇళ్లపై స్పష్టత

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు ఇప్పటికి మూడు విడుతలుగా ప్రభుత్వ స్థలాలు కేటాయించారు. బంజారాహిల్స్‌, జూబిలీహిల్స్‌, గోపనపల్లిలలో ఈ భూమి కేటాయించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి అన్ని యూనియన్ల నాయకులతో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భూములు వెతకడం, అనే క్రమం కొనసాగుతున్నది. అదే క్రమంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలోనే ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో సహా జర్నలిస్టులకు భూమి ఇవ్వడంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఆ కేసులో ఒక తీర్పు వచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చొరవచూపి, మన అధికారులను పంపి ప్రయత్నించారు. జర్నలిస్టులకు భూమి స్వాధీనం చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హౌసింగ్‌ సొసైటీలలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు, ఏ సొసైటీలోనూ సభ్యత్వం లేనివారికి కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖంగా ఉన్నారు. సానుకూలంగా ఉన్నారు. దీనితోపాటు జిల్లాల ప్రధాన కేంద్రాలలో, ఆయా నియోజకవర్గాల స్థాయిలో మంత్రు లు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వడానికి విధి విధానాలు రూపొందించి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది.

శిక్షణ

ప్రెస్‌ అకాడమీ ద్వారా ఈ సంవత్సరంలోనే శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. మెదక్‌ జిల్లా శిక్షణా తరగతులకు 360మంది జర్నలిస్టులు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమాల్లో సంపాదకులు,సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు వీటిని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చే నెల పది, పదకొండు తేదీలలో శిక్షణా తరగతులు ఉంటాయి. తెలంగాణాకు ప్రత్యేకంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ తయారవుతుంది. పుస్తక ప్రచురణ కూడా జరుగుతున్నది. ముఖ్యమంత్రి సూచించిన మేరకు జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల శిక్షణ రెండింటికీ సింగిల్‌ ఏజెన్సీలాగా ప్రెస్‌ అకాడమీ పనిచేస్తున్నది.

తెలంగాణా పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టులకు బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. జై హో జర్నలిస్టు… జైహో బంగారు తెలంగాణ…

Other Updates