telkapalliసంబరాజు రవిప్రకాశ రావు

మహబూబ్‌ నగర్‌ జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామానికి చెందిన తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవి, పండితుడు, పండిత ప్రకాండుడు. జ్ఞాన సము పార్జనకోసం ఉత్తములైన గురువులను అన్వేషిస్తూ, వారిని సేవిస్తూ అనేక విషయాలలో పట్టును సాధించాడు’ కవితా కాంత స్వయంవరం’ నుండి ‘రవీంద్ర తప:ఫలం’ వరకు పదిహేనుకుపైగా రచనలు చేశాడు. వ్యాకరణం, సాహిత్యం, వేదం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాల్లో , పాండిత్యం సముపార్జించిన తెలంగాణ తల్లి ముద్దుల బిడ్డడు. తన అచ్చమైన తెలంగాణ యాసతో మాట్లాడతూ స్నేహితులతో ‘నైజాం శాస్త్రి అని పిలిపించుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణకు గీతగోవిందాన్ని బోధించిన ఉత్తమ గురువు. 1902లో పుట్టిన శాస్త్రి 1990లో మరణించాడు. అద్భుతమైన సంస్కృత భక్తి సాహిత్యాన్ని సృష్టించిన శాస్త్రి విమర్శకులను సైతం మెప్పించి అభినవ కాళిదాస, కవికులాలంకార, కవి కల్పద్రుమ, అలంకార నటరాజ బిరుదులను అందుకున్నాడు.

తెల్కపల్లివారు కల్పనతో సృష్టించిన తొలి కావ్యం ‘కవితా కాంత స్వయంవరం’ ఇందులోని ఒక పాత్ర ‘ కవిత’ ఆమె వరుని ఎంపిక శాస్త్రి హృదయ దర్పణంగా భావించాలి. ఈ కావ్యం ద్వారా లోక జ్ఞానం, వాదించడానికి వెనుకాడని థీరత, ముఖంలో తేజస్సు, మనసులో వివేకం ఉన్న ప్రేమికులకే కవిత్వం సాధ్యపడతుందని, పాట దానితో కలిసి నడుస్తుందని ప్రతీకాత్మకంగా వర్ణించారు. ఇది 55 ఆర్యావృత్తాలతో కూడిన ఖండ కావ్యం. దీనిలో శాస్త్రి అభిరుచి, స్వీయసామర్థ్యం, సరసకవితా చాతుర్యం మనకు కనబడుతున్నవి, శాస్త్రాలను చదివి గర్వించే పండితులకంటే పరిమిత శాస్త్ర జ్ఞానంపొంది కవితల్లో నైపుణ్యమును సంపాదించిన కవి లోకంలో ఆదరాభిమానాలను పొందుతున్న భావాన్ని ధ్వనింపచేయడాన్ని మనమంతా గమనించాలి.

‘శ్రీలలితా స్తవఝరి’ శాస్త్రిగారి భక్తి శైలము నుండి ప్రవహించిన ఒక రసప్రవాహం. ఈ కావ్యములో వీరు కరుణామూర్తియైన లలితాంబను, శారదను పొగిడిన తీరును అనుసరించి వీరికున్న వ్యాకరణ వేదాంత శాస్త్ర పరిచయాన్ని మనం అంచనా వేయవచ్చు. శ్రీ లలితాంబ శరీర కాంతి బాలసూర్యునివలె, పగడపు తీగగా, సింధూరకణిక, పద్మరాగమాంబలప్రభగా వీరు వర్ణించడం బాగుంది.

లలితాంబిక తేజస్సును చూస్తున్న మునులను చూడదగింది మరొకటి లేదని, తేజస్సును తెలపనున్నవారికి తెలుసుకో దగినది మరొకటి లేదని, చిదానంద స్వరూపమైన ఆ జ్యోతిని చేరినవారికి మరొక గమ్యస్థానం లేదని శాస్త్రి భావించడం వారి భక్తిభావాన్ని. అద్వైత సిద్ధాంత పరంపరాజ్ఞానాన్ని తెలుపుతున్నది. లలితాంబికాదేవి చిరునవ్వును తన కన్నులయందు పచ్చకర్పూరమై ఉండి చల్లదనం చేకూర్చునదిగా, తనకు సుఖము లనిచ్చేదిగా భావించారు. ఈ శ్లోకములో వాడిన చంద్రన్‌, కుందన్‌, ముక్తాహరన్‌ , కర్పూరన్‌ అను పదాలు వారి వ్యాకరణ శాస్త్ర పాండితిని వెల్లడిచేస్తున్నది. మమకార జ్వరపీడితమై ఏడుస్తున్న తన మనస్సనే శిశువును లలితాంబికా పాదాలనే ఉయ్యాలపై వేసుకొని ఓదార్చమని, సుఖాన్ని ఇవ్వమని ప్రార్థించుటలో భక్తిరసం ఉప్పొంగుతున్నది.

ధ్వనిపూర్వక పద ప్రయోగాలతో,అన్ని అలంకారాలు తొడుగు కున్న గుణాలతో వెలుగులు చిమ్ముతూ, రసాలతో నిండిన సుకవి రచించిన కావ్యం లాగా మంచి ప్రవర్తనగల ప్రపంచంలో సరస్వతి వెలుగొందాలని ‘ శారదా స్తుతి శతకం’లో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి కోరుకున్నాడు. ఇందులో నుంచి కావ్య లక్షణాలను, మంచి లోకపు లక్షణాలను పేర్కొన్నాడు. దుర్గ, లక్ష్మి, సరస్వతులతో పాటు సావిత్రి, రాధలను కూడా చేర్చి ఐదు ప్రకృతులను వర్ణించి పూర్ణ భావన చేశాడు. శక్తి, సంపద, విద్యలకు ధర్మము, ప్రేమ చేర్చడమనేది ఒక మధుర భావన రామచంద్ర శాస్త్రి శ్రీ శారదాదేవిని చిత్స్వరూపిణిగాను, త్రిలోకమాతగాను, త్రిపురసుందరీ దేవిగాను ఎన్నెన్నో భావనలతో తన ఆత్మనందు సాక్షాత్కరించుకొని ఈ స్తుతిని రాశారు. శృంగేరి పీఠం అధిష్ఠాన దేవతైన శారదాదేవి వర్ణననే శారదాస్తుతి శతకం. ఈ శతకం ఆర్యావృత్తములలో నడిచింది. పద్యాలలో ప్రాసనియమం పాటించబడింది. భావములోను, భాషలోను ఎంతో పరిణతి కల్గి ఆనందాన్ని కలిగిస్తూ మూక మహాకవి ఆర్యాశతకాన్ని తలపిస్తున్నది.

తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి విమర్శనాగ్రేసరతకు గీటురాయిగా ‘శ్రీ గురుపీఠ తత్వ దర్శనమ్‌’ నిలుస్తుంది. దీనిని రాయడానికి ఆయన కాశీ, పూనాలలో ఉన్న గ్రంథాలయాలను సందర్శించాడు.

దైవప్రళయరూపమగు సుషుప్తి నుండి జగత్తు మేల్కొని చేతనను పొందుతున్నదని, యోగనిద్రను విడిచి మేల్కొనమని ‘శ్రీమదుమామహేశ్వర సుప్రభాతం’లో ఈశ్వరుడిని కోరారు. ఈ సుప్రభాతంలో వీరి శివభక్తి పరాకాష్ఠను పొందింది. సప్త ఋషులు, గంగాజల పూర్ణకుంభముతోను, కల్పవృక్ష పుష్పాల తోను. హరిచందనాది వస్తు సామాగ్రితోను పూజించుటకు వచ్చారని, మహేశ్వరున్ని లెమ్మన్న చక్కని ఊహ యిందులో కనబడుతుంది.

స్తోత్రముకు కూడా శాస్త్రి కావ్యరూపం కల్పించారు. దాదాపు 40 సంవత్సరాల కిందట ‘భజే కృష్ణవేణీమ్‌’ పేరిట కృష్ణవేణినది స్తుతిని రాశాడు. కృష్ణవేణి పుట్టుపూర్వోత్తరాల నుండి ఆ నదికి వచ్చే పుష్కరాల వరకు అనేక విషయాలను రాశాడు. ఇది భుజంగ ప్రయాత వృత్తంలో ఉంది. పూజా విధానం, కృష్ణవేణి గొప్పదనం ఈ స్తుతిలో మనకు కనబడతాయి. తెలంగాణ నేలను పునీతం చేస్తూ ప్రవహిస్తున్న పావన జీవనాధారయైన కృష్ణా నదీ తల్లిపై ఇంత అందమైన స్తుతి మరొకటి కనబడదు. సహ్యాద్రి నుండి సాగరం వరకు సాగే కృష్ణవేణీ ప్రవాహాన్ని, దాని గంభీర గమనాన్ని రమణీయ అలంకారాలతో కమనీయంగా చెప్పిన కవితా ప్రవాహమే భజే కృష్ణవేణిమ్‌ స్తుతి. ఈ స్తుతితో పాటు కంచి పరమాచార్యుల స్తుతి, జయేంద్ర సరస్వతి స్తుతి, అభినవ విద్యాతీర్థుల స్తుతి. వేంకటేశ్వర పంచరత్న స్తుతి, సరస్వతీ స్తుతి, కంచి కామాక్షి పంచరత్న స్తుతులవంటివి ఎన్నో శాస్త్రి కలం నుండి జాలువారినవి. లక్ష్మీనరసింహ సుప్రభాతం, అంజనేయ సుప్ర భాతం కూడా రాశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అనేక సంస్థానాలలో సత్కారాలు, సన్మానాలు పొందారు. 1979 ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా సత్కరింపబడ్డాడు. వడ్రంగం, కుమ్మరం, ఒంటబట్టించుకొని అనేక కళాఖండాలను తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయుర్వేద వైద్యులుగా, గ్రామ సర్పంచ్‌గా సామాన్య జనానికి చేసిన సేవ వెల కట్టలేనిది.

అమృతాన్ని తృణీకరించే వాక్కుతో, కమలాలను వణికించే పాదకాంతితో, కలువలను సిగ్గుపడేటట్లు చేసే చిరునవ్వు సొగసుతో లలితాదేవిని తన ఎదుట సాక్షాత్కరించమని వేడుకొనే శ్లోకంలో వీరి భావుకత కొత్త పుంతలు తొక్కింది. ఉపమ, రూపకాలను మించిన నవాలంకారం కూర్చిన ఈ కవి ప్రతిభ వెలుగులు విరజిమ్మింది. సంస్కృతంలో యింత బలంగా రాయగలిగిన రామచంద్రశాస్త్రి తెలంగాణకు గర్వకారణం.

ధ్వనిపూర్వక పద ప్రయోగాలతో,అన్ని అలంకారాలు తొడుగుకున్న గుణాలతో వెలుగులు చిమ్ముతూ, రసాలతో నిండిన సుకవి రచించిన కావ్యం లాగా మంచి ప్రవర్తనగల ప్రపంచంలో సరస్వతి వెలుగొందాలని ‘శారదా స్తుతి శతకం’లో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి కోరుకున్నాడు.

Other Updates