miladinabi

ఈనెల 12న ‘మిలాద్‌ ఉన్‌ నబీ’

అజ్నానపు చీకట్లు చీల్చుతూ… అన్నార్తుల బాధలను తీరుస్తూ…

అసత్య నమ్మకాలను ప్రశ్నిస్తూ… మరుభూమిగా మారిన ఎడారిలో ప్రేమపుష్పాలను పూయించగా ప్రభవించిన ప్రియ ప్రవక్త.

‘దైవం ఒక్కడే’ ఆయన నినాదం, నిరాడంబరమే ఆయన జీవన విధానం. పాషాణ హృదయాలు కరిగించిన సహనం, అందరికీ ఆదర్శం మహమ్మద్‌ ప్రవక్త జీవితం. మమతానురాగాలకు చితులు పేర్చి, సమాధిచేసిన బంధాలకు మానవత్వపు విలువనిచ్చి, తట్టిలేపి, నైతికతను నేర్పిన మహోపకారి ప్రవక్త. అంగడి బమ్మ అయిన అతివకు, సజీవ సమాధి అవుతున్న ఆడ శిశువుకు ఉత్కృష్ట స్థానం ఇచ్చి, వారి జీవితాలను స్వర్గధామం చేయగా ఉదయించిన సంస్కర్త. ఆయన మాట అమృత వచనం. ఆయన బాట మోక్షమార్గం. ఆయన అడుగు జాడలే మానవజాతికి సాఫల్యం.

ప్రవక్త మహమ్మద్‌ ఓ సంఘ సంస్కర్తగా, ఆదర్శ భర్తగా, ఉత్తమ కుటుంబ యజమానిగా, నిజాయితీగల వ్యాపారిగా, అంకితభావం గల నాయకునిగా, సమర్థుడైన పాలకునిగా, క్షమాగుణం

కలబోసిన పరిపాలకుడుగా, ఉత్తమ న్యాయ కోవిధుడుగా, అద్భుతమైన శీల నిర్మాతగా పేరొందారు. దయాగుణం, క్షమాగుణం ఆయన సుగుణాలు. సంస్కారంగా, మర్యాదగా, మృదుత్వంగా, వాత్సల్యంగా, సచ్ఛీలతగా, సత్యసంధతగా, సౌమ్యంగా, ధాతృత్వంగా, ప్రేమగా, జాలిగా, సంపూర్ణంగా మూర్తీభవించిన గొప్ప వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకతలు.

అంతిమ దైవ ప్రవక్త జన్మదినాన్నే ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ అంటారు.మహా ప్రవక్త జననం మానవాళికి శుభోదయంగా ముస్లీం సమాజం భావిస్తుంది. అజ్నానాంధకారంలో విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న మానవజాతికి ఆయన వెలుగుబాట చూపారని వారు విశ్వసిస్తారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఇస్లామీ ధార్మిక ఉద్యమ సందేశ ప్రధాత అయిన మహమ్మద్‌ ప్రవక్తను, ఆయన సందేశాన్ని ఆయన పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా గుర్తు చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

క్రీ.శ. 571 సంవత్సరంలో అరేబియా దేశంలోని మక్కా నగరం

లో మహమ్మద్‌ ప్రవక్త జన్మించారు. తల్లిపేరు అమీనా, తండ్రిపేరు అబ్దుల్లాహ్‌. కాగా ప్రవక్త జన్మించక ముందే తండ్రిని, ఆరేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి అనాధగా మారగా తాతయ్య అబ్దుల్‌ముతల్లిబ్‌ తన దగ్గర చేర్చుకున్నారు. చిన్న తనం నుంచే బాల మహమ్మద్‌ సుగుణాల ప్రశంసలు అందుకున్నారు. నీతి, నిజాయితీ, సేవా తత్పరత, విశ్వసనీయత వంటి సద్గుణాలు ఆయనకు ఉగ్గుపాలతో అలవడ్డాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నిస్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించడం వంటి అనేక సుగుణాల వల్ల ఆయన ప్రజల మన్ననలు చూరగొని సాధిక్‌ (సత్యసుధుడు)గా, అమీన్‌(విశ్వసనీయుడు)గా పేరొందారు. మహమ్మద్‌ ప్రవక్త ఆదర్శ వివాహం చేసుకున్నారు. సౌభాగ్యవతి, సౌశీల్యవతి, సుందర వదనం కలిగిన ఖదీజా ఇద్దరు భర్తలను కోల్పోయి వితంతువుగా మారగా ప్రవక్త ఆమెను పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలని, అలాగే తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని సూచించారు.

ఆనుసరణీయ బోధనలు…

అనాధలను ఆదరించి, సంరక్షించే వారిని స్వర్గవాసులని శుభవార్త ఇచ్చారు మహాప్రవక్త. వారితో సత్‌ప్రవర్తన కలిగిఉండాలని, వారి ఆస్తిని కబళించకూడదని స్పష్టంగా ఆదేశించారు. అలాగే తమ సంతానం వలె వారిని చూసుకోవాలని పిలుపునిచ్చారు.

మిత్రులను ప్రేమించాలని, ఎప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని, సత్యం విషయంలో ఆయన అందరిని సమదృష్టితో చూడాలని, ధనికులైనా, పేదవారైనా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి మన్నించాలని, వ్యాధి గ్రస్తులు ఎవరైనా వారిని పరామర్శించాలని ఉద్భోదించారు.

వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవ ప్రదమైనస్థానం దక్కాలనిఅభిలషించారు. శుభకార్యాలకు వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అమానవీయ దురాచారాన్ని మానుకోవాలని ఉపదేశించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహాలకు

ప్రయత్నించాలని, అలాంటి వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అధోగతి పాలవుతుందని ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆధరించాలని, వారిని చీత్కరించుకోకూడదని ఒకనాటికి అందరూ ఆ దశకు చేరుకునే వారేననే విషయాన్ని గుర్తెరగాలని మహా ప్రవక్త హితవు పలికారు.

విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ప్రవక్త నిర్ధేశించారు. జ్నానం జీవితమని, అజ్నానం మరణమని విశదీకరించారు. అందువల్ల ప్రతి ఒక్కరు తమ సంతానానికి విధిగా చదువు నేర్పించాలని స్పష్టం చేశారు. తమ కోసం కాకపోయినా ముందు తరాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు అక్షరాస్యులు కావడం అవశ్యకమని నొక్కి చెప్పారు.

శత్రువుల పట్ల మృధువైఖరి అవలంభించాలని చెప్పారు. నిన్ను ద్వేషించిన వారికి కూడా మేలు కలుగజేయండి అని నొక్కి చెప్పడంతోపాటు ఆయన అనుసరించి చూపించారు.

సమాజం శాంతి సౌభాగ్యాలతో అలరారాలంటే, అన్ని రకాల అసమానతలు అంతమై సమస్త మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లాలంటే, ఇహపర జీవితాలు సఫలం కావాలంటే తన బోధనలు ఆచరించి, తానుచూపిన మార్గంలో పయనించాలని మహమ్మద్‌ ప్రవక్త ఉద్భోదించారు.

సూరి

Other Updates